ETV Bharat / state

కొబ్బరి చిప్పలకు సరికొత్త రూపం - విదేశాలకు సైతం ఎగుమతులు

కొబ్బరి చిప్పలతో వస్తువులు తయారు చేస్తున్నహరికృష్ణ - లేజర్ కటింగ్, ఎంగ్రేవింగ్ టెక్నాలజీతో వస్తువుల తయారీ - రాఖీలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, అగరబత్తి, సెల్‌ఫోన్ స్టాండ్లు - యువత, మహిళలకు ఉపాధి కల్పిస్తున్న యువకుడు

కొబ్బరి చిప్పలతో వస్తువులు తయారు చేస్తున్నహరికృష్ణ
కొబ్బరి చిప్పలతో వస్తువులు తయారు చేస్తున్నహరికృష్ణ (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 7:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

Yuva Story On Coconut Handicrafts in Tirupati District : కొబ్బరికాయ కొట్టి అందులోని కొబ్బరిని తిని చిప్పను చెత్తబుట్టలోకి పడేస్తాం. అలా పడేసిన కొబ్బరి చిప్పలతోనే అందమైన కళాకృతులను తయారు చేస్తున్నాడా యువకుడు. అందరి దృష్టిని ఆకర్షించేలా 100 రకాలకు పైగా వస్తువులను డిజైన్ చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నాడు. వ్యాపారవేత్తగా రాణించడంతో పాటు గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి కల్పిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. మరి, ఆ భిన్నమైన బొమ్మలేంటో మనమూ చూద్దాం.

కొబ్బరికాయ కొడతాం, కొబ్బరి తింటాం, చిప్పను చెత్తలో పడేస్తాం. మరి, ఆ చిప్పతో ఏం చేయవచ్చు? అనే ప్రశ్నకు సమాధానమే ఈ యువకుడి వినూత్న ఆలోచన. పనికిరాదని పడేసిన కొబ్బరి చిప్పలకు సరికొత్త రూపం ఇస్తున్నాడు. చూపరుల దృష్టిని ఆకర్షించేలా వందకుపైగా కళారూపాలను తయారు చేసి విక్రయిస్తున్నాడు.

కొబ్బరి చిప్పలతో వస్తువులు తయారు చేస్తున్నహరికృష్ణ (ETV)

తిరుపతి జిల్లా పుత్తనవారిపల్లెకు చెందిన హరికృష్ణ హైదరాబాద్‌ JNTUలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. 4 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కరోనా సమయంలో వచ్చిన ఓ ఆలోచన ఈ యువకుడి జీవితాన్ని మలుపు తిప్పింది. దేవాలయాల్లో భక్తులు కొట్టే కొబ్బరికాయల చిప్పలను సేకరించి వాటితో ఏదైనా సృజనాత్మకంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.

కొబ్బరి చిప్పలతో 100కు పైగా వస్తువులు : ముందు కొబ్బరి చిప్పలను శుభ్రం చేసి, అవసరమైన ఆకృతుల్లోకి మలిచేందుకు ఆధునిక లేజర్ కటింగ్, ఎంగ్రేవింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు హరికృష్ణ. రాఖీలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, అగరబత్తి, సెల్‌ఫోన్ స్టాండ్లు, సబ్బు పెట్టెలు, కప్పులు, గరిటెలు, అలంకరణ వస్తువులు, దేవతామూర్తుల ప్రతిమలు ఇలా 100కి పైగా వస్తువులను తయారు చేస్తున్నాడు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా పేర్లు, డిజైన్లు, ఫొటోలనూ చిప్పలపై కళాత్మకంగా చెక్కుతున్నాడు.

కొబ్బరి చిప్పలతోనే కాకుండా కొబ్బరి పీచుతోనూ పిచ్చుక గూళ్లు, వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నాడు హరికృష్ణ. కళాకృతులు చాలామంది దృష్టిని ఆకర్షించడంతో అనితికాలంలోనే ఆర్డర్ల సంఖ్య పెరిగింది. "ఎకో వైస్ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌" అనే అంకుర సంస్థను ఏర్పాటు చేసి ఆధునిక యంత్రాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు.

"ఏదైనా సరికొత్తగా చేయాలని కాలేజీ రోజులనుంచి ఉండేది. నేను ఇంకా కొత్తగా ఆలోచించాను. ఓ సారి మా అన్నవారి ఇంట్లో పనికిరాని కొబ్బరి చిప్పలను చూశాను. అక్కడి నుంచి చిన్నచిన్నగా ప్రయోగాలు చేయటం మొదలు పెట్టాను. వాటిని తిరుపతిలోని ఆర్గానిక్ మేళాలో పెట్టాను. అక్కడికి తీసుకెళ్లిన స్టాక్ మొత్తం అయిపోయింది. అప్పుడు వాటికి ఉన్న ఆదరణ అర్థం అయ్యింది. తరువాత వాటిపైనే మొత్తం సమయం కేటాయిస్తూ టెక్నాలజీని వాడాం. ఇలా అందరి దృష్టిని ఆకర్షించేలా 100 రకాలకు పైగా వస్తువులను డిజైన్ చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నాను." - హరికృష్ణ, ఎకో వైస్ లివింగ్ ఫౌండర్‌

విదేశాలకు ఎగుమతులు : పుల్లంపేటలో మొదలైన ఈ చిన్న వ్యాపారం ప్రస్తుతం విదేశాల వరకు చేరింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ తెలుగు రాష్టాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు పంపిస్తున్నామని హరికృష్ణ భార్య లావణ్య చెబుతోంది. తాము తయారు చేసిన కళాఖండాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి అభినందించారని అంటోంది. కొబ్బరి చిప్పలతో కళాకృతులు తయారు చేసి విక్రయించడంతోపాటు సెలవు రోజుల్లో గ్రామంలోని పిల్లలకు ప్రకృతి పరిరక్షణ, వ్యర్థాల పునర్వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాడు హరికృష్ణ. పేపర్‌తో బ్యాగులు, పెన్నులు ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాడు.

సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న హరికృష్ణ గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధి కల్పించి బాసటగా నిలుస్తున్నాడు. భవిష్యత్తులో ఈ వృత్తిలో పలువురికి శిక్షణ ఇచ్చి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెబుతున్నాడు.

ఏఐ ప్రొఫెషనల్స్‌గా ఏపీ విద్యార్థులు - ఏడాదికి రూ.10 లక్షల జీతంతో జాబ్​

యువతకు బంపరాఫర్‌ - చదువుకుంటూనే లక్షల విలువైన కార్పొరేట్ శిక్షణ ఉచితం