'ఒక్క దెబ్బతో ఫేమస్ అయిపోవాలి' : సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ఫ్రెండ్‌నే చంపేశాడు!
వ్యక్తిగత ఫొటోల విషయంలో స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం - ఒక్కసారిగా ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో స్నేహితుడి హత్య - ఫ్రెండ్ గణేశ్‌ను దారుణంగా హత్య చేసిన సోమేశ్

Published : May 29, 2026 at 1:28 PM IST
Man Murdered his Friend in Suryapet : ప్రపంచాన్ని మనకు దగ్గర చేసే సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది పేరు, ప్రతిష్ఠలు సంపాదించుకుంటున్నారు. వారంతా వారిలోని సృజనాత్మకను వెలికితీశారు. మెదడుకు పదునుపెట్టారు. కానీ ఈ యువకుడు మాత్రం అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఫేమస్ కావాలనే ఆలోచనతో ఏకంగా ఓ హత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసులనే విస్మయానికి గురి చేసింది.
సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని గణపవరానికి చెందిన బల్గూరి గణేశ్ బెంగుళూరులో హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి, కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇతనికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హుజూర్‌నగర్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన బర్రెంకుల సోమేశ్‌తో ఓ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే వారి వ్యక్తిగత ఫొటోల విషయంలో గణేశ్‌కు, సోమేశ్‌కు మధ్య వివాదం చెలరేగింది. అది మనసులో పెట్టుకున్న సోమేశ్, గణేశ్‌ను చంపేందుకు పథకం రచించాడు.
స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన సోమేశ్ : గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఉదయ్‌కిరణ్‌తో కలిసి సోమేశ్ ఈ నెల 14న మద్యం తాగాడు. గణేశ్‌తో జరిగిన గొడవ గురించి వివరించి అతడ్ని పిలిచి బెదిరిద్దామని, తేడా వస్తే చంపేద్దామంటూ ఉదయ్‌కిరణ్‌కు చెప్పాడు. అతను సరేననడంతో ఇద్దరూ కలిసి అదే రోజు రాత్రి గణపవరం స్టేజీ సమీపంలోని బీక్యా తండా రహదారి ప్రాంతానికి వెళ్లారు. ఉదయ్‌కిరణ్‌ను అక్కడే ఉంచి సోమేశ్ ఒక్కడే ద్విచక్ర వాహనంపై వెళ్లి గణేశ్‌ను తీసుకొచ్చాడు. ముగ్గురూ మాట్లాడుకుంటుండగా ఫొటోల గురించి మరోసారి వివాదం జరిగింది. ఉదయ్‌కిరణ్ గణేశ్ కాళ్లూ, చేతులను దుస్తులతో కట్టేయగా సోమేశ్ బండరాయితో తలపై మోది, గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. పథకం ప్రకారం ముందుగానే వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేశాడు. గణేశ్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.
అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు : తెల్లారి హత్య విషయం ఊరంతా గుప్పుమంది. విషయం పోలీసులకు చేరడంతో దర్యాప్తు ప్రారంభించారు. సోమేశ్ తల్లిదండ్రులకు హత్య విషయం తెలిసి అతడికి డబ్బులిచ్చి పారిపోయేందుకు సహకరించారు. పోలీసులు ఉదయ్‌కిరణ్‌ను, సోమేశ్ తల్లిదండ్రులు జ్యోతి, సాంబయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సోమేశ్ భద్రాచలం, మారేడుమిల్లి నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్లినట్లు గుర్తించారు. తాజాగా హుజూర్‌నగర్ వచ్చాడనే సమాచారంతో అతడ్ని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు సోమేశ్ హుజూర్‌నగర్‌లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. చదివింది పదో తరగతే అయినా, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
''ఈ కుర్రాడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. అతని అవగాహన చూస్తే పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఏ యాప్‌ని ఎలా వాడుకోవాలి? ఏ డేటాను ఎలా డిలీట్ చేయాలనే అన్ని విషయాలపై అతనికి అహగాహన ఉంది. ఎలాంటి నేరాలు చేస్తే ఎలా తప్పించుకోవాలో అనే వీడియోలు సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. అందులో భాగంగానే అమాయకుడైన గణేశ్‌ను ఎంపిక చేసుకుని హత్య చేశాడు'' - శ్రీనివాసరెడ్డి, కోదాడ డీఎస్పీ
సోషల్ మీడియాలో గుర్తింపు కోసం : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సోమేశ్ నేరం ఎలా చేయాలి? ఎలా తప్పించుకోవాలనే అంశాలపై పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాడు. తక్కువ కాలంలో బాగా ఫేమస్ అవ్వాలనే ఆలోచనలో ఉన్న సోమేశ్‌కు గణేశ్‌తో జరిగిన వివాదం హత్య చేయాలనే ఆలోచనకు దారి తీసింది. ఆ హత్యతో సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందాలని భావించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత ఎలాంటి ఆధారాలు దొరకొద్దనే ఉద్దేశంతో గణేశ్ ఫోన్‌ను సోమేశ్ దగ్గరలోని బావిలో పడేశాడు. కత్తిని రోడ్డు పక్కన పడేశాడు. విచారణలో భాగంగా వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ఫోన్‌లో 198 యాప్‌లను గుర్తించారు. అవన్నీ ఛాటింగ్ యాప్‌లు, డేటింగ్ యాప్‌లు, ఇతర సోషల్ మీడియా యాప్‌లేనని తేల్చారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని - ప్రియుడితో కలిసి హతమార్చి, పూడ్చిపెట్టిన భార్య

