తిరుమల కల్తీ నెయ్యి కేసు - నిందితుడు లంచం తీసుకున్నట్లు అంగీకరించారని తెలిపిన సిట్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం - ఏసీబీ కోర్టులో పిటిషన్ విజయభాస్కర్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్- ఏపీపీ వాదనలతో ఏకీభవించి బెయిల్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 8:59 PM IST
Tirumala Laddoo Ghee Adulterated Case Updates: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ-34గా ఉన్న విజయభాస్కర్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. సిట్ తరఫున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించగా పీపీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు బెయిల్ డిస్మిస్ చేసింది. విజయ్‌భాస్కర్‌రెడ్డి చేసిన అక్రమాలను కోర్టులో అసిస్టెంట్ పీపీ వివరించారు.
నెయ్యి కంపెనీల పనితీరు బాగా లేకున్నా అనుకూలంగా నివేదిక ఇచ్చారని సిట్ గుర్తించిందని ఏపీపీ తెలిపారు. 2023లో భోలేబాబా కంపెనీ నుంచి రూ.75 లక్షలు తీసుకున్నట్లు సిట్ వాదించిందని తెలిపారు. ప్రీమియర్ కంపెనీ రూ.8 లక్షలు లంచం తీసుకున్నట్లు సిట్ వెల్లడించిందని అన్నారు. భాస్కర్‌రెడ్డి నివేదికతో టీటీడీకి రూ.118 కోట్లు నష్టం వచ్చిందని సిట్ తెలిపిందని ఏపీపీ కోర్టుకు తెలిపారు. కాగా సిట్ విచారణలో లంచం తీసుకున్నట్లు విజయ్‌భాస్కర్‌రెడ్డి అంగీకరించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలానే విజయ్‌భాస్కర్‌రెడ్డి నుంచి రూ.34 లక్షలను సిట్ సీజ్ చేసిందని ఏపీపీ కోర్టుకు తెలిపారు.
12 మందిని నిందితులుగా చేర్చిన సిట్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ ఇటీవల మరో 12 మందిని నిందితులుగా చేర్చింది. వీరిలో ఏడుగురు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కాగా, మరో ఐదుగురు డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలోని సభ్యులు. కల్తీ నెయ్యి సరఫరాలో వీరందరి ప్రమేయం ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. వీరిలో కొంతమంది డెయిరీల ప్రతినిధుల నుంచి లంచాలు తీసుకుని వాటికి అనుకూలంగా నివేదికలిచ్చారని, నిర్ణయాలు తీసుకున్నారని సిట్ గుర్తించింది. ఆ వివరాలతో ఈ నెల 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమో శనివారం వెలుగు చూసింది.
ఫిర్యాదుదారుడే నిందితుడా!: ఈ కేసులో ఫిర్యాదుదారైన టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం ప్రళయకావేరి మురళీకృష్ణను కూడా సిట్ నిందితుడిగా చేర్చింది. వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యుడు, గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీతో అంటకాగిన ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాథ్‌రెడ్డిని కూడా కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా పేర్కొంది. డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడైన ఆయన విధులు సక్రమంగా నిర్వహించలేదని పేర్కొంది.
ముగ్గురు టీటీడీ మాజీ జీఎంలు, గోశాల పూర్వ డైరెక్టర్, ఓ డిప్యూటీ ఈవో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకూ కల్తీ నెయ్యి సరఫరాలో పాత్ర ఉందని సిట్ పేర్కొంది. నిందితుల జాబితాలో ఉన్న టీటీడీ డిప్యూటీ ఈవో నటేశ్‌బాబు, జీఎం మురళీకృష్ణ ఇప్పటికే రిటైరయ్యారు. భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగ, ప్రీమియర్ అగ్రిఫుడ్స్ డెయిరీలకు వీరు సహకరించారని సిట్ పేర్కొంది.
పోలీసు కస్టడీకి తిరుమల కల్తీ నెయ్యి నిందితులు
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసు - సిట్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు

