ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీశాఖ - ఎకరం భూమి దానమిచ్చిన మహిళకు తప్పని పాట్లు
తనజాతి వారి కోసం ఎకరం భూమిని దానమిచ్చిన ఆదివాసీ మహిళ - ఆ స్థలం తమ పరిధిలోనిదంటూ అటవీశాఖ అడ్డు - కలెక్టర్ సన్మానం కూడా పొరపాటే అంటున్న అధికారులు

Published : January 7, 2026 at 9:21 AM IST
Adivasi woman Donates Land For Indiramma Houses : అంతరించిపోతున్న తనజాతి బిడ్డలకు రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవటానికి ఎకరం భూమి దానమిచ్చి ఓ ఆదివాసీ మహిళ చూపిన ఔదార్యం రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచింది. తీరా లబ్ధిదారులు ఇంటి పనులు చేపడుతుండగా, ఆ స్థలం తమ పరిధిలో ఉందని అటవీశాఖ అడ్డుచెప్పటం ఆటంకంగా మారింది.
తన ఎకరం భూమిని దానిమ్మిచి : ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం దుబ్బగూడ(ఎస్) పంచాయతీ అనుబంధ గూడెం అయిన సాహెజ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన రెవెన్యూ- అటవీశాఖల మధ్య సమన్వయలోపాన్ని ఎత్తిచూపుతోంది. ప్రభుత్వం దుబ్బగూడలోని కొలాం తెగకు చెందిన 16 మందికి గత జూన్‌లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వీరిలో 10 మందికి స్థలంలేక ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. అదే గూడేనికి చెందిన ఆత్రం లేతుబాయి అడవిని ఆనుకొని ఉండే సర్వే నంబర్ 18/2/10లోని తన ఎకరం భూమిని గత నవంబరులో దానమిచ్చి సాత్నాల తహసీల్దార్‌కు అఫిడవిట్ రాసిచ్చారు. కూలి పనిచేసే లేతుబాయి భర్త ఆత్రం జంగు, ముగ్గురు కుమారులు సైతం ఇందుకు అభ్యంతరం చెప్పలేదు.

రాష్ట్ర స్థాయిలో పురస్కారం : స్వయంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా నేతృత్వంలో నవంబరు 11న సన్మానించి ఆమె త్యాగనిరతిని చాటిచెప్పడంతో, ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెకు రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని సైతం ప్రదానం చేసింది. అయితే లేతుబాయికి సొంతిల్లు లేకపోవడంతో ఏళ్లుగా పూరిగుడిసెలోనే నివాసం ఉంటున్నారు. ఆమె ఇచ్చిన స్థలంలో తొలి విడతగా అయిదుగురు గృహనిర్మాణం చేపట్టగా తాజాగా అటవీశాఖ అడ్డుకుంది.

తన ఇంటికి కూడా అడ్డుపడి : ఆతర్వాత ఆమె ఇంటి నిర్మాణాన్ని సైతం అడ్డుకోవడం కలకలం సృష్టించింది. లబ్ధిదారుల తరఫున పనులు చేస్తున్న గుత్తేదారు సయ్యద్ మహ్మద్‌ను అరెస్టు చేసిన అటవీఅధికారులు, ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా కేసులు నమోదు చేశారు. లేతుబాయి దానమిచ్చిన భూమి సాహెజ్‌పల్లెను ఆనుకొని అటవీశాఖ తవ్విన కందకాల బయటే ఉంది. పైగా లేతుబాయికి రెవెన్యూశాఖ జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకం ఉంది.
"ఆ భూమి అటవీశాఖది. లేతుబాయి సొంతం కాదు. తహసీల్దార్ చేసిన పొరపాటు కారణంగా కలెక్టర్ సన్మానించి ఉండవచ్చు. అటవీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినందునే గుత్తేదారు మహ్మద్ సహా లేతుబాయి భర్త జంగుపై కేసు నమోదు చేశాం" - గులాబ్‌సింగ్, అటవీ రేంజ్ అధికారి
కుటుంబ సహకారంతో : తమ తెగలోని 10 మందికి ఇదిరమ్మ ఇళ్లు నిర్మాణానికి స్థలం లేదని తన వద్ద ఉన్న 3 ఎకరాల్లో 1 సాగు ఎకరాన్ని దానమ్మిచారు. అలాగని తనేమి పెద్ద భవంతిలో ఉండడం లేదు. ఆమె కూడా ఓ చిన్న పూరి గుడిసెలో నివశిస్తున్నారు. ఈ మేరకు తహసీల్దారుకు అఫడవిట్ రాసిచ్చారు. తాను ఒక్కరే కాకుండా, అందరూ బాగుండాలన్న ఆమె కోరికకు తన కుటుంబం కూడా సహకరించింది. తమ పేరు మీద ఇంచు భూమి ఉన్నా, కుటుంబమంతా నాకు కావాలని గొడవలు పడుతుంటారు. అటువంటి రోజుల్లో ఎలాంటి లాభం ఆశించకుండా ఒక ఎకరం భూమిని దానమిచ్చిన లేతుబాయిని అందరూ ప్రశంసించారు.
ఆ సన్మానం ఓ పొరపాటు : కానీ, ఆమె చేసిన దానానికి విలువ లేకుండా రెవెన్యూ శాఖ, అటవీశాఖలు చేస్తున్నాయి. ఆ స్థలం తమ పరిధిలో ఉందని దానం చేసేందుకు తనకు హక్కు లేదని అన్నారు. అంతేకాకుండా ఆమె నిర్మించుకుంటున్న ఇంటి పనులకు కూడా అడ్డు వచ్చారు. జిల్లా కలెక్టర్ చేసిన సన్మానం కూడా పొరపాటని చెప్పారు.
ఆ జాబితాలో ఉన్న లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు - ఏడాదికి 4.50 లక్షల చొప్పున కేటాయింపు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్ - అలా చేస్తే ఇళ్లు రద్దు!

