అత్త ఆస్తిపై మోజు - ఆపదలో ఆదుకోలేదని అంతమొందించిన అల్లుడు
స్థలం అమ్మి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిందని - సుపారీ గ్యాంగ్ సాయంతో అత్తను చంపే ప్రయత్నం - సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు చిక్కిన నిందితులు

Published : January 11, 2026 at 1:07 PM IST
|Updated : January 11, 2026 at 2:25 PM IST
Woman Killed By Her Son In Law For Money : రెండుసార్లు తప్పించుకున్న ఆమె కథ, మూడోసారి సుపారీతో ముగిసింది. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని తానే చూసుకోవాలనుకోవడం ఆమె చేసిన తప్పు. ఆస్తి మోజుతో మొదలైన విషబీజం, ఆమెను అంతమొందించే స్థాయికి చేరింది. ఒంటరిగా జీవిస్తున్న ఆమెను తిరిగిరాని లోకాలకు పంపింది. ఆస్తిని కాజేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అతను చివరకు ఆయువు తీశాడు. ఇంతకీ ఏం జరిగింది? ఎలా జరిగింది?
డబ్బులు ఇవ్వలేదని హత్య : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. అత్త ఆస్తి కోసం అల్లుడు సుపారీ ఇచ్చి మరీ దారుణంగా చంపించాడు. తిమ్మారెడ్డిపల్లి మదిరసార్లవాడ గ్రామానికి చెందిన ఏలూరి రాములమ్మ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన సొంత స్థలంలో హోటల్ నడిపిస్తోంది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. చిన్న కుమార్తె రాధికను సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికిబొల్లారం గ్రామానికి చెందిన జీవన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేసింది. అతడు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లిలో ఎలక్ట్రిక్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో సాయం చేయాల్సిందిగా అత్త రాములమ్మను కోరాడు.
నిప్పంటించి చంపే ప్రయత్నం : కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఇక అత్త బతికి ఉన్నంతకాలం ఆమె ఆస్తి తన చేతికి వచ్చే పరిస్థితి లేదని భావించిన జీవన్ రెడ్డి, సలీమ్ అనే వ్యక్తికి విషయం వివరించాడు. సలీమ్, పాండు అనే మరొక వ్యక్తిని జీవన్‌రెడ్డికి పరిచయం చేశాడు. వారంతా రాములమ్మను చంపేయాలని పథకం వేశారు. ఈ మేరకు 6 నెలల క్రితం తన ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆమె తప్పించుకుంది. ఎవరో తన ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేశారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇలా రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.
సీసీ కెమెరాల ద్వారా : దాంతో ఈ నెల 6న రాములమ్మను చంపాలని అల్లుడు జీవన్‌రెడ్డి మరో ప్రణాళిక వేశాడు. అనంతరం ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తన స్నేహితులతో కలిసి అత్త దుకాణం వద్దకు వెళ్లాడు. కానీ అక్కడ ఎక్కువ జన సంచారం ఉండటంతో ఆమె ఇంటికి వెళ్లే వరకు ఆగి, ఆమెతో ఇంటికి వెళ్లారు. అక్కడ వారంతా కలిసి ఆమెను మాటల్లో పెట్టి, తన మెడకు తువ్వాలు బిగించి హత్య చేశారు. తర్వాత ఆమెను మంచంపై పడుకోబెట్టి వెనక ద్వారం నుంచి పారిపోయారు. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. హత్య చేయడానికి సహకరించిన వారికి రూ.లక్షల్లో ఇచ్చేందుకు జీవన్‌రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే రాములమ్మ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల బండారం అంతా బట్టబయలైంది.
"కరోనా సమయంలో తనకు ఉద్యోగం పోయిందని, తనకు డబ్బులు ఇవ్వమని నిందితుడు రాములమ్మను ఒత్తిడి చేశాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సలీం అనే వ్యక్తితో తన అత్తను చంపేందుకు ప్లాన్ చేసి హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించాం. జీవన్‌తో పాటు సలీం, లక్ష్మణ్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం." - నర్సింలు, గజ్వేల్ ఏసీపీ
బయటపడ్డ నేర చరిత్ర : 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు, తమదైన శైలిలో విచారించగా గతంలో జరిగిన హత్యాయత్నాలు కూడా బయటపడ్డాయి. నిందితుల నుంచి మూడు బైకులు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆస్తిపై మోజు మనుషుల్ని ఎంత దూరం తీసుకెళ్తుందో మరోసారి రుజువు చేసింది.
ప్రియుడిని చంపేస్తే యువతి తననే పెళ్లి చేసుకుంటుందని ఆశ - కానీ బెడిసికొట్టిన మాస్టర్‌ప్లాన్
మహిళతో మూడేళ్లుగా సహజీవనం - తల్లీకుమారుడిని చంపిన క్యాబ్ డ్రైవర్

