20 ఏళ్ల పగ - వేటకొడవళ్లతో వేటాడి మరి చంపిన ప్రత్యర్థులు
ఆఖరిచూపుకని వెళ్లి అనంతలోకాలకు వెళ్లిన చిన్నా - పక్కా ప్లాన్‌తో చంపిన బంధువులు - పగడ్బందీగా ప్లాన్ చేసి వేటకొడవళ్లతో నరికిన చుట్టాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 31, 2026 at 1:36 PM IST
A Man killed brutally In Guntur : గుంటూరులో పాత కక్షలు, అనుమానాల కారణంగా ఒక నిండు ప్రాణం బలిగొంది. తన భార్యపై ఉన్న అనుమానంతో మొదలైన వివాదం, చివరకు పెండ్ర చిన్నా (55) అనే వ్యక్తిని నడిరోడ్డుపై దారుణ హత్యకు గురిచేసేలా చేసింది. ప్రాణభయంతో సొంత ఊరిని విడిచిపెట్టి, దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తి కేవలం ఒకే ఒక్క బాధ్యత కోసం తిరిగి వచ్చి ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తన భార్యతో బుల్లయ్య చనువుగా ఉండటంతో వారిపై పెండ్ర చిన్నాకు అనుమానం ఉండేది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పగ పెరిగింది. 2006లో బుల్లయ్య హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణభయం ఉందని గ్రహించిన చిన్నా వారి నుంచి తప్పించుకునేందుకు తన భార్యతో కలిసి వేరే ఊరెళ్లిపోయాడు. చాలా కాలంగా ఏం జరుగుతుందోననే భయం భయంగానే బతుకుతున్నాడు. తన మేనమామ మరణించాడనే వార్త విని ఆఖరి చూపు కోసం గుంటూరులోని కొండ వెంకటప్పయ్య కాలనీకి తిరిగి వచ్చాడు. అయితే ఈ ప్రయాణమే తన జీవితానికి చివరిది అవుతుందని ఊహించలేకపోయాడు.
చిన్నా తిరిగి వచ్చిన విషయాన్ని గమనించిన ప్రత్యర్థులు, పాత కక్షలను మనసులో పెట్టుకుని సమయం కోసం వేచి చూశారు. ఏమరుపాటుగా ఉన్న తరుణంలో, అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై అతనిపై దారుణంగా దాడి చేసి నరికి చంపారు.
హత్యకు కారణమేంటి?: బుల్లయ్య హత్యకు సంబంధించి పోలీసులు చిన్నాపై కేసు నమోదు చేశారు. అప్పటినుంచి, బుల్లయ్య కుటుంబం చిన్నాపై కక్ష పెంచుకుని, అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. ప్రమాదాన్ని పసిగట్టిన చిన్నా మంగళగిరికి వెళ్లిపోయాడు. అక్కడ కూడా మరికొన్ని హత్యాయత్నాలను ఎదుర్కొన్న తర్వాత, అతను సూర్యాపేటకు మకాం మార్చి, దాదాపు 20 ఏళ్లుగా పాత ఇనుము (స్క్రాప్) దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
చివరి చూపు కోసం వచ్చిన చిన్నా : గుంటూరులోని కెవిపి కాలనీలో నివసించే చిన్న మేనమామ మట్టయ్య, ఈ నెల 29న అనారోగ్యంతో మరణించారు. తన మేనమామకు చివరి నివాళులు అర్పించేందుకు చిన్నా శనివారం గుంటూరుకు వచ్చాడు. అతను వచ్చిన విషయం అతని ప్రత్యర్థులకు తెలిసింది. ఆదివారం ఉదయం చిన్న తన కుటుంబంతో కలిసి మేనమామ పార్థివ దేహాన్ని సందర్శించాడు. ఆ తర్వాత అల్పాహారం కోసం బయటకు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు అతన్ని వెంబడించారు. కర్రలతో కొట్టి చిన్నాను కింద పడవేసిన దుండగులు, వేట కొడవళ్లతో నరికి, కత్తులతో పొడిచారు. అతని మెడ తెగిపోవడంతో అతని మృతదేహం రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉంది. బుల్లయ్య కుమారులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీఐ రాజేశ్ తెలిపారు
ఇదిలావుంటే హత్య కేసును నగరపాలెం పోలీసులు ఛేదించారు. 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
"20 ఏళ్ల కిందట పెండ్ర వెంకన్నఅలియాస్ చిన్నా వెంకటప్పయ్య కాలనీలో నివాసం ఉండేవారు. చిన్నా భార్యతో బుల్లయ్యకి వివాహేతర సంబంధం ఉండేది. దీంతో చిన్నా బుల్లయ్యని హత్య చేయడం జరిగింది. అప్పటి నుంచి చిన్నా సూళ్లూరుపేటలో నివాసం ఉంటున్నారు. గుంటూరు రావడంతో చిన్నాను చంపేందుకు గస్తీ నిర్వహించారు. ప్రధాన నిందితుడు ఇమ్మానుయేలు రాజు చిన్నాను చంపేందుకు కుట్ర పన్నాడు. 11 మందిని అదుపులోకి తీసుకోగా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తులు, ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నాం" -సీతారాం, గుంటూరు ఈస్ట్ డీఎస్పీ
తీసుకున్న డబ్బులు ఇవ్వలేక హత్య - నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
'ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు - మహిళను హత్య చేసి - ప్లాస్టిక్ డబ్బాలో కుక్కేసి!

