చదివింది పదో తరగతే - ఆవిష్కరణలు మాత్రం అద్భుతం
రైతులకు ఉపయోగపడే పలు ఆవిష్కరణలు చేస్తున్న మహిపాల్‌చారి - ప్రతిభకు పలు పురస్కారాలు సొంతం - వినూత్న ఆవిష్కరణలకు గాను 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

Published : December 7, 2025 at 4:23 PM IST
Inspiring Story of Innovator Mahipal Chary : ఆయనది పూర్తిగా గ్రామీణ నేపథ్యం. చదివింది పదో తరగతి మాత్రమే. ఎలాంటి ఉన్నత చదువులు, సాంకేతిక విద్యలు లేవు. అయితేనేం వ్యవసాయ రంగంలో రైతులకు ఉపయోగపడే పలు కొత్త యంత్రాలు, వస్తువులను ఆవిష్కరిస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు. అతడి ఆవిష్కరణలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది పలు పురస్కారాలు, ప్రశంసలను అందుకున్నాయి. ఇంతకీ ఎవరాయన? ఎలాంటి ఆవిష్కరణలు చేశారు? అందుకున్న అవార్డులు తదితర విషయాలు తెలుసుకుందాం.

సమాజానికి ఉపయోగపడేలా : హనుమకొండ జిల్లా పరకాల పురపాలక పరిధిలోని రాజిపేటకు చెందిన కడివెండి మహిపాల్‌చారి అనే వ్యక్తి మెకానిక్‌గా పని చేస్తూ ఇంజినీరింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సాగు పనుల్లో అన్నదాతలకు ఉపయోగపడేలా చైనా పవర్ వీడర్ (కలుపు కోత యంత్రం)కు షాక్ అబ్జర్వర్ అమర్చారు. పత్తి, మిరప పంటల సాగులో ఉపయోగపడే మినీ కల్టివేటర్, శ్రీవరి సాగు వీడర్ (వరి పంటలో కలుపు తీసేది), మినీ ట్రాక్టర్, ట్రాక్టర్ హైడ్రాలిక్ లిఫ్టు, ఎలక్ట్రికల్ ట్రాలీ ఆటోను అతడు రూపొందించారు.
రాష్ట్రపతి నుంచి పురస్కారం : మినీ కల్టివేటర్ ఆవిష్కరణకు గాను 2015లో రాష్ట్రపతి నుంచి పురస్కారాన్ని మహిపాల్‌చారి స్వీకరించారు. 2018లో నేషనల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవార్డుతో పాటు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందుకున్నారు. గతేడాది దిల్లీలో అమేజింగ్ ఇండియన్స్ పురస్కారం-2024 ని పొందారు. టెక్నాలజీని వినియోగించి సమాజానికి ఉపయోగపడేలా మినీ కల్టివేటర్‌ను రూపొందించినందుకు గాను ఆయన ఈ అవార్డు పొందారు. చైనా పవర్ వీడర్‌ను రైతులు కలుపు కోత పనులకు వినియోగిస్తున్నారు. అన్నదాతలు ఈ యంత్రాన్ని వినియోగించే క్రమంలో వైబ్రేషన్స్ రావడం, బలంగా పట్టుకోవడం వల్ల ఒత్తిడికి గురై వారికి ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్యలను నివారించేందుకు పాత, కొత్త చైనా పవర్ వీడర్ యంత్రాలకు షాక్ అబ్జల్‌ను అమర్చాడు. షాక్ అబ్జల్‌ను బిగించేందుకు రూ.3వేలను వెచ్చించారు. వీటిని తయారు చేసి అవసరమైన రైతన్నలకు అందిస్తున్నట్లుగా మహిపాల్‌చారి తెలిపారు.
విద్యుత్తు వాహనాలుగా పెట్రోల్ బండ్లు : రైతులకు ఉపయోగపడే యంత్రాలను మాత్రమే కాకుండా మహిపాల్ చారి పలు వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. పెట్రోల్‌తో నడిచే కారు, బైక్‌లను అతడు ఎలక్ట్రిక్ వాహనాలుగా (ఈవీ) మార్చుతున్నారు. ద్విచక్ర వాహనానికి (బైక్‌కు) 60 ఓల్టులు, 35 ఏహెచ్ బ్యాటరీతో పాటు ఇతర కిట్‌ను కూడా బిగించారు. 50 కిలోమీటర్లు వేగంతో 60 నుంచి 70 కి.మీ ప్రయాణిస్తుందని, ఇందుకోసం బ్యాటరీని 5 గంటల పాటు ఛార్జింగ్ చేయాలని మహిపాల్‌చారి వివరించారు. వీటి ఛార్జింగ్‌కు ఒక యూనిట్ విద్యుత్తు మాత్రమే అవసరమని, ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనంగా మార్చేందుకు రూ.35 వేల ఖర్చయినట్లుగా మహిపాల్‌చారి వెల్లడించారు. ఇదే తరహాలో పాత కార్లను విద్యుత్తు వాహనాలుగా మార్చుతున్నట్లుగా ఆయన వివరించారు. 4 గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 70 నుంచి 250 కి.మి.దూరం ప్రయాణించొచ్చని, ఎలక్ట్రిక్ కారుగా మార్చేందుకు రూ.1.50 లక్షల వరకు వ్యయం అవుతుందని వివరించారు.
YUVA : ఇంటర్నెట్ అవసరం లేకుండానే డేటా వినియోగం - పాస్‌వర్డ్‌తో విద్యుత్ సరఫరా నియంత్రణ

