'అమ్మ, నాన్న, తమ్ముడు క్షమించండి' - అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన - అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం - కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు - అందరినీ కంటతడి పెట్టిస్తున్న లేఖ

Published : December 21, 2025 at 4:22 PM IST
A couple died due to debt problems in Siddipet District : అప్పుల బాధ భరించలేక దంపతులు పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, దాచారం గ్రామంలో వడ్లకొండ శ్రీహర్ష (32), రుక్మిణి(25) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె హరిప్రియ ఉంది. బెజ్జంకి మండల కేంద్రంలో రెండేళ్లుగా వస్త్ర దుకాణం నిర్వహిస్తూ వారు బతుకుబండిని లాక్కొస్తున్నారు. అక్కడే ఓ అద్దె గదిలో నివాసముంటున్నారు. దుకాణం నుంచి వచ్చే ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటంతో కుటుంబ పోషణకు శ్రీహర్ష అప్పు చేశాడు. మరికొంత మందికి మధ్యవర్తిగా ఉంటూ ఇతరుల వద్ద అప్పులను ఇప్పించాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి కొద్ది రోజులుగా వేధింపులు ఎక్కువ కావడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

పురుగుల మందు సేవించి - విగత జీవులుగా మారి : ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అద్దె గదిలో శ్రీహర్ష, రుక్మిణి దంపతులు పురుగుమందును సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో కింద పడిపోవడం వల్ల తల్లిదండ్రులకు ఏమైందో తెలియని పరిస్థితిలో ఉన్న కుమార్తె హరిప్రియ గట్టిగా కేకలు వేసింది. గది నుంచి శబ్దాలు రావడంతో ఇంటి యజమాని గమనించి స్థానిక పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు. ఇంటి ద్వారాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే రుక్మిణి విగత జీవిగా కనిపించింది.
కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షతో పాటు పురుగు మందు తాగినట్లుగా ఉన్న హరిప్రియను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీహర్షను కరీంనగర్‌కు తరలిస్తుండగా, అతడు మార్గమధ్యంలో మృతి చెందాడు. హరిప్రియను సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఇద్దరు దంపతులు అర్థాంతరంగా తమ జీవితాన్ని ముగించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు : రుక్మిణి, శ్రీహర్ష మృతదేహాలను శవపరీక్ష (పోస్ట్‌మార్టం) నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. దంపతుల ఆత్మహత్య ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దంపతుల ఆత్మహత్య ఘటనపై సిద్దిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను, ఎస్సై సౌజన్య విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు ముందు శ్రీహర్ష రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అప్పులిచ్చి వేధిస్తున్న పలువురి పేర్లతో పాటు చివరికి అమ్మ, నాన్న, తమ్ముడు, అత్తమ్మ క్షమించండి అంటూ రాసిన అక్షరాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు : జీవితమన్నాక ఏదో ఓ సందర్భంలో సమస్యలు రావడం సహజమని, వాటికి సరైన రీతిలో ఆలోచిస్తే పరిష్కారమార్గాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చినా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, మీ సమస్యను ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటున్నా, మీకు సహకరించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. అందుకోసం స్నేహ ఫౌండేషన్ - 04424640050 (24x7 అందుబాటులో ఉంటుంది) లేదా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్ - 9152987821కి సంప్రదించవచ్చు. వీరు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి మీ సమస్యలను వివరించవచ్చు. తద్వారా తగిన పరిష్కారమార్గాలను పొందవచ్చు.
తన గదిలోని బాత్రూంలో మహిళ సూసైడ్ - 'పరువు' కోసం ఆలస్యం చేస్తే ప్రాణమే పోయింది!
'నేను చనిపోతా - లేదు నేనే చనిపోతా' - సూసైడ్‌పై ఆ ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్!

