ETV Bharat / state

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు - పొరుగు దేశాల నౌకాదళాలకు రక్షణ శాఖ అలర్ట్

ఓడలరేవు జెట్టి నుంచి వేటకు వెళ్లి 23 రోజులైన మత్స్యకారులు - ఆచూకీ దొరికే వరకు గాలింపును ఆపొద్దని రక్షణ శాఖ ఆదేశాలు - బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక అధికారులకు సమాచారం

KONASEEMA FISHERMEN MISSING CASE
గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 26, 2026 at 10:30 AM IST

2 Min Read
Choose ETV Bharat

Defense Department Inquires About Fishermens Details : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓడలరేవు జెట్టి నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిందే. వారు వెళ్లి 23 రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి.

రక్షణ శాఖ కీలక ఆదేశాలు : సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుల ఆచూకీ కోసం అన్వేషణను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయొద్దని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు భారత కోస్ట్ గార్డ్ అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏడుగురికి సంబంధించిన సమగ్ర వివరాలను వెంటనే పంపించాలని కోరినట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ) కరుణాకర్ వెల్లడించారు. బోటు, మత్స్యకారుల జాడ తెలిసిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక దేశాల నౌకాదళ అధికారులను సైతం రక్షణ శాఖ కోరింది.

కేంద్ర మంత్రితో ఎంపీ భేటీ : 23 రోజులైనా ఆచూకీ దొరకకపోవడంతో అమలాపురం ఎంపీ హరీశ్ మాథుర్ సోమవారం దిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. మత్స్యకారులను కాపాడాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మంగళవారం ఎంపీ హరీశ్ మాథుర్.. భారత కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆనంద్ ప్రకాశ్ బదోలాను కూడా కలిశారు. బోటు ఇంజిన్ పాడైపోవడం వల్ల సముద్ర ప్రవాహానికి అది బంగ్లాదేశ్ లేదా మయన్మార్ జలాల్లోకి కొట్టుకుపోయి ఉండొచ్చని ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

రంగంలోకి 15 నౌకలు, 4 హెలికాప్టర్లు : గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధప్రాతిపదికన గాలిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. కోల్‌కతాలోని తూర్పు ఈశాన్య కమాండ్‌ కూడా ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటోందని ఆయన వివరించారు. మంగళవారం ఏకంగా 15 కోస్ట్‌గార్డ్‌ నౌకలు, నాలుగు అధునాతన హెలికాప్టర్లను రంగంలోకి దించామని మంత్రి పేర్కొన్నారు. ప్రధానంగా డైమండ్ హార్బర్, సుందర్బన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా అన్వేషిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎలాగైనా వారిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

బోట్లపై కొరవడిన పర్యవేక్షణ - ప్రమాదాల బారిన మత్స్యకారులు

కోనసీమలో బోటు ప్రమాదం - సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు