ఏసీబీ వలలో ఆబ్కారీ ఎస్పీ మల్లారెడ్డి - రూ.3 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు
నిజామాబాద్ ప్రగతినగర్‌లోని ఎక్సైజ్ ఎస్పీ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు - మచ్చబొల్లారంలోని ఇంట్లోనూ తనిఖీలు - రూ.3 కోట్లు విలువ చేసే ఆస్తులు గుర్తింపు - రెండు లాకర్లను తెరవాల్సి ఉందన్న అధికారులు

Published : June 23, 2026 at 3:40 PM IST
|Updated : June 24, 2026 at 8:23 AM IST
ACB Raids On Excise SP Nizamabad : అక్రమార్కుల ఆట కట్టించడంలో తెలంగాణ ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటికే లంచం తీసుకుంటున్న ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోగా మరో నలుగురిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేశారు. తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెండ్ కొమ్మూరి మల్లారెడ్డి మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
రూ.మూడు కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు : మల్లారెడ్డి అక్రమార్జనపై ఫిర్యాదులు రావడంతో కొద్దిరోజులుగా గట్టి నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ నేతృత్వంలో చేపట్టిన ఈ సోదాల్లో లెక్కచెప్పని సుమారు రూ.3 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల్ని గుర్తించారు. స్థిరాస్తుల జాబితాలో నాలుగు నివాస సముదాయాలు, ఒక వాణిజ్య సముదాయం, 8 ఓపెన్ ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఇంత మొత్తం కాగా బహిరంగ మార్కెట్‌లో ఆస్తుల విలువ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కుటుంబ సభ్యుల పేరిట మూడు లాకర్లు : ఇవేకాకుండా మల్లారెడ్డికి హైదరాబాద్ అల్వాల్‌లోని ఆయన ఇంట్లో రూ.3.31 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు అకౌంట్లలో రూ.50 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ఒక ఎస్‌యూవీ కారు, స్కూటర్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం తొలుత నిజామాబాద్‌లో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ అల్వాల్ ఇంటికి తీసుకొచ్చి విచారణ చేశారు. ఈ క్రమంలో మల్లారెడ్డి భార్య, కుటుంబసభ్యుల పేరిట మూడు బ్యాంకు లాకర్లున్నట్లు గుర్తించారు. ఒకట్రెండు రోజుల్లో వాటిని కూడా తెరిచి చూడనున్నారు.

సుదీర్ఘకాలం రాయలసీమలో విధులు : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదువు పూర్తి చేసిన అనంతరం 1995లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో సీఐగా విధుల్లో చేరారు. సుదీర్ఘకాలం ఏపీ రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం అంటే ఏడేళ్ల క్రితం తెలంగాణకు వచ్చారు. తొలుత వికారాబాద్‌లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేసి 2022లో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ప్రమోషన్‌పై నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తూ మంగళవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఈ సందర్భంగా నర్సాయపల్లిలోనూ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అన్నిచోట్లా సోదాలు పూర్తయిన అనంతరం మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
"ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో మల్లారెడ్డి వద్ద రూ.3 కోట్లు విలువైన ఆస్తులను గుర్తించాం. అల్వాల్‌లోని ఆయన నివాసంలో రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. నిజామాబాద్, సిద్దిపేటతో పాటు హైదరాబాద్‌లో ఇల్లు, ప్లాట్లు గుర్తించాం. బ్యాంకు లాకర్లను గుర్తించి వాటిని తెరిస్తే ఆయనకు సంబంధించిన మరిన్ని ఆస్తుల వివరాలు తెలుస్తాయి. ఆయన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాం. మల్లారెడ్డిని అరెస్టు చేశాం. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తాం" - నరేష్, నిజామాబాద్ అవినీతి నిరోధక శాఖ అధికారి
నరహరి బ్యాంకు లాకర్లను బద్దలుకొట్టిన ఏసీబీ అధికారులు - భారీగా డబ్బు, బంగారం చూసి షాక్!
లంచాలు ఆర్జించే అధికారులపై అవినీతి నిరోధక శాఖ కొరడా - ప్రభుత్వ స్వేచ్ఛతో దూకుడు పెంచిన ఏసీబీ

