రాజుల కాలం నాటి నాణేలు, సమరయోధుల స్టాంపులు - 60 ఏళ్లుగా సేకరిస్తున్న శివప్రకాష్
156 దేశాలకు సంబంధించిన విదేశీ కరెన్సీ నోట్లు, 70 దేశాల నాణేలు - 15ఏళ్ల వయసు నుంచే సేకరణ - తెలుగు మహాసభలో ప్రభుత్వం తరఫున పురస్కారం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 12:06 PM IST
Rare Coins Collection : ఆ ఇంట్లోకి వెళితే రాజుల కాలం నాటి నాణేలు, గ్రామ్‌ఫోన్ రికార్డులు, పురాతన గ్రంథాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాల సీడీలు కనిపిస్తాయి. మనం విడిచిపెట్టిన పైసలే కాదు, బేడ, దమ్మిడి, కాసులు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. వివిధ సంవత్సరాల్లో జారీ చేసిన స్వాతంత్య్ర సమరయోధుల స్టాంపులు కూడా అబ్బుర పరుస్తాయి. 70ఏళ్లు దాటినా ఇంకా అరుదైన స్టాంపులు, నాణేలు సేకరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఏడుపదుల వయసున్న వ్యక్తి. అసలు ఈ నాణేలు సేకరించిన వ్యక్తి ఎవరు? ఏ కాలం నాటి నాణేలను ఆయన సేకరించారు? మొత్తం ఎన్ని నాణేలు ఆయన దగ్గర ఉన్నాయి? వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
15ఏళ్ల వయసు నుంచి సేకరణ : ప్రస్తుతం జేఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్న, విశాఖపట్నం నగరానికి చెందిన గొట్టెముక్కల సుబ్రహ్మణ్య శివప్రకాశ్ (74) అనే వ్యక్తి అరుదైన నాణేలను సేకరించి ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డి.సి.సి.బి.)లో మేనేజర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు శివప్రకాశ్. అనంతరం 2023లో కనకమహాలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకులో ప్రజాసంబంధాల అధికారిగా కూడా సేవలందించారు.
15ఏళ్ల వయసు నుంచి స్టాంపులు, నాణేలు, అరుదైన వస్తువుల సేకరణ అలవాటైంది. ప్రస్తుతం ఆయన వద్ద 156 దేశాలకు సంబంధించిన విదేశీ కరెన్సీ నోట్లు, 70 దేశాల నాణేలు ఉన్నాయి. 2012 నుంచి అతని వద్ద ఉన్న వాటితో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు మచిలీపట్నం, తణుకు, ఏలూరు, రాజమహేంద్రవరం, పాలకొల్లు, విశాఖపట్నం, విజయనగరం వంటి పట్టణాల్లో 17 చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి పురస్కారం : గాంధీ జయంతి సందర్భంగా నాలుగు పర్యాయాలు మహాత్ముని చిత్రంతో ఉన్న తపాలా బిళ్ల, నాణేలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 3.56 లక్షల మంది విద్యార్థుల వరకు తన ప్రదర్శనలను తిలకించారని సుబ్రహ్మణ్య శివప్రకాశ్ తెలిపారు. అంతేకాకుండా గతంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన ప్రదర్శనకు ప్రభుత్వం పురస్కారాన్ని కూడా అందజేసిందని శివప్రకాశ్ హర్షం వ్యక్తం చేశారు.
ఏమేం ఉన్నాయంటే : కుషాణులు, చోళులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, కాకతీయులు, విజయనగరం రాజులు, దేవగిరి యాదవులు, మగద, తంజావూరు, శివగంగ రాజులు, పశ్చిమ, తూర్పు చాళుక్యులు, టిప్పు సుల్తాన్, అక్బరు, మరాఠ చాళుక్యుడు, బ్రిటిష్ - ఇండియా, రిపబ్లిక్ ఇండియా, ఈస్టు ఇండియా కంపెనీ, 1950 తరువాత వచ్చిన అన్ని రకాల నాణేలు భద్రంగా ఉన్నాయి. ఇటీవల పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా విడుదల చేసిన రూ.100 నాణెం, వందేమాతర గీతం ఆవిర్భవించి 150 ఏళ్లయిన సందర్భంగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నాణేలను కూడా సేకరించారు.
"ఇటీవల గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో నా ప్రదర్శనకు మెచ్చి ప్రభుత్వం పురస్కారం అందజేసింది. పురాతన నాణేలు, వస్తువులు భావితరాలకు అందజేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాను" - గొట్టెముక్కల సుబ్రహ్మణ్య శివప్రకాశ్
ఏడాదిన్నరలోనే వంతెన పూర్తి - 'థాంక్యూ డిప్యూటీ సీఎం సార్' అంటూ ప్లకార్డులు
గండికోట రహస్యాన్ని ఛేదిద్దామా? - నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు

