ETV Bharat / state

నరహరి బ్యాంకు లాకర్లను​ బద్దలుకొట్టిన ఏసీబీ అధికారులు - భారీగా డబ్బు, బంగారం చూసి షాక్​!

నరహరి బ్యాంకు లాకర్‌లో రూ.కోటిన్నర నగదు గుర్తించిన ఏసీబీ - శాలిబండలోని కెనరా బ్యాంకులో నరహరి లాకర్లు తెరిచిన అధికారులు - ఇటీవల ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ నరహరి ఇంట్లో సోదాలు

Survey Officer Narahari
Survey Officer Narahari (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 20, 2026 at 3:47 PM IST

|

Updated : June 20, 2026 at 6:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

ACB Finds Rs.1.5 Crore Cash in Narahari Bank Locker : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సర్వే అండ్​ ల్యాండ్​ రికార్డ్స్‌ డిప్యూటీ డైరక్టర్‌ సుంకరి నరహరి బ్యాంకు లాకర్లను తాజాగా ఏసీబీ అధికారులు బద్దలు కొట్టారు. లాకర్లో ఏకంగా 1.50 కోట్ల నగదు బయటపడింది. బ్యాంకు లాకర్​లో భారీగా నగదు చూసిన ఏసీబీ అధికారులు విస్తుపోయారు. ఈ కేసులో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్​గూడ జైల్లో ఉన్నారు.

ఈ నెల 16న నరహరి నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల నివాసాల్లో ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల్లో రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లో మరో ఫ్లాట్, గచ్చిబౌలిలో జీ+3 భవనం, ఛత్రినాకలో జీ+2 భవనం, నిందితుడి ఇంట్లో రూ.1.54 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ.5.04 కోట్లు గుర్తించారు.

సుమారు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ మొత్తం రూ.13.05 కోట్లుగా ఏసీబీ అధికారులు అంచనా వేసినప్పటికీ బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే షాలిబండలోని కెనారా బ్యాంకు లాకర్‌ తాళం ఏసీబీ అధికారులకు ఇచ్చే విషయంలో నరహరి మొండికేసినట్టు తెలుస్తోంది. అయితే కోర్టు ద్వారా సెర్చ్ వారెంట్ తీసుకుని అధికారులు లాకర్లను బద్దలు కొట్టినట్టు సమాచారం. లాకర్‌లో రూ.1.50 కోట్లతో పాటు బంగారు బిస్కెట్లు, బంగారం మొత్తం 2 కిలోల మేర ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది.

నరహరి బ్యాంకు లాకర్‌లో రూ.కోటిన్నర నగదు గుర్తించిన ఏసీబీ
నరహరి బ్యాంకు లాకర్‌లో రూ.కోటిన్నర నగదు గుర్తించిన ఏసీబీ (ETV Bharat)

డిప్యూటీ సర్వేయర్​గా కారుణ్య నియామకం : జిల్లాల సరిహద్దుల్లో ఉండే భూ వివాదాల ఫైల్స్​ను తనదైన శైలిలో క్లియర్‌ చేయడంలో సిద్దహస్తుడిగా నరహరిరావుకు పేరుంది. రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో పని చేసిన సమయంలో కొందరు ప్రజాప్రతినిధుల భూ సమస్య పరిష్కారంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కారుణ్య నియామకం ద్వారా 18వ ఏట డిప్యూటీ సర్వేయర్‌గా శాఖలో చేరిన నరహరి రావు, పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 2016లో పదోన్నతి పొంది, 2020 వరకు రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌ శిక్షణా కేంద్రానికి ప్రభుత్వం బదిలీ చేసింది. 2024 నుంచి 2025 వరకు హెచ్ఎండీఏ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్నారు. విలువైన భూములకు సంబంధించిన దస్త్రాల పరిష్కారంలో ఆయన జోక్యాన్ని అధికారులు వెలికి తీస్తున్నారు.

లంచాలు ఆర్జించే అధికారులపై అవినీతి నిరోధక శాఖ కొరడా - ప్రభుత్వ స్వేచ్ఛతో దూకుడు పెంచిన ఏసీబీ

బెడ్​ కింద నోట్ల కట్టలు, కప్​బోర్డులో డబ్బు సంచులు - ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం

Last Updated : June 20, 2026 at 6:37 PM IST