'నన్ను నేను మోయలేకపోతున్నా - దాతలు కాస్త దయ చూపండయా'
వయసుకు మించిన బరువుతో యువకుడి ఇబ్బందులు - మంచంపై కదల్లేని స్థితిలో అవస్థలు - శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు - దాతలు సాయం చేసి ఆదుకోవాలంటూ వేడుకోలు

Published : January 9, 2026 at 10:23 AM IST
A Man Suffering From Over Weight : వయసేమో 27 సంవత్సరాలు. బరువు 220 కిలోలు. వినడానికి మనకే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా అతను పడే బాధ మాత్రం వర్ణనాతీతం. వయసుకు మించిన బరువుతో ఓవైపు కుటుంబానికి భారమయ్యాడు. శరీర ఆకృతితో చదువుకు దూరమై నరకయాతన అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం మంచం మీద నుంచి కిందకు దిగడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడు.
వయసుకు మించిన బరువుతో నరకయాతన : సాయికుమార్ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా మంచంపై కదల్లేని స్ధితిలో ఉంటున్నాడు. అతని వయస్సు 27 సంవత్సరాలు. కానీ వయసుకు మించిన బరువుతో నరకయాతన అనుభవిస్తున్నాడు. చదువుకుని కుటుంబాన్ని పోషించాల్సిన వయస్సులో తల్లికి భారంగా మారాడు. మంచం మీద నుంచి కిందకు దిగాలన్నా ఇద్దరు, ముగ్గురు సాయం చేయాల్సిన పరిస్ధితి. ప్రస్తుతం బరువైన దేహంతో తనువు భారమై బతుకుతున్న కుమారుడిని చూసి కన్నతల్లి సైతం తల్లడిల్లుతోంది.
కదలలేని స్థితిలో అమ్మపై ఆధారపడి : జనగామ జిల్లా ఎల్లంల గ్రామానికి చెందిన తాటి వెంకటయ్య, సిద్ధిబాల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా, కుమారుడు సాయికుమార్ జనగామలోనే ఇంటర్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే సాయికుమార్ లావెక్కడం, విపరీతమైన బరువు పెరగడం మొదలైంది. ఏదో కాస్త బరువు పెరుగుతున్నాడని భావించారు. కానీ ఇది అసాధారణ అనారోగ్య లక్షణమని గుర్తించలేదు. అంతలోనే తండ్రి వెంకటయ్య పక్షవాతంతో మరణించారు. తల్లి అనారోగ్యం పాలైంది. ఏడేళ్ల నుంచి సాయికుమార్ శరీరం లావెక్కడంతో ప్రస్తుతం కదల్లేని స్థితికి చేరాడు.
నెలకు రూ.50 వేల ఖర్చు - చేతిలో చిల్లిగవ్వ లేదు : సాయికుమార్ ఏడాది కిందట 180 కిలోలుండగా, ప్రస్తుతం 220 కిలోలకు చేరాడు. తమ శక్తికి మించినదే అయినా చాలా ఆసుపత్రుల్లో చూపించారు. అయినా ఫలితం కనిపించలేదు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చూపించగా, హార్మోన్ల ప్రభావంతో శరీరం బరువెక్కుతోందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని, విదేశాల్లో దొరికే ఖరీదైన ఇంజెక్షన్లు, ఔషధాలు అవసరమని తేల్చారు. నెలకు రూ.50 వేలు ఖర్చవుతుందని తెలిపారు. ఆరు నెలల చికిత్స అనంతరం అవసరమైన శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని, ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచడం లేదని సాయికుమార్ కన్నీరు పెడుతున్నాడు.
కనీసం ఫించను కూడా లేదు : సాయికుమార్ నడవలేని స్ధితిలో ఉన్నా, తల్లే అన్ని పనులూ చేస్తోంది. భర్త చనిపోయిన నాటి నుంచి కనీసం పింఛను కూడా రావట్లేదని సాయికుమార్ తల్లి వాపోతోంది. ఆమె కూడా కొంత కాలంగా తన కాలు విరిగినా కుమారుడికి సేవలు చేస్తూ జీవిస్తుందని గ్రామస్థులు తెలిపారు. ఊరి వాళ్లే ఆ బాధిత కుటుంబానికి చిన్నా చితకా సాయం అందిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని వీరి దీనస్థితిని చూసి ఇరుగు పొరుగు వారు సైతం కంటతడి పెడుతున్నారు.
"10వ తరగతి వరకు సాయికుమార్ ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ కాలేజీకి వెళ్లాక లావుగా ఉన్నాడని అందరూ ఎగతాళి చేస్తున్నారని మానేశాడు. తర్వాత ఎన్ని మందులు వాడినా అవి పని చేయలేదు. అంతే కాకుండా ఇంకా పెరిగాడు. గత మూడు సంవత్సరాలుగా మంచంపై నుంచి లేవడం లేదు. అన్ని పనులు నేనే చేస్తున్నాను. దాతలు కాస్త సాయం చేసి నా కుమారుడిని బతికించండి." - సిద్ధిబాల, బాధితుడి తల్లి
సాయం కోసం ఎదురుచూపు : అధిక బరువు, ఇన్ఫెక్షన్లతో సాయికుమార్ పడే బాధ వర్ణనాతీతంగా మారింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం వేడుకుంటోంది. ఎవరైనా సాయం చేస్తే తన కుమారుడిని బతికించుకుంటానని సిద్ధిబాల ఆశగా కోరుతోంది.
కుటుంబంపై పగబట్టిన విధి : తన పిల్లలను ఆదుకోవాలంటూ తల్లి వేడుకోలు
'కరెంటు తీసేస్తే - మా నాన్న ఊపిరి ఆగిపోతుంది' : ప్లీజ్ హెల్ప్ చేయండి

