ETV Bharat / state

మద్యం కుంభకోణం కేసు - నిందితుడు షేక్‌ సైఫ్‌ అహ్మద్‌ను లొంగిపోవాలన్న ఏసీబీ కోర్టు

మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు షేక్‌ సైఫ్‌ అహ్మద్‌ - 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఏసీబీ కోర్టు ఆదేశం - ఆలోగా అరెస్టు చేయొద్దని సిట్‌ను ఆదేశించలేమన్న కోర్టు

AP Liquor Scam Case
మద్యం కుంభకోణం కేసులో నిందితుడు షేక్‌ సైఫ్‌ అహ్మద్‌ను లొంగిపోవాలన్న ఏసీబీ కోర్టు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 3, 2026 at 8:01 AM IST

2 Min Read
Choose ETV Bharat

AP Liquor Scam Case : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో నిందితుడు షేక్‌ సైఫ్‌ అహ్మద్‌ (A-10) 15 రోజుల్లోగా లొంగిపోవాలని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. ఆలోగా అతన్ని అరెస్టు చేయొద్దంటూ సిట్‌ను ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి తేజోవతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కూటమి అధికారంలోకి రాగానే మద్యం కుంభకోణం మూలాలు వెలికితీస్తుండటంతో సైఫ్‌ అహ్మద్‌ 2024 ఆగస్టు 9న దుబాయ్‌కు పారిపోయాడు. కేసు దర్యాప్తులో భాగంగా అతని పాత్రపై సిట్‌ అధికారులు వివరాలు సేకరించారు. గత ఏడాది మే నెలలో అతనిపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. విదేశాల నుంచి వస్తే అరెస్టు తప్పదని భావించి, గత్యంతరం లేని పరిస్థితుల్లో సైఫ్‌ అహ్మద్‌ జులై నెలలో లొంగుబాటు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ న్యాయస్థానం లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

డొల్ల కంపెనీల్లో ప్రధాన భాగస్వామి: మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి లంచాలు వసూలు చేసేందుకు మద్యం కుంభకోణం ప్రధాన నిందితుడు రాజ్‌ కెసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌లో సైఫ్‌ అహ్మద్‌ అత్యంత కీలక సభ్యుడుగా సిట్‌ గుర్తించింది. కొల్లగొట్టిన సొత్తు దారి మళ్లించేందుకు టి.ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి (ఏ-9) నేతృత్వంలో ఏర్పాటైన డొల్ల కంపెనీల్లో ప్రధాన భాగస్వామిగా ఉన్నట్లు తెలిపింది. వారిద్దరి ప్రతినిధిగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించింది.

ఎంతెంత వసూలు చేయాలో లెక్కలు కట్టి: ఏపీఎస్‌బీసీఎల్‌లో అప్పట్లో ప్రత్యేకాధికారిగా పనిచేసిన సత్యప్రసాద్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ అనూషలు అత్యంత రహస్యంగా ఉండాల్సిన మద్యం విక్రయాల డేటాను రాజ్‌ కెసిరెడ్డి ఆదేశాల మేరకు రియల్‌ టైమ్‌లో సైఫ్‌ అహ్మద్‌కు చేరవేసేవారని సిట్ పేర్కొంది. ఏయే డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ఎంతెంత లంచాలు వసూలు చేయాలో లెక్కలు కట్టి సైఫ్‌ అహ్మద్‌, రాజ్‌ కెసిరెడ్డికి పంపించేవాడని సిట్ తెలిపింది.

అవకాశం లేక లొంగుబాటు పిటిషన్‌ దాఖలు: తర్వాత దశల్లో రాజ్‌ కెసిరెడ్డి తన నెట్‌వర్క్‌ ద్వారా ఆయా డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి లంచాల సొమ్ము వసూలు చేసినట్లు సిట్ తెలిపింది. డొల్ల కంపెనీల నిర్వహణ, బోగస్‌ పత్రాలు, బిల్లుల సృష్టి, నగదు అక్రమ రవాణా వంటి వాటిల్లోనూ సైఫ్‌ అహ్మద్‌ కీలకంగా వ్యవహరించారని వెల్లడించింది. ఈ కేసులో మిగతా నిందితులంతా అరెస్టు కావడం, సిట్‌ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవటంతో సైఫ్‌ అహ్మద్‌ లొంగుబాటు పిటిషన్‌ దాఖలు చేశారని సిట్ పేర్కొంది.

మద్యం కుంభకోణం కేసు - రంగంలోకి ఐటీ!

లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం - లొంగిపోతానంటూ సైఫ్ పిటిషన్‌