ప్రైవేట్‌కు తక్కువేం కాదు - ప్రభుత్వ బడుల్లో 'నో అడ్మిషన్' బోర్డులు!
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కళ - కొన్నిచోట్ల నో అడ్మిషన్ బోర్డులు - ఉపాధ్యాయుల సమష్టి కృషి - మౌలిక సదుపాయాలతో ఆదరణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 20, 2026 at 9:48 AM IST
Admissions Increase in Government Schools : ఒకప్పుడు నాణ్యమైన విద్యా బోధన, మెరుగైన మౌలిక వసతుల కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపేవారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతోంది. కార్పొరేట్ బడులకు దీటుగా సర్కారు పాఠశాలలు రూపురేఖలు మార్చుకుంటూ సరికొత్త భరోసాను ఇస్తున్నాయి. డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ఆధునికీకరణ, సాంకేతిక ఆధారిత విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనతో నేడు ప్రభుత్వ బడులు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఫలితంగా, ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రవేశాల డిమాండ్ ఎంతగా పెరిగిందంటే ‘ఇక్కడ సీట్లు లేవు’ అనే బోర్డులు పెట్టే స్థాయికి సర్కారు బడులు చేరుకోవడం విశేషం.
ప్రవేశాలకు విపరీతమైన డిమాండ్: విశాఖ జిల్లాలోని చంద్రంపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తూ రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులతో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇక్కడ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇక్కడ విద్యాబోధన సాగుతోంది. దీని ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం డిమాండ్ భారీగా పెరిగింది.
ఈ విద్యా సంవత్సరంలోనే కొత్తగా మరో 400 మంది చేరడంతో, మొత్తం విద్యార్థుల సంఖ్య మొత్తం 2,713కు చేరింది. ఇక్కడ మొత్తం 104 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మొత్తం 62 తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన సాగుతోంది. ఆధునిక గ్రంథాలయంతో పాటు విద్యార్థులకు నిపుణులచే వ్యక్తిత్వ వికాస శిక్షణ కూడా అందిస్తున్నారు. చదువుతో పాటు క్విజ్, వ్యాసరచన, భగవద్గీత పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
జాతీయ ప్రతిభా ఉపకార వేతనం పరీక్షతో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, నేవీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, గ్రీన్కోర్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏఐ ల్యాబ్‌లో రోబోటిక్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, కోడింగ్‌లో మెలకువలు, స్టెమ్టూల్స్, సెన్సర్ల వంటి వాటి పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటివరకు నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 27 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం విశేషం.
ఏడాదిలోనే రెండింతలైన చేరికలు: ఆధునిక వసతులు కలిగిన తరగతి గదులు, ఆకట్టుకునేలా క్రీడా మైదానం, కార్పొరేట్ పాఠశాల తరహా హంగులతో మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1983లో ప్రారంభమైన ఈ పాఠశాల 5.2 ఎకరాల విస్తీర్ణంలో ఉండి 12 గదులతో తొలుత ఏర్పాటు చేశారు.
"లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఏపీ" (లీప్) పేరుతో రాష్ట్రంలోనే తొలిసారిగా మంత్రి లోకేశ్ ఈ పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఇటీవలె ఆధునిక హంగులు జోడించి 25 తరగతి గదులు నిర్మించారు. దీంతో గత ఏడాది వరకు ఇక్కడ విద్యార్థుల సంఖ్య 510 ఉంది. ఈ విద్యా సంవత్సరంలో 1,100కు చేరింది. చిన్నారులకు ప్లే ఏరియా, ఇండోర్ స్టేడియం, ఫుట్‌బాల్, రాష్ట్రంలోనే మొదటిసారి యాంపి థియేటర్ ఏర్పాటు, 400 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు.
"నో అడ్మిషన్ బోర్డు": నెల్లూరు నగరంలోని వీఆర్ పురపాలక ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సీట్లన్నీ భర్తీ అయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు "నో అడ్మిషన్ బోర్డు" పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాలను మంత్రి నారాయణ అభివృద్ధి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఈ పాఠశాలను మూతపడింది. కూటమి ప్రభుత్వం పీ-4 కార్యక్రమంలో భాగంగా రూ.15 కోట్లు వ్యయంతో అత్యాధునిక మౌలిక వసతులతో స్కూల్‌ను తీర్చిదిద్దారు. ఇక్కడ విద్య, మౌలిక వసతులు బాగుండటంతో ఈ ఏడాది ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం మొత్తం 1,125 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా పిల్లలు ఒకటో తరగతిలో చేరారు. ఖాళీలు లేవని చెప్పినా ప్రవేశాల కోసం ప్రతిరోజూ 30 మంది వరకు ప్రవేశాల కోసం వస్తుండటం గమనార్హం.
విద్యార్థులతో కళకళలాడుతోన్న పాఠశాలలు: కర్నూలు జిల్లా మారుమూల మండలం హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల, కన్నడ, ఉర్దూ మాధ్యమాలకు చెందిన 1,800 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. పీఎంశ్రీ పథకం కింద ఈ పాఠశాలలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు.
ఈ ఏడాది పాఠశాల తెరిచిన 4 రోజుల్లోనే 6వ తరగతిలో 259 మంది, 8వ తరగతిలో 250 మంది విద్యార్థులు చేరారు. దీంతో 8వ తరగతిలో విద్యార్థుల సంఖ్య 529కి పెరిగింది. ఈ పాఠశాలలో మొత్తం 44 తరగతి గదులు ఉండగా, ప్రస్తుతం వాటిలో 22 గదుల్లో విద్యాబోధన జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 18 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 17 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. దీంతో ప్రస్తుతం 35 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు.
పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి: విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 1,464 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతేడాది 280 మంది ప్రవేశాలు పొందారు. ఈసారి ఇప్పటివరకు 343 మంది చేరారు. బోధన బాగుండటం, 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. దీంతో పిల్లల్ని ఇక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు 550 మార్కుల పైన 29 మంది సాధించగా, 500 మార్కుల పైన 68 మంది మార్కులు సాధించారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS)కు 24 మంది ఎంపికావ్వడం గమనార్హం.
బొద్దాం జడ్పీహెచ్ఎస్లో 80కి పైగా విద్యార్థుల చేరిక - పూలు చల్లి స్వాగతం పలికిన టీచర్లు
"ప్రభుత్వ బడుల" వైపు విద్యార్థుల మొగ్గు - నాణ్యమైన విద్య, ఉచిత సదుపాయాలతో పెరుగుతున్న ప్రవేశాలు

