బోర్డులు పెట్టి ఫీజులు ఎగ్గొట్టి: జీఎంసీలో ప్రదర్శన బోర్డుల విషయంలో మాయాజాలం
ఒకదానికి అనుమతి పొంది రెండు నుంచి మూడు అదనంగా ప్రకటన బోర్డులు - కొందరైతే అనుమతుల్లేకుండా రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి మరీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 31, 2025 at 5:23 PM IST
Add Sign Boards On GMC: అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఆదాయం ఆర్జించే అవకాశాలున్నాయి. అయినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో అక్రమార్కులు కొత్తదారులు ఎంచుకుంటున్నారు. దీనికో ఉదాహరణ ప్రదర్శనల బోర్డుల విషయంలో నిర్లక్ష్యం. ఈ ప్రకటనల బోర్డుల గురించి అసలు పట్టించుకోవడం లేదు. గుంటూరు నగర జనాభా దాదాపు పది లక్షలకు పైగానే ఉంది. వార్షిక బడ్జెట్ రూ.1,500 కోట్లు. ఇంతటి కీలకమైన నగరంలో ప్రదర్శన బోర్డుల అనుమతులు, ఏర్పాటు, ఫీజుల వసూళ్లలో మాయాజాలం జరుగుతోంది.
లెక్కల ప్రకారం 42 ఏజెన్సీలు
అధికారుల లెక్కల ప్రకారం 42 ఏజెన్సీలు ఉండగా ఇతర సంస్థలకు అనుమతులు కలిపి 142 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 1,400 డిస్‌ప్లే బోర్డులు ఉన్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో ఇంతకు రెట్టింపు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. నిబంధనల ప్రకారం డిస్‌ప్లే, గ్యాంట్రీ ఇలా ఏ తరహా బోర్డులు ఏర్పాటు చేయాలన్నా జీఎంసీ అనుమతి తప్పనిసరి. ఇందుకు నిర్ణీత ఫీజు చెల్లించాలి. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
నగరంలో ఎక్కడపడితే అక్కడ ప్రదర్శన బోర్డులున్నాయి. ఒకదానికి అనుమతి పొంది రెండు నుంచి మూడు అదనంగా పెడుతున్నారు. కొందరైతే అనుమతుల్లేకుండానే రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి నెలకొల్పుతున్నారు. తద్వారా వీరు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. జీఎంసీకి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. మరోవైపు అనుమతులు తీసుకున్న ఏజెన్సీలు ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఈ అంశంపై ప్రతీ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగడం అధికారులు మిన్నకుండిపోవడం సర్వసాధారణంగా మారింది.
ఎక్కడ ఏది కూలుతుందో, ఎవరి నెత్తిన పడుతుందో
2024-25లో కొత్తగా బోర్డుల ఏర్పాటుకు అనుమతులివ్వలేదని అధికారికంగానే ప్రకటించారు. డిస్‌ప్లే డివైజ్ ఫీజు కింద అరియర్స్‌తో కలిపి రూ.15.18 కోట్ల డిమాండ్‌కు గాను రూ.10.20 కోట్లు వసూలు చేసినట్టు చూపించారు. ఇంకా రూ.5 కోట్ల వరకు బకాయి ఉన్నట్టు గత కౌన్సిల్‌లో ప్రస్తావించారు. అవి ఇప్పటికీ వసూలు కాలేదు. ఒక సంస్థ రూ.3.77 లక్షలు మరో సంస్థ రూ.27 లక్షల బకాయిలు ఉన్నట్టు కౌన్సిల్ సమావేశంలో లెక్కలు చూపించారు. నగరంలో చాలా బోర్డులకు స్ట్రక్చర్ స్టెబిలిటీ లేకపోవడం మరో సమస్య. ఎక్కడ ఏది కూలుతుందో, ఎవరి నెత్తిన పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
పేర్లు మార్చి బకాయిలు ఎగ్గొట్టడానికి కొంతమంది గుత్తేదారులు తమ సంస్థల పేర్లు మార్చేసి కొత్తగా దరఖాస్తు చేస్తున్నారు. అధికారులు దీన్ని పట్టించుకోకుండా ఆమోదించేస్తున్నారు. మరికొంతమందైతే కాసులకు కక్కుర్తి పడి అక్రమాలకు సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన నిబంధనలను ఇక్కడ ఏమేరకు అమలు చేస్తారనేది ప్రశ్న.
మిలియన్ ప్లస్ సిటీగా గుంటూరు
మిలియన్ ప్లస్ సిటీ రాష్ట్రంలో ఇప్పటివరకు విశాఖపట్నం, విజయవాడ మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా గుంటూరు ఆ సరసన చేరేందుకు ప్రాథమిక కసరత్తు పూర్తయింది. మొత్తం 18 గ్రామాలను జీఎంసీలో విలీనం చేసేందుకు కౌన్సిల్ ఆమోదించి కలెక్టర్‌కు పంపింది. ఇందులో 11 గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు పూర్తయ్యాయి. మిగిలిన వాటికి నిర్వహించాల్సి ఉంది. ఇదంతా పూర్తి అయిన తరువాత ప్రభుత్వ ఆమోద ముద్ర పడితే మిలియన్ ప్లస్ సిటీగా అవతరిస్తుంది. పదిలక్షల జనాభా దాటిన నగరాలను మిలియన్ ప్లస్ సిటీగా పరిగణిస్తారు. 2011 లెక్కల ప్రకారం గుంటూరు జనాభా 7.43 లక్షలు. ప్రస్తుతం 9.40 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.18 గ్రామాల జనాభా 65 వేలు కలిపితే పదిలక్షలు దాటుతుంది.
మిలియన్ ప్లస్ సిటీగా మారితే ఉపయోగాలు
కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు వస్తాయి. భవిష్యత్తులో స్మార్ట్‌సిటీ నగరాల జాబితాలో చేరొచ్చు. ప్రత్యేక పథకాలు, నిధులు మంజూరవుతాయి. ప్రతిపాదిత విలీన గ్రామాల్లో దాదాపుగా 3 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. భవిష్యత్తులో కేంద్ర,రాష్ట్ర సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. జిల్లా కేంద్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుండడం, విలీన గ్రామాల పరిసరాల నుంచే ఓఆర్‌ఆర్ వెళ్తుండడం కలిసొచ్చే అంశం. జీఎంసీలో మరో అదనపు కమిషనర్ పోస్టు సహా కొన్ని విభాగాలు, అదనపు పోస్టులు మంజూరవుతాయి.
పోలవరం పై జలశక్తిశాఖ ప్రకటన - కేంద్ర నిధుల్లో 99.38% ఖర్చయినట్లు వెల్లడి
పల్లె సీమలే వారికి ప్రయోగశాల - అబ్బురపరిచిన గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్ల ఆవిష్కరణలు!

