ETV Bharat / state

మంత్రి కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున

మంత్రి కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున - ఇటీవల నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పిన కొండా సురేఖ - కొండా సురేఖ క్షమాపణతో కేసు ఉపసంహరించుకున్న నాగార్జున

Actor Nagarjuna Withdraws Case Against Minister Konda Surekha
Actor Nagarjuna Withdraws Case Against Minister Konda Surekha (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 13, 2025 at 6:52 PM IST

|

Updated : November 13, 2025 at 7:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

Actor Nagarjuna Withdraws Case Against Minister Konda Surekha : రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్‌ దావాను ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఉపసంహరించుకున్నారు. అక్కినేని నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ బుధవారం ఎక్స్‌లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు.

నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను : అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదని కొండా సురేఖ తెలిపారు. వారిని ఇబ్బందిపెట్టాలని కాని, వారి పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కాని తన ఉద్దేశం కాదని చెప్పారు. అక్కినేని నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నానని అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకుంటున్నట్టు అక్కినేని నాగార్జున తెలిపారు.

కొండా సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారంటే? : 2024 సంవత్సరం అక్టోబరు 2 హైదరాబాద్​లోని లంగర్​హౌస్​లో కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి కేటీఆర్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్​ మంత్రిగా ఉన్న టైంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. నాగ చైతన్య-సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్​ కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. హీరోయిన్స్​ తొందరగా వివాహాలు చేసుకుని, సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆర్​నే కారణమని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన సినీ నటి సమంత అప్పుడే ఎక్స్​ వేదికగా స్పందించి తన విడాకులు వ్యక్తిగత విషయమని వివరించారు.

ఈ మాటలపై సమంతకి కొండా సురేఖ క్షమాణలు కూడా చెప్పారు. "నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యద భావించవద్దు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు." ఆమె ఎక్స్​ వేదికగా స్పందించారు.

మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా : ఆ తరువాత తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున గతంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై క్రిమినల్​ పరువు నష్టం దావా వేశారు. ఆమె తమ ఫ్యామిలీ ప్రతిష్ఠ, గౌరవాన్ని దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అక్కినేని నాగార్జున గతంలో ఫైల్​ చేసిన పిటిషన్​లో కోరారు. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. తాజాగా నాగార్జున, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ ఉపసహరించుకుంటున్నానని ఎక్స్​ వేదికగా పోస్టు చేశారు. ఇవాళ నాగార్జున పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఈ వివాదానికి తెరపడినట్లేనని అంతా భావిస్తున్నారు.

నాగార్జున కుటుంబాన్ని బాధ పెట్టాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు : కొండా సురేఖ

Last Updated : November 13, 2025 at 7:09 PM IST