ETV Bharat / state

కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన - కలెక్టర్లు, ఎస్పీలను నియామిస్తూ ఆదేశాలు జారీ

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి - రెండు కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం - కొత్త జిల్లాలకు కలెక్టర్, ఎస్పీ, జేసీలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు

Administration of New Districts in AP
Administration of New Districts in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 31, 2025 at 7:23 AM IST

4 Min Read
Choose ETV Bharat

Administration of New Districts in AP : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. అక్కడ కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్డీవోలు, సిబ్బంది నియామకాలూ సైతం జరిగాయి. నేటి(బుధవారం) నుంచే జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవుతోంది. రెండు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో మార్పుచేర్పులపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యు డివిజన్లు ఏర్పాటు, పలు మండలాల సరిహద్దులు మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రంపచోడవరం హెడ్ క్వార్టర్​​గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం హెడ్ క్వార్టర్​​గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నేటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని తుది నోటిఫికేషన్లలో తెలిపింది.

2 కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్​ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు. ప్రజలకు వేగంగా పాలన అందించడం, సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లనూ ఏర్పాటు చేసింది. పలు మండలాల సరిహద్దులనూ మార్చింది. ప్రజల కోరిక మేరకు సమీప జిల్లాల్లో కలిపింది. కొత్తగా రెవెన్యూ డివిజన్లుగా అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

కొత్త రెవెన్యూ డివిజన్లు :

1. అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా

2. అద్దంకి, ప్రకాశం జిల్లా

3. పీలేరు, అన్నమయ్య జిల్లా

4. మడకశిర, శ్రీసత్యసాయి జిల్లా

5. బనగానపల్లి, నంద్యాల జిల్లా

వైఎస్సార్‌ కడప జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు : ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గం ఇక నుంచి తిరుపతి జిల్లాలోకి వస్తుంది. కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో చేరతాయి. అలాగే అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గం, రెవెన్యూ డివిజన్లు ఇక నుంచి వైఎస్సార్‌ కడప జిల్లాలో భాగమవుతాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలు కడప రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. ఇప్పుడు నందలూరు, రాజంపేట, వీరబల్లి, టి.సుండుపల్లి మండలాలతో రాజంపేట డివిజన్‌ కూడా కలుస్తుంది. దీంతో వైఎస్సార్‌ కడప జిల్లాలో మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి.

తూర్పుగోదావరి జిల్లాలోకి మండపేట నియోజకవర్గం : ఇప్పటి వరకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో భాగమవుతుంది. ఈ నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్‌ నుంచి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో విలీనమవుతాయి.

ప్రకాశం జిల్లాలోకి ఆ నియోజకవర్గాలు : బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తున్నారు. అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటవుతోంది. ఇందులో అద్దంకి, దర్శి నియోజకవర్గాలు ఉంటాయి. అలాగే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్‌తోపాటు ప్రకాశం జిల్లాలో విలీనమవుతుంది. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలు డివిజన్‌తో సహా తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలుస్తాయి.

జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం : మరోవైపు నూతనంగా ఏర్పాటు చేసిన 2 కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. పోలవరం జిల్లాకు ఇంఛార్జ్ కలెక్టర్​గా AS.దినేష్ కుమార్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్​గా ఉన్నారు. పోలవరం జిల్లాకు ఇన్ చార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్ నియమించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దర్ ఉన్నారు. అల్లూరి జిల్లా జేసీగా ఉన్న తిరుమాని శ్రీ పూజను పోలవరం జిల్లా ఇన్చార్జి జేసీగా నియమించారు.

మార్కాపురం జిల్లా ఇన్ చార్జి కలెక్టర్​గా పి.రాజాబాబును నియమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు రాజాబాబు కలెక్టర్​గా ఉన్నారు. మార్కాపురం జిల్లాకు ఇన్చార్జి ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు నియమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు ఎస్పీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా జేసీగా ఉన్న రోనంకి గోపాల కృష్ణను మార్కాపురం జిల్లా ఇన్ చార్జి జేసీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

సిద్ధమవుతున్న అధికారిక భవనాలు : మార్కాపురం నూతన జిల్లాకు తాత్కాలిక కలెక్టర్ భవనాలు సిద్ధమవుతున్నాయి. తర్లుపాడు రోడ్డులోని వెలిగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను తాత్కాలిక కలెక్టర్ కార్యాలయంగా అధికారులు ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన కలెక్టర్ కార్యాలయాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇవాళ ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి ఏర్పాట్లు శరవేగంగా జరిగాయి. కార్యాలయం ప్రాంతాల్లో రహదారులు, పరిసరాలను శుభ్రం చేశారు. విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. అక్కడ జరిగే పనులను అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. మార్కాపురం జిల్లాకు ఇప్పటికే ప్రభుత్వం అధికారులను కూడా నియమించింది.

ఏపీలో కొత్తగా 2 జిల్లాలు ఏర్పాటు - తుది నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లకు నోటిఫికేషన్‌ విడుదల