జనసేన పార్టీ కార్యాలయంలో వ్యక్తి హల్చల్ - పవన్ వాహన శ్రేణిలోని కార్ల అద్దాలు ధ్వంసం
జనసేన కేంద్ర కార్యాలయంలో చొరబడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు - శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నీలాద్రిగా గుర్తింపు - ఉదయం జనసేన కార్యాలయంలోకి చొరబడిన కార్ల అద్దాలు ధ్వంసం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 4:29 PM IST
A Man Attack to Deputy CM Pawan Kalyan Office : మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలోకి చొరబడి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. నేరుగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయంలోకి వెళ్లాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించడంతో వాళ్లను పక్కకు నెట్టి అక్కడే ఉన్న కర్రతో పవన్ కల్యాణ్ వాహన శ్రేణిలోని కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. రోప్ పార్టీ సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు.
జనసేన కేంద్ర కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నీలాద్రిగా పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం 9:30 గంటల సమయంలో కార్యాలయంలోకి చొరబడటమే కాకుండా అక్కడి ప్రాంగణంలో కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. విజయవాడ నుంచి ఆటోలో వచ్చి నీలాద్రి నేరుగా పవన్ కల్యాణ్ సీఎస్ఓ గదిలోకి వెళ్లారు. అక్కడ సుమారు పావుగంట సేపు అటూ ఇటూ తిరిగారు.
కాసేపటికి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించడంతో వాళ్లను పక్కకు తోసి అక్కడే ఉన్న కర్రతో ఉపముఖ్యమంత్రి వాహన శ్రేణిలోని కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. రోప్ పార్టీ సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళగిరి స్టేషన్‌కు వచ్చారు. నీలాద్రిని పోలీసులు ప్రశ్నించగా నిందితుడిని పొంతనలేని సమాధానం చెప్పాడు. తనకు ఇది మూడో జన్మని పవన్ కల్యాణ్ ఆఫీసుకు అమ్మవారే పంపించారని నిందితుడు తెలిపాడు. దీంతో అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏమైనా రాజకీయ కుట్ర ఉందా? : మరోవైపు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అలా అలా చేశాడనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో ఐజీ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపట్టారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో తన సమస్యపై అర్జీ ఇచ్చేందుకు ఇచ్ఛాపురం నుంచి వచ్చినట్లు సమాచారం.
క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ కలకలం : గత ఏడాది జనవరిలో సైతం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ ఎగిరింది. ఈ మేరకు పార్టీ నాయకులు డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. శాంతిభద్రతల అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి టౌన్ సీఐ వినోద్ తదితరులు జనసేన కార్యాలయానికి చేరుకుని సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. మధ్యాహ్నం డ్రోన్ చాలా ఎత్తులో ఎగురుతూ కనిపించిందని, ఫొటో తీయటానికి వీలుపడలేదని ఒకరు చెప్పినట్లు తెలిసింది. డ్రోన్‌ను తొలుత చూసిందెవరు? అది ఎంత ఎత్తులో ఎగిరింది? ఏ వైపు నుంచి వచ్చింది? ఎటు వైపు వెళ్లిందనే వివరాలను పార్టీ కార్యాలయ సిబ్బందితో పాటు ఆ పరిసరాల్లోని నివాసాలు, దుకాణాల వారిని అడిగి నమోదు చేసుకున్నారు.
చివరికి ఆ డ్రోన్‌ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తోంది. పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్ ఎగిరినట్లు పోలీసులు గుర్తించారు.
పవన్ కల్యాణ్ దత్తత గ్రామం కొణిదెలకు కొత్తదశ - రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు
15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ది : పవన్ కల్యాణ్

