కొరియా నుంచి మోనోగ్లిజరైడ్స్ - రసాయన మిశ్రమాలతో తయారుచేసిన కల్తీ నెయ్యే టీటీడీకి సరఫరా
వెజిటబుల్ ఆయిల్ లేదా జంతుకొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారీ - భోలేబాబా డెయిరీకి సుగంధ్ ఆయిల్ సంస్థ సరఫరా చేసినట్లు నిగ్గుతేల్చిన సిట్ - కల్తీ నెయ్యే టీటీడీకి సరఫరా చేసినట్లు ఎన్‌డీడీబీ- సీఏఎల్‌ఎఫ్ నివేదిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 7, 2026 at 9:06 AM IST
Monoglycerides in TTD Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనలో రోజుకో కొత్త విషయంలో వెలుగులోకి వస్తోంది. సిట్ దర్యాప్తులో వెలుగుకి వస్తున్న విషయాలు తెలిసి భక్తులు ఆవేదన చెందుతున్నారు. భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని మోనోగ్లిజరైడ్స్ అనే రసాయనాన్ని వినియోగించి తయారు చేసినట్లు సిట్ నిగ్గు తేల్చింది. దిల్లీలోని రఘుబీర్ శరణ్ ఓవర్‌సీస్ సంస్థ వీటిని కొరియా నుంచి దిగుమతి చేసుకోగా సుగంధ ఆయిల్ సంస్థ వాటిని భోలేబాబా డెయిరీకి సరఫరా చేసినట్లు తెలిసింది.
గత ఏడాది ఏప్రిల్ నెల 23న సిట్ అధికారులు సుగంధ ఆయిల్స్ సంస్థలో తనిఖీలు చేపట్టగా వీనస్ బ్రాండ్ లేబుల్ తే 200 కిలోల కెపాసిటీ ఉన్న డ్రమ్ముల్లో భారీగా మోనోగ్లిజరైడ్స్ కనిపించింది. ఆ డ్రమ్ములపై ముద్రించిన లేబుళ్లపై కొరియాకు చెందిన ‘ఐఎల్ షిన్ వెల్స్ కో లిమిటెడ్’ కంపెనీ తయారు చేసినట్లు ముద్రించి ఉంది. సిట్ అధికారులు ఉత్తరాఖండ్ భగవాన్‌పుర్‌లోని భోలేబాబా డెయిరీలో సోదాలు చేసినప్పుడు, అక్కడ కూడా మోనోగ్లిజరైడ్స్ లభించాయి. వాటితో తయారు చేసిన కల్తీ నెయ్యినే తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
జంతు కొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారీ: సాధారణంగా మోనోగ్లిజరైడ్స్ ను వెజిటబుల్ ఆయిల్స్ లేదా జంతుకొవ్వులతో తయారు చేస్తారు. ధర తక్కున కారణంగా నెయ్యి తయారీకి భోలేబాబా డెయిరీ వారు జంతు కొవ్వులనే వినియోగించినట్లు తెలుస్తోంది.
టీటీడీ అధికారులు 2024 జులైలో నెయ్యి శాంపిళ్లను పరీక్షల కోసం ఎన్‌డీడీబీ-సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ పంపగా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉండొచ్చని ఆ రిపోర్టులో వచ్చింది. సిట్ అధికారులు మాత్రం దీనిపై సరిగా దర్యాప్తు చేయకుండా వదిలేశారు.
మరోవైపు ఏఆర్ డెయిరీ పేరుతో భోలేబాబా సంస్థ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ల నుంచి సేకరించిన శాంపిళ్లలో నాలుగింటిని 2024 జులైలో టీటీడీ గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ-సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ కు పంపింది. ఆ నమూనాల్లో గొడ్డు కొవ్వు, పందికొవ్వు ఉండొచ్చని వెల్లడైంది.
నెయ్యిలో ఎస్ వ్యాల్యు 95.90 నుంచి 104.10 మధ్య ఉండాలి. కానీ ఆ పరీక్షల్లో ఎస్ విలువ 23.22గా వచ్చింది. దీంతో ఆ నెయ్యిలో గొడ్డు కొవ్వు ఉండవచ్చని ఎన్ డీడీబీ నివేదికలో పేర్కొంది. మరో రిపోర్టులో 97.96 నుంచి 102.04 మధ్య ఉండాల్సిన ‘ఎస్-విలువ’ 116.09గా వచ్చింది. దీన్ని బట్టి పందికొవ్వు ఉండొచ్చని ఆ ల్యాబ్ పేర్కొంది.
పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ధర తక్కువ కాబట్టి మోనోగ్లిజరైడ్స్ తయారీ కోసం వీటినే వినియోగించినట్లు సమాచారం. ఎన్‌డీడీబీ నివేదికలో అంశాల్ని, సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాల్ని పరిశీలిస్తే జంతుకొవ్వుతో తయారు చేసిన మోనోగ్లిజరైడ్స్‌నే నెయ్యి తయారీలో వాడి ఉంటారనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేయకుండా వదిలేశారు.
నకిలీ ఇన్‌వాయిస్‌లతో కొనుగోలు : వంట నూనెల పేరుతో భోలేబాబా డెయిరీ సుగంధ ఆయిల్స్ నుంచి నకిలీ ఇన్‌వాయిస్‌లతో మోనోగ్లిజరైడ్స్ కొన్నట్లు సిట్ నిర్ధారించింది. జంతుకొవ్వులతో తయారైనది కాకపోతే మోనోగ్లిజరైడ్స్‌ను వంట నూనెల ముసుగులో కొనుగోలు చేయాల్సిన అవసరం ఆ సంస్థకు ఏమొచ్చింది.
రసాయన మిశ్రమాన్ని నెయ్యిలా నమ్మించేందుకు : భోలేబాబు డెయిరీలో పామాయిల్, పామ్‌కెర్నెల్ ఆయిల్‌లో మోనోగ్లిజరైడ్స్‌తో పాటు బీటాకెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్ వంటివి కలిపి నెయ్యి తయారు చేసినట్లు సిట్ తేల్చింది. ఆ రసాయన మిశ్రమం నెయ్యి అనే నమ్మించేందుకు, నిల్వ ఉండే సమయాన్ని పెంచేందుకు మోనోగ్లిజరైడ్స్ వాడతారు. ల్యాబ్‌లో పరీక్షిస్తే నెయ్యే అని రిజల్ట్స్ వచ్చేలా ఈ రసాయనాలు కలిపినట్లు సమాచారం.
శ్రీశైలం దేవస్థానంలోనూ కల్తీ నెయ్యి - నాటి సీఎం వైఎస్ జగన్కు ఫిర్యాదు
కల్తీ నెయ్యి తయారీలో మరో ఘోరం - లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనర్‌లో వాడే లబ్సా కెమికల్స్

