సంక్రాంతికి కోనసీమలో గదుల కొరత - అతిథి గృహాల్లోనూ ఇదే పరిస్థితి!
గతేడాదితో పోల్చితే ఇప్పుడు ముందుగానే హోటళ్లలో గదులు అన్నీ బుక్ - దిండిలో పర్యాటకశాఖ అతిథి గృహాల్లో 30 వరకు గదులుండగా - జనవరి 11 నుంచి 20 వరకు ఖాళీలు లేవు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 1:58 PM IST
NO Rooms for Sankranti in East Godavari: సంక్రాంతి అంటే అందరికి గుర్తుకు వచ్చేది కోనసీమ. సొంతూళ్లు వచ్చేందుకు రెండు నెలలు ముందుగానే బస్సు, రైళ్లు టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. స్థానికుల బంధువులు, స్నేహితులతో పాటు ఇతరులు కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారికి వసతి సమస్య నెలకొంది. గత ఏడాదితో పోల్చితే ఇప్పుడు ముందుగానే హోటళ్లలో గదులు బుక్ చేసుకున్నారు. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరంలో జరిగే సంక్రాంతి సంబరాలు, కోడిపందేలు చూసేందుకు ఈ ఏడాది భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- హైదరాబాద్‌కు చెందిన 10 మంది యువకులు సంక్రాంతి సంబరాలు చూద్దామని కోనసీమకు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. హోటల్‌లో గదులు తీసుకుందామనుకుంటే జనవరిలో చాలా వరకు నిండిపోయాయి. దీంతో కోనసీమలో అతిథి గృహాలను వెతికే పనిలో పడ్డారు. సంక్రాంతి పండుగ రోజుల కంటే ముందుగానే అవీ నిండిపోయాయని తెలుసుకున్నారు.
- రాజోలు సమీపంలోని దిండిలో పర్యాటకశాఖ అతిథి గృహాల్లో 30 వరకు గదులు ఉన్నాయి. వాటిలోనూ జనవరి 11 నుంచి 20 వరకు ఖాళీలు లేవు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అతిథి గృహాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
అతిథుల అన్వేషణ: మండువా లోగిళ్లకు ప్రసిద్ధి గోదావరి జిల్లాలే. వీటికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. మామిడికుదురు మండలం పెదపట్నంలంకలోని మన మండువా ఇల్లు పర్యాటకులను ఎంతోగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఒకరోజు ఉండేందుకు రూ.30 వేలకు పైగానే తీసుకుంటున్నారు. పాతకాలం నాటి జ్ఞాపకాలు, అలనాటి మధుర స్మృతులను నేటి తరానికి పరిచయం చేస్తున్నాయి. నిజానికి ఆనాటి వస్తువులన్నీ ఈ మండువా లోగిళ్లలో ఉంచడంతో అతిథులను ఆకర్షిస్తున్నాయి. వీటిలో 6 నుంచి 8 వరకు గదులు ఉన్నాయి.
ఇదే గ్రామంలోని ఓ ప్రైవేటు రిసార్టు ఉంది. అక్కడ గదుల చక్కగా ఉండటంతో వాటిని వినియోగించేందుకు అతిథులు ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా రాజోలు సమీపంలోని దిండి రిసార్టు ఉంది. అమలాపురం పట్టణంలోని కోనసీమ విడిదిల్లు పేరుతో ఓ గృహాన్ని ఇటీవలే సిద్ధం చేశారు. 7 గదులు ఉండే దీనికి రోజుకు రూ.15 వేలు వరకు తీసుకుంటున్నారు. దీన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు.
మండువా లోగిళ్లు విడిదిల్లు: ఈసారి సంక్రాంతి పండుగను ఆహ్లాదంగా జరుపుకోవాలని అతిథులు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా కొబ్బరి తోటల్లో చూడముచ్చటగా ఉండే ఇళ్ల కోసం, ప్రత్యేకించి మండువా లోగిళ్లు కోసం అతిథులు ఎంతోగానో అన్వేషిస్తున్నారు. గదుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ వెనకడుగు వేయడం లేదు. ముందుగానే బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వాటి కోసమే పరితపిస్తున్నారు.
సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాల్లో పచ్చదనం, ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, పిండివంటలు ఇలా ఎన్ని ఉన్నా కోడి పందేలది మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి చూపూ వాటి పైనే ఉంటుంది. ఈ క్రమంలో సంక్రాంతి బరిలో కాలు దువ్వేందుకు పందెం కోళ్లు సై అంటున్నాయి. బరిలే నిలిచేందుకు గాను కొన్ని నెలలు ముందుగానే వాటికి ప్రత్యేక శిక్షణను అందిస్తారు. రాటుదేలిన కోళ్లు తమ సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కోడి పందేలపై చర్చలు సాగుతుంటాయి. పండగ దగ్గర పడుతున్న తరుణంలో గ్రామాల్లో సందడి మొదలైంది. పందేల్లో పుంజులను బరిలో దించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు పిల్ల దశ నుంచి కోళ్లను ప్రత్యేకంగా పెంచుతుంటారు. మరికొందరు మాత్రం ధర ఎంతైనా వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం శిబిరాల్లోని కోడి పుంజుల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
కోడి పందేలకు సిద్ధమవుతున్న గోదావరి జిల్లాలు - కాలు దువ్వుతున్న పుంజులు
ముందే వచ్చిన సంక్రాంతి! - వడిసలేరులో ఘనంగా ఎడ్లబండి, గుర్రపు పోటీలు ప్రారంభం

