ETV Bharat / state

YUVA : పళ్లపొడి నుంచి దుస్తుల వరకు అన్నీ ఆర్గానిక్ - "ఆహారమే ఔషధం" ఈ యువజంట నినాదం

తుల ఆర్గానిక్ సహకారంతో 'ది కాన్షియస్ లివింగ్ స్టోర్' - పర్యావరణహిత వస్త్రాలు విక్రయిస్తున్న దంపతులు - రైతుల నుంచే సేకరించిన దేశీ బియ్యం, చిరుధాన్యాలతో ప్రకృతి సిద్ధమైన 32 రకాల ఉత్పత్తుల తయారీ

Success Story of a Young Couple Hyderabad
Success Story of a Young Couple Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 4, 2026 at 2:20 PM IST

|

Updated : March 4, 2026 at 2:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Success Story of a Young Couple Hyderabad : కాలంతో పాటు మనిషి అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు రుచి కోసం వెంపర్లాడిన జనం, ఇప్పుడు ఆరోగ్యం కోసం అడుగులు వేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకంతో భూమి నిస్సారమవ్వడమే కాక, మనం తినే ఆహారం విషతుల్యమవుతోంది. ఈ క్రమంలోనే "ఆహారమే ఔషధం" అనే నినాదంతో హైదరాబాద్‌కు చెందిన ఓ యువ దంపతులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

సంప్రదాయ పత్తి సాగుకు ప్రోత్సాహం : అనంతపురం జిల్లాకు చెందిన జాహ్నవి దిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో ‘తుల’ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసింది. దేశీవాళీ పత్తి వంగడాల ప్రాముఖ్యత గుర్తించి బీటీ పత్తికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయ పత్తి సాగును ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఎంటెక్ గ్రాడ్యుయేట్ రాకేశ్​తో విహహం అయింది. ఇద్దరు కలిసి తమ ఆశయాల బాటలో నడుస్తున్నారు.

రైతులతో చేతులు కలిపి : దేశంలో ఇప్పటికీ మెజార్టీ జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నా, పెట్టుబడి పెరగడం గిట్టుబాటు ధర లేక రైతులు కష్టాల్లోనే చిక్కుకుంటున్నారు. ఈ పరిస్థితి మార్చాలని రాకేశ్​, జాహ్నవి సంకల్పించారు. చెన్నైకి చెందిన ‘తుల ఆర్గానిక్’ సహకారంతో కూకట్‌పల్లిలో "ది కాన్షియస్ లివింగ్ స్టోర్" ఏర్పాటు చేశారు. ప్రకృతి ప్రేమికులైన రైతులతో చేతులు కలిపి, వినియోగదారులకు నేరుగా స్వచ్ఛమైన ఆహారం, పర్యావరణహిత వస్త్రాలు అందిస్తున్నారు.

"బయట లభించే వస్తువులకు ఇక్కడ లభించేవాటికి సులభంగా తేడా గమనించవచ్చు. బయట దుస్తుల్లో కెమికల్​డై ఉంటుంది. ఇవి పర్యావరణానికి ఎంతో హానికరం. మేము అందించే బట్టలలో ప్రకృతి సహజంగా లభించే రంగులను వాడతాం. బంతిపూలు, మోదుగ పూలతో రంగులను తయారు చేస్తాం." - జాహ్నవి, ఆర్గానిక్ క్లోతింగ్ వ్యవస్థాపకురాలు

32 రకాల ప్రకృతి ఉత్పత్తులు : ఆహారమే ఔషధం అన్నది రాకేశ్​ సిద్ధాంతం. తండ్రి కష్టాలు చూసి దళారీల దోపిడీకి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. నేరుగా రైతుల నుంచే సేకరించిన దేశీ బియ్యం, చిరుధాన్యాలు, గానుగ నూనెలు, పప్పు దినుసులతో పాటు నిత్యం వాడే పళ్ల పొడి, సబ్బులు, ఇలా 32 రకాల ఉత్పత్తుల ప్రకృతి సిద్ధంగా తయారు చేయించి ప్రజలకు అందిస్తున్నారు. కల్తీ లేని ఆహారం తింటే ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నాడు ఈ యువ పారిశ్రామికవేత్త.

"ఇక్కడ లభించే ప్రతి వస్తువు నేరుగా రైతుల నుంచే తీసుకుంటున్నాం. పూర్తిగా నాటు రకం విత్తనాలనే సేకరిస్తున్నాం. పొద్దున్న వినియోగించే పళ్ల పొడి నుంచి బియ్యం పప్పులు, బెల్లం, నూనె, అటుకులు స్నాక్స్​ తదితరాలు ఇక్కడ లభిస్తాయి. రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి." - రాకేశ్​, ది కాన్షియస్ లివింగ్ స్టోర్ వ్యవస్థాపకుడు

పాతకాలం నాటి రుచులు గుర్తుచేశాయి : వీరి కృషిని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానిక వినియోగదారులు. నాణ్యమైన ఉత్పత్తులు ఇక్కడ లభిస్తున్నాయని, పాతకాలం నాటి రుచులు మళ్లీ చూస్తున్నామని చెబుతున్నారు.

"వీరి వద్ద లభించే వస్తువులు తక్కువ మొత్తంలో తీసుకున్నా అధిక ఫలితం ఇచ్చేంత క్వాలిటీ ఉన్నవి లభిస్తున్నాయి. వీరు కెమికల్స్ వినియోగించని పదార్థాలను విక్రయిస్తున్నారు. బయట వంట పదార్థాలకు ఇక్కడి పదార్థాలకు రుచిలో వ్యత్యాసాన్ని గమనించవచ్చు. కొర్రలు, సామలు, అరికలు మంచి రుచికరంగా ఉంటున్నాయి." - సరస్వతి, వినియోగదారురాలు

YUVA : సుజుకీ కంపెనీలో ఉద్యోగం వదిలి - వరి నాటు యంత్రం తయారీ

YUVA : 66సార్లు విఫలం, చివరకు సఫలం - ఆక్సిజన్ ఇంజిన్​​ను తయారుచేసిన యువ ఇంజినీర్

Last Updated : March 4, 2026 at 2:43 PM IST