పిల్లల కోసం దత్తత మార్గం ఎంచుకుంటున్నారా? - ఇకపై ఈ నిబంధనలు పాటించండి
సంతానం లేని దంపతులను ముంచుతున్న దళారులు - డబ్బులు ఇస్తే గానీ బిడ్డనిస్తామని ఆశ పెడుతున్న వ్యక్తులు - పిల్లలు లేని దంపతులు ఇలా చేస్తే చట్టబద్ధంగా దత్తత తీసుకోవచ్చు

Published : January 9, 2026 at 6:02 PM IST
Brokers are Exploiting Childless Couples : మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా వివాహాలు. ఇలా ఇతర అనారోగ్య సమస్యల వల్ల దేశంలో చాలా జంటల్లో సంతాన లేమి పెరుగుతోంది. అమ్మా నాన్న అని పిలిపించుకోవాలని ఎవరికి ఉండదు. చాలా జంటలు సంతానం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో చెకప్‌లు చేయించుకొని విసిగిన తర్వాత వారు దత్తత మార్గం ఎంచుకుంటారు. కానీ ఇటీవల జరుగుతున్న ఈ దత్తత ప్రక్రియలో ఎన్నో సంక్లిష్టతలు నెలకొన్నాయి.
బాండ్ పేవర్పై ఒప్పందం తర్వాతే ఏదైనా : విద్యావంతులు, అవగాహన ఉన్నవారు చట్టబద్ధంగా దత్తత తీసుకుంటున్నారు. నిరక్షరాస్యులు, దత్తతపై అవగాహన లేని వారిని దళారులు నిండా ముంచుతున్నారు. రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇస్తే బిడ్డనిస్తామని తల్లిదండ్రులకు ఆశ చూపుతున్నారు. వంద రూపాయల బాండ్ పేపర్‌పై ఒప్పందం రాసుకుంటే దత్తత పూర్తవుతుందంటూ మోసగిస్తున్నారు.
దత్తత తర్వాత చిక్కుల్లో : తీర దత్తత తీసుకొని కొన్నాళ్లు పెంచుకున్నాక ఆ దంపతులు చిక్కుల్లో పడుతున్నారు. పెంచుకున్న పిల్లలను శిశుగృహకు తరలిస్తుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చట్టబద్ధంగా దత్తత తీసుకునే విధానం, అక్రమంగా పిల్లలను కొనుక్కుంటే వచ్చే ఇబ్బందులపై ''ఈటీవీ భారత్'' ప్రత్యేక కథనం.
ఇటీవల మోసపోయిన ఘటన : లక్షెట్టిపేట మున్సిపాల్టీ మోదెలలో ఓ దంపతులకు వంద రూపాయల బాండ్ పేపర్‌పై ఒప్పందం చేయించి ఒక శిశువును దళారుల దత్తత పేరిట అప్పగించారు. సంవత్సరం పాటు పెంచుకున్నాక ఈ విషయం బయటకు పొక్కి పోలీసులు చిన్నారిని శిశుగృహానికి తరలించారు. గతంలో ఆదిలాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. దీంతో పెంచుకున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
''పిల్లలు లేని వారు దత్తత తీసుకోవాలనుకుంటే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. దత్తత ఇవ్వడం కోసం జాతీయ స్థాయిలో కేంద్రీయ దత్తత వనరుల ఏజెన్సీ (కారా) పని చేస్తోంది. కారా ఏజెన్సీ కింద రాష్ట్ర దత్తత వనరుల కేంద్రాలు వర్క్ చేస్తాయి. ఇక్కడ ఆర్థిక భారంతో తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అనాథలను శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీస్తారు. ఇక్కడ వీరినే దత్తత ఇస్తారు.'' - రౌఫ్ ఖాన్, జిల్లా సంక్షేమాధికారి, మంచిర్యాల
చట్టబద్ధంగా దత్తత ఇలా :
- పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే దంపతులు కేరింగ్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవసరమైన సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. పూర్తి వివరాలు నమోదు చేయాలి.
- దత్తత తీసుకునే వారు అమ్మాయా, అబ్బాయా, వయసు, ఎందుకు దత్తత తీసుకుంటున్నారో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి.
- పరిశీలన తర్వాత పిల్లల సంరక్షణ కమిటీ 60 రోజుల్లో దరఖాస్తు వివరాలపై తనిఖీ చేసి పోర్టల్‌లో నమోదు చేస్తారు.
- చిన్నారుల వరుస సంఖ్య ఆధారంగా ఎంపిక చేసుకునే అవకాశం సంరక్షకులుగా ఉండేవారికి కల్పిస్తారు.
- సీనియారిటీ ఆధారంగా పిల్లల కేటాయింపు జరుగుతున్నందున దత్తతకు దరఖాస్తు చేసుకున్నాక ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల గడువు అవసరం ఉంటుంది.
- అలాగే హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నా కేంద్రీయ దత్తత వనరుల ఏజెన్సీ (కారా) అనుమతి పొందాల్సి ఉంటుంది.
''దత్తత ఏ విధంగా జరిగినా అందులో ఆర్థిక అంశాలు ఉంటే దాన్ని నేరం కింద పరిగణిస్తారు. సంతానం లేని వారు దత్తత తీసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకుని నిబంధనలు పాటించాలి. పిల్లలను దత్తత పేరిట కొనడం, అమ్మడం వంటివి చేయడం చట్టవిరుద్ధం. చిన్నారులను అక్రమ రవాణా చేసే వారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయి.'' - భాస్కర్, డీసీపీ, మంచిర్యాల
8 నెలల శిశువును గుప్త నిధులకై బలిచ్చే ప్రయత్నం- పోలీసుల ఎంట్రీతో!

