అడవితల్లి గుండె చప్పుడు ‘ఆదివాసీ రేలా’ - ఎందుకంత స్పెషల్ అంటే?
సంస్కృతి ఉట్టిపడేలా- సంప్రదాయం వెల్లివిరిసేలా - ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2026 at 4:14 PM IST
Adivasi Rela Festival 2026 : అడవితో అల్లుకున్న జీవనం వారిది. కీకారణ్యాల్లో జీవించే ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు మక్కువ చూపుతారు. ఆధునిక సమాజం పాశ్చాత్య సంస్కృతి ప్రభావంలో కొట్టుకుపోతుంటే వీరు మాత్రం వందల ఏళ్లనాటి ఆచార వ్యవహారాలు, పండుగలను నేటికీ కొనసాగిస్తున్నారు. వాటిని తర్వాతి తరాలకు అందిస్తున్నారు. రేలా, రేలా, అనే పదం కేవలం ఒక పాట కాదు. అది అడవితల్లి గుండె చప్పుడు. పూర్వీకుల ఆచారాల వారసత్వం. ప్రకృతి ఒడిలో పుట్టి, అడవిని ప్రాణంగా ప్రేమించే ఆదివాసీల జీవన వైవిధ్యాన్ని, అద్భుతమైన కళా రూపాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఆదివాసీ రేలా ఉత్సవాలు ఆదివారం నుంచి ఘనంగా జరగనున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ‘ఆదివాసీ రేలా ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కళాప్రదర్శనలు ఉట్టిపడేలా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
అస్తిత్వాన్ని చాటుకునేందుకే :
ఈ రేలా ఉత్సాలలో అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయాలు, నృత్యాలను (డోలు, కొమ్ము, థింసా, రేలా) పునరుజ్జీవింపచేయడంతో పాటు చెట్టును పుట్టను దైవంగా భావించే ఆదివాసీల పర్యావరణ హిత జీవనశైలిని ప్రదర్శించనున్నారు. అంతేకాక వేల సంఖ్యలో ఆదివాసీ ప్రజలు ఒకే వేదిక వద్దకు వచ్చి తమ అస్తిత్వాన్ని చాటుకొనే అరుదైన వేడుక. రేలా పాటల మాధుర్యాన్ని, గిరిజన వాయిద్యాల గంభీర ధ్వనులను స్వయంగా వీక్షించాలని గిరిజనులు కోరుతున్నారు.
మొదటి రోజు :
- ఈ ఉత్సవాలకు జిల్లాలోని 12 మండలాలకు చెందిన ఆదివాసీ ప్రముఖులు, నేతలు, కళాకారులు హాజరుకానున్నారు. మొదటిరోజున ఆదివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఆదివాసీ జెండా ఆవిష్కరణతో పాటు ర్యాలీ, రేలా మహాప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కోలాటం, రేలా ఆట, డోలు కొయ్యలు, థింసా నృత్యం, డప్పుల కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, కట్టుబాట్లు, జీవనశైలి తదితర అంశాలపై ఈ వేదికపై ముఖ్యఅతిథులు ప్రసంగిస్తారు.
రెండో రోజు :
- సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు ఆదివాసీ జెండా ఆవిష్కరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో రాజవొమ్మంగి మండలం పూదేడు గ్రామానికి చెందిన మాగూడెం గూడెం థింసారే నృత్య ప్రదర్శన, చింతూరు నుంచి ఆదివాసీ మహిళా ఉపాధ్యాయులు పెర్మకోరు నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఉండనున్నాయి.
- అదేవిధంగా ఎటపాక మండలం మురుమూరు గ్రామానికి చెందిన అందెలు, వరరామచంద్రాపురం మండలం అడివి వెంకన్నగూడెంకు చెందిన గిరిజనులు పెళ్లి తంతు ప్రదర్శన ఉండనుంది.
- రాజవొమ్మంగి మండలం కేశవరానికి చెందిన గిరిజనులు కోలాటం, వరరామచంద్రాపురం మండలం సోములగూడెం గిరిజనులు తొట్టడు, మారేడుమిల్లి మండలం తేనెలమామిడి నుంచి డోలా నృత్యం ప్రదర్శించనున్నారు.
- కూనవరం మండలం కార్మానకొండకు చెందిన గిరిజనులు రుంజాల కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
మూడో రోజు ఇలా :
- మూడో రోజన మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు చింతూరు మండలం డొంకరాయికి చెందిన గిరిజనులు థింసా నృత్య ప్రదర్శన, వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెం గిరిజనులు రేలా జట్టు లాగుట ప్రదర్శన ఉంటాయి.
- రాజవొమ్మంగి మండలం పూడేడు గిరిజనులు కొండ కోనల్లో నృత్యం, వరరామచంద్రాపురం మండలం సోములగూడెం గిరిజనులు భూమి పండగ ఆచారాల ప్రదర్శన చేస్తారు.
- రంపచోడవరం మండలం రంప గ్రామానికి చెందిన గిరిజన మహిళలు రేలా నృత్యాన్ని ప్రదర్శించనున్నారు.
- రాజవొమ్మంగి మండలం అమ్మిరేకుల గ్రామం నుంచి కోలాటం, రంపచోడవరం మండలం మునిజిడుగుల గ్రామానికి చెందిన గిరిజనులు నేస్తాల పెళ్లి తంతు ఉండనుంది. అదేవిధంగా గంగచెల్లి (నందలాట), మారేడుమిల్లి మండలం ఈ-భీమవరం, చింతలపూడి గ్రామాలకు చెందిన వారు పెళ్లి పాటలు ఆలపిస్తారు.
- కూనవరం మండలం అయ్యవారిగూడెం గిరిజనులు కోలాట ప్రదర్శన, చింతూరు మండలం తుమ్మలకు చెందిన వారు రేలా నృత్యాలు, ఎటపాక మండలం రాఘవపురం నుంచి రేలా నృత్యాల కార్యక్రమాలు ఉంటాయి.
రాష్ట్రంలో 'ఆ మందు'పై నిషేధం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
"తల్లికి వందనం" రావాలాంటే ఇది తప్పనిసరి - లేదంటే డబ్బులు రావు!

