తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్
వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 8, 2026 at 11:46 AM IST
Actress Nidhhi Agerwal Offered Prayers at Tirumala: నేడు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సినీనటి నిధి అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిధి అగర్వాల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకముందు ఆలయంలోకి వెళ్లిన నిధి అగర్వాల్ స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. హిందీలో రెండు,రెండు తెలుగు చిత్రాల్లో నటించే అవకాశం దక్కిందని నిధి చెప్పారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు: నేడు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ ఘన్‌శ్యామ్ తివారీ బృందం, అరకు ఎంపీ తనూజా రాణి, తెలంగాణ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, తమిళనాడు కళ్లకురిచ్చి నియోజకవర్గం ఎంపీ మలైయరసన్ లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
సర్వదర్శనానికి 24 గంటలు: తిరుమలలో టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం నాడు శ్రీవారిని 80,706 మంది భక్తులు దర్శించుకోగా, 34,838 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.86 కోట్లు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
రూ.11 లక్షల విరాళం: తిరుమల తిరుపతి దేవస్థానానికి మంగళవారం రూ.11 లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఎస్కే ఎంటర్ ప్రైజర్స్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.

