ETV Bharat / state

ఏసీబీ వలలో పోలీస్​ తిమింగలం - డీఎస్పీ ఇంట్లో కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు, నగదు, బంగారం స్వాధీనం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్ - భారీగా అక్రమ అస్తులను గుర్తించిన ఏసీబీ - హైదరాబాద్‌తో పాటు మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

ACB Raids DSP Bhimreddy House
ACB Raids DSP Bhimreddy House (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 2, 2026 at 11:49 AM IST

|

Updated : July 2, 2026 at 10:04 PM IST

4 Min Read
Choose ETV Bharat

ACB Raids DSP Bhimreddy House : రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా ఉంటూ అధికార బలంతో రూ.కోట్లు విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టిన ఒక అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీంరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌ ఇబ్రహీంబాగ్‌ వెసెల్లా మెడోస్‌లోని విల్లాలో ఉంటూ డీజీపీ కార్యాలయంలో పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌లో డీఎస్పీగా పని చేస్తున్న భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌ సిటీ రేంజ్‌-1 డీఎస్పీ మాజిద్‌ఖాన్‌ నేతృత్వంలోని బృందం చేపట్టిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా బయటపడ్డాయి. దాదాపు 20 చోట్ల స్థిరాస్తుల్ని గుర్తించడం కలకలం రేపింది. బెంగళూరు మహానగరంలో భీంరెడ్డికి సంబంధించి ఎకరా వాణిజ్య స్థలం, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. ఆయన పేరిట లభించిన స్థిరాస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మరోవైపు హైదరాబాద్‌ శివార్లలోని ఓ మున్సిపాలిటీకి వైస్‌ ఛైర్మన్‌గా పని చేసిన నేత ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరిగాయి. భీంరెడ్డికి సదరు నేత సన్నిహితంగా మెలగడంతో ఆయన పేరిట ఏమైనా ఆస్తుల్ని దాచారా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం.

20 చోట్ల స్థిరాస్తుల్ని గుర్తించిన అధికారులు : ఒక బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు, వెసెల్లా మెడోస్‌లో ఏసీబీ సోదాల సమయంలో ఏకంగా 2 కిలోల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 20 కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. రూ.19.91 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ ఉన్నట్లు గుర్తించారు. 23 విదేశీ మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ఆబ్కారీ శాఖకు సమాచారం అందించారు. రూ.3.6 లక్షల నగదుతో పాటు పేట్‌ బషీరాబాద్‌లోని ఓ బినామీ ఇంట్లో మరో రూ.40 లక్షల నగదు లభ్యమైంది. మరో కంపెనీ నిర్వాహకుడు భీంరెడ్డికి బినామీగా ఉన్నట్లు వెల్లడైంది. భీంరెడ్డికి సంబంధించిన లాకర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ దాని తాళం ఇవ్వడానికి నిరాకరిస్తే న్యాయస్థానం అనుమతితో తెరిచేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ అనే సంస్థలో డీఎస్పీ రూ.75 లక్షల మేర పెట్టుబడి పెట్టినట్లు పత్రాలు లభ్యమయ్యాయి.

పక్క రాష్ట్రాల్లో సైతం భారీగా స్థిరాస్తుల నిర్మాణం : ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం డీఎస్పీ భీంరెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు సహా పక్క రాష్ట్రంలో భారీగా స్థిరాస్తులను నిర్మించారు. వాటి అధికారిక విలువ కొన్ని రూ.కోట్లలో ఉండగా, మార్కెట్ విలువ రూ.వందల కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇబ్రహీంబాగ్‌లోని లగ్జరీ వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా, టెలికాం నగర్‌లో జీ+2 అంతస్తులతో పెంట్‌హౌస్‌తో కూడిన ఒక ఇల్లు, టెలికాం నగర్‌లో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో మరో ఫ్లాట్, తెల్లాపూర్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. మణికొండలో 500 గజాల విస్తీర్ణంలో ఉన్న జీ+5 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ వాటా ఉన్నట్లు అధికారులు తేల్చారు.

దాదాపు 44 ఎకరాల వ్యవసాయ భూములు : మణికొండ ప్రాంతంలోనే మరో 3,000 చదరపు అడుగుల భూమి కమర్షియల్‌గా ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల ప్లాట్, ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పటాన్‌చెరు జీపీఆర్​ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్ ఉంది. పటాన్‌చెరులోనే మరో 200 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 1000 గజాల ఖాళీ స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 2 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. వికారాబాద్ జిల్లా సీసీ కుంట మండలం ముచ్చింతలలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో ఒకచోట 6 ఎకరాలు, మరోచోట ఏకంగా 38 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఎకరం విలువైన భూమిని అధికారులు గుర్తించారు.

బినామీ అకౌంట్లు, లాకర్లు, ఆస్తులపై విచారణ : డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో ఏసీబీ అధికారులు తేల్చారు. ప్రస్తుతం దొరికిన ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్నామని, ఆయనకు సంబంధించిన మరికొన్ని బినామీ అకౌంట్లు, లాకర్లు, ఇతర ప్రాంతాల్లోని ఆస్తులపై విచారణ ఇంకా కొనసాగుతోందని ఏసీబీ ప్రకటన ద్వారా వెల్లడించింది. పోలీస్ శాఖలోనే డీఎస్పీ హోదాలో ఉంటూ, ఆదాయానికి మించి ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడం నగరంలో సంచలనంగా మారింది. డీఎస్పీ భీంరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తి అయిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నారు.

1995 బ్యాచ్‌ ఎస్సై : నాగర్‌కర్నూల్‌ జిల్లా జడ్చర్ల ప్రాంతం ఆలూరుకు చెందిన భీంరెడ్డి తొలుత కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో అడుగుపెట్టాడు. అనంతరం 1995 బ్యాచ్‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. 2003 ప్రాంతంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఎక్కువ కాలం విధులు నిర్వర్తించాడు. సైబరాబాద్‌తో పాటు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నారాయణగూడలాంటి ఠాణాల్లో ఎస్‌హెచ్‌వోగా పని చేసిన భీంరెడ్డి, పటాన్‌చెరు, వనస్థలిపురం ఏసీపీగానూ పని చేశాడు. రెండేళ్లుగా డీజీపీ కార్యాలయంలో ఉన్న పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌లో డీఎస్పీగా పనిచేస్తూ ఏసీబీకి చిక్కాడు.

ఏసీబీ వలలో ఆబ్కారీ ఎస్పీ మల్లారెడ్డి - రూ.3 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు

నరహరి బ్యాంకు లాకర్లను​ బద్దలుకొట్టిన ఏసీబీ అధికారులు - భారీగా డబ్బు, బంగారం చూసి షాక్​!

Last Updated : July 2, 2026 at 10:04 PM IST