కల్తీ నెయ్యి సరఫరా చేసినా మీరెందుకు గుర్తించలేదు - భూమనను ప్రశ్నించిన సిట్
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఛైర్మెన్ భూమనను విచారించిన సిట్ - సుమారు రెండున్నర గంటలపాటు ప్రశ్నించిన అధికారులు - అప్పట్లోనే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 28, 2025 at 11:42 AM IST
Sit Investigation to Former TTD Chairman Bhumana: తిరుమల లడ్డూ తయారీకి తమిళనాడు దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ మీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా చేసినా మీరెందుకు గుర్తించలేదని అప్పట్లోనే ఎందుకు చర్యలు తీసుకోలేదని సిట్ అధికారులు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని ప్రశ్నించారు. తిరుపతి అలిపిరి సమీపంలోని సిట్ కార్యాలయంలో సుమారు రెండున్నర గంటల పాటు భూమనను విచారించారు. టెండర్లు పిలవడం, ఖరారు చేయడం అంతా అధికారులే చూసుకుంటారని తనకేం సంబంధమని అధికారుల ఎదురు ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
తిరుమలలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ పాలనలో టీటీడీలో తొలుత ప్రత్యేక ఆహ్వానితుడిగా అనంతరం 2023 ఆగస్టు నుంచి వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయే వరకు పాలకమండలి ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకరరెడ్డిని సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు శనివారం ప్రశ్నించారు.
తిరుపతి సిట్ కార్యాలయంలో సుమారు రెండున్నర గంటలపాటు ఆయనను విచారించారు. 2020లో టెండర్ నిబంధనలను సరళతరం చేయబట్టే అర్హత, సామర్థ్యం లేని డెయిరీలు టీటీడీకి నెయ్యి సరఫరా చేశాయని అప్పట్లో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న మీకు దీనిపై సమాచారం ఉందా అని సిట్ ప్రశ్నించింది. సంబంధిత కమిటీలే నిర్ణయం తీసుకుంటాయని తర్వాత బోర్డులో తీర్మానాలు చేస్తారని వాటికి తాము ఆమోదం మాత్రమే తెలుపుతామని భూమన సిట్ అధికారులకు తెలిపారు.
సక్రమంగా తనిఖీ చేస్తున్నారా: కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి నెయ్యి సరఫరా చేసే డెయిరీల ప్లాంట్లను సక్రమంగా తనిఖీ చేస్తున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత మీపై ఉంటుంది కదా అని సిట్ అధికారులు భూమనను ప్రశ్నించారు. డెయిరీ నిపుణులు, కొనుగోళ్ల విభాగంలోని అధికారులు, ఉద్యోగులకే ఇందులో ప్రధాన పాత్ర ఉంటుందని భూమన చెప్పినట్లు సమాచారం. ఏఆర్ డెయిరీకి టెండర్లు కట్టబెట్టాలని మీపై ఎవరైనా ఒత్తిడి చేశారా అని ప్రశ్నించగా నిబంధనల ప్రకారమే వ్యవహరించి ఉంటారని చెప్పినట్లు తెలుస్తోంది.
2020లో టెండరు నిబంధనలు సడలించిన తర్వాత మీ హయాంలోనే తిరిగి గతంలోలాగే నిబంధనలు ఎందుకు కఠినతరం చేశారని సిట్ అధికారులు అడిగారు. పాల సేకరణ సామర్థ్యం, టర్నోవర్ పెంపునకు ఆమోదం తెలపడానికి కారణమేంటని ప్రశ్నించగా ఇది కూడా తన పరిధిలో లేని వ్యవహారమని సంబంధిత అధికారులే చూసుకుంటారని భూమన చెప్పినట్టు తెలిసింది. భోలేబాబా ప్రతినిధులు మిమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించారా అని అడగ్గా లేదని బదులిచ్చారు. శనివారం విచారణ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన భూమన తర్వాత తిరిగి హైదరాబాద్‌కి వెళ్లిపోయారు.
చిన్న అప్పన్నకు కమీషన్: మరోవైపు కల్తీ నెయ్యి కేసులో ప్రమేయం ఉండి ఇప్పటికే ఛార్జ్‌షిట్‌లో నిందితులుగా ఉన్న ఉద్యోగుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు గతంలో టీటీడీని అడిగారు. ఇందులో నలుగురిని ప్రాసిక్యూషన్‌కు అనుమతించారు. వారం, 10 రోజుల్లో మిగతా వారికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవుతుంది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా తదితర డెయిరీల నుంచి చిన్న అప్పన్న కేజీకి రూ.25 చొప్పున కమీషన్ డిమాండ్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఇందుకుగానూ సిట్ తరఫున సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్ పీఎస్‌పీ సురేశ్‌కుమార్ గతంలోనే హైకోర్టులో వాదనలు వినిపించారు. చిన్న అప్పన్నకు కమీషన్ ఇచ్చినట్లు తిరుమల లడ్డు తయారీకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీ యజమానులు వాంగ్మూలాలు ఇచ్చారన్నారు. ఈ కమీషన్లు ఎవరి ప్రోద్భలంతో వసూలు చేశారో దర్యాప్తులో తేలాల్సి ఉందని ఆయన అన్నారు.
ప్రతిదీ ఉమ్మడి నిర్ణయమే - అంతకుమించి నాకేం గుర్తులేదు: చెవిరెడ్డి భాస్కరరెడ్డి

