అవినీతికి పాల్పడే వ్యక్తులు, సంస్థలపై నిరంతరం నిఘా: ఏసీబీ డీజీ అతుల్ సింగ్
అవినీతి రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వపరంగా అనేక చర్యలు చేపట్టామన్న ఏసీబీ డీజీ - అవినీతి ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉన్న శాఖలపై ప్రత్యేక దృష్టి - 2025లో కేసుల వివరాలు వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 9:51 PM IST
ACB Registered Cases in 2025 : అవినీతికి పాల్పడే వ్యక్తులు, సంస్థలపై నిరంతరం నిఘా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. ఈ ఏడాది ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచి, కేసుల విచారణను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. 2025లో ఏసీబీ నమోదు చేసిన కేసుల వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. 2025లో మొత్తం 115 కేసులు నమోదు చేయగా, వాటిలో 69 నేరుగా లంచం తీసుకుంటుండగా పట్టుకున్నవి ఉన్నాయని తెలిపారు. అలాగే ఆదాయానికి మించి ఆస్తుల కేసులు 8, క్రిమినల్ మిస్ కండక్ట్ 7, రెగ్యులర్ ఎంక్వయిరీలు 19, ఆకస్మిక తనిఖీలు 12 చేశామని అన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిపిన తనిఖీల అనంతరం కూడా 4 క్రిమినల్ కేసులు నమోదు చేశామని అతుల్ సింగ్ వెల్లడించారు. అవినీతి నియంత్రణలో ఏసీబీ కీలకంగా పని చేయాలని సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. కేసులు పెట్టడం మాత్రమే కాదు, అవినీతి పరులకు శిక్షలూ పడేలా విచారణ వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. అవినీతి ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉన్న శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రజల నుంచి కూడా తమకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి, వాటిలో ప్రాధాన్య ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు.
2025లో అత్యంత కీలకమైన కేసుగా ఇదే : 2024తో పోలిస్తే 2025లో ఏసీబీ తన పనితీరులో గణనీయమైన ప్రగతిని కనబరిచిందని అతుల్ సింగ్ అన్నారు. రెవెన్యూ శాఖలో అత్యధికంగా 19 ట్రాప్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఆ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (5), హోమ్ (4), ఫైనాన్స్ (4) కేసులు ఉన్నాయని అలానే గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఎస్‌ఈ 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుకోవడం ఈ ఏడాది(2025)లో అత్యంత కీలకమైన కేసుగా నిలిచిందన్నారు. అలాగే కల్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారన్నారు.
"అవినీతి నిర్మూలనకు అనేక చర్యలు తీసుకున్నాం. దర్యాప్తు కోణంలో కొన్ని అంశాలనే బహిర్గతం చేయగలం. అవినీతి రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వపరంగా అనేక చర్యలు చేపట్టాం. అవినీతి నిర్మూలనకు ఏసీబీ కీలకంగా పనిచేయాలని సీఎం గట్టిగా చెప్పారు. అవినీతి ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉన్న శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అవినీతిని నిర్మూలించి, రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. క్షేత్రస్థాయిలో అవినీతి సమాచారాన్ని 1064కు కాల్ చేయాలని కోరుతున్నాం. ఏసీబీ కేసుల విచారణలో నిపుణుల సేవలను కూడా వినియోగించుకుంటున్నాం. అవినీతి కేసుల్లో నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు ఉంటాయి. నూతన సంవత్సరంలో కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం."- అతుల్‌సింగ్, ఏసీబీ డీజీ
ఏసీబీ వద్ద అత్యాధునిక సాంకేతికత : 2025లో ఏసీబీ కోర్టుల్లో విచారణ పూర్తయిన కేసుల్లో 46 శాతం శిక్షలు పడ్డాయని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్‌సింగ్ తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోందన్నారు. సీడీఆర్ ఎనాలసిస్ సాఫ్ట్‌వేర్, సోషల్ మీడియా సెల్, ఏఐ టూల్స్ ద్వారా అవినీతి ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తోందన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే భయపడకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు లేదా వాట్సాప్ నెంబర్ 94404 40057 కు ఫిర్యాదు చేయాలని కోరారు.
వాణిజ్య పన్నుల శాఖలో దొంగలు! - అటెండర్ స్థాయి నుంచి దందాలు
సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏసీబీ మెరుపు దాడులు - పెద్ద ఎత్తున ఆస్తిపత్రాలు, నగదు స్వాధీనం

