వైభవంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు - ప్రత్యేక ఆకర్షణగా రామోజీరావు కళాప్రాంగణం
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు - మూడు రోజులపాటు జరగనున్న వేడుకలు - రామోజీరావు విగ్రహాం ఏర్పాటు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 3:46 PM IST
3rd Telugu Mahasabhalu 2026 in Guntur : ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలకు తెలుగు భాషాభిమానులు, సాహితీప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష ప్రాచీనత్వాన్ని ప్రస్ఫుటించేలా పురాతన సాహిత్యం, ప్రాచీన నాణేలు, తెలుగు సంప్రదాయ వంటకాలు సందడి చేశాయి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్. మానవేంద్రనాథ్‌రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు.
ఇంత పెద్ద సభ జరుగుతుందని ఊహించలేదు : మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ పాల్గొని ప్రసంగించారు. "ఇంత పెద్ద తెలుగు సభ జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. మనిషికి పుట్టుకతోనే మాతృబంధం, భాషాబంధం ఏర్పడతాయి. భాష కేవలం భావవ్యక్తీకరణకు మాత్రమే కాదు. ఒక ప్రపంచాన్ని సృష్టించేంత బలం భాషలో ఉంది. మనందరం భాష వల్ల బంధువులం. తెలుగు భాష వల్ల మనకు ఓ గుర్తింపు ఉంది. అధికార వ్యవహారాల్లో తప్పనిసరిగా తెలుగు ఉండాలి. జిల్లాస్థాయి వరకు కోర్టు కార్యకలాపాలు తెలుగులో జరగాలి" అని ఆకాంక్షించారు.
తెలుగు భాష ప్రభుత్వానికి అధికార భాష : ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మహాసభలకు అధ్యక్షత వహించి మాట్లాడారు. "తెలుగు భాష ప్రభుత్వానికి అధికార భాష, మాకు మాత్రం మమకార భాష. ఆంధ్ర సారస్వత పరిషత్తు తరఫున మూడోసారి ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నాం. రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాచీన భాష తెలుగు. నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి వారు తెలుగు భాషకు పట్టం కట్టారు. ఎన్టీఆర్, రామోజీరావు తెలుగుకు గుర్తింపు తెచ్చిన వారిలో ప్రముఖులు" అని కొనియాడారు.
ఇంగ్లీష్ వల్లే ఉద్యోగాలు రావు : "ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదవాలని జాతీయ విద్యా విధానం చెబుతోంది. నాకు తెలుగు బాగా వచ్చు కాబట్టే ఐదు భాషలు నేర్చుకున్నా. ప్రపంచంలో వివిధ రంగాల ప్రముఖులు వారి మాతృభాషలో చదువుకున్నారు. ఇంగ్లీష్ వల్లే ఉద్యోగాలు రావు. విషయ పరిజ్ఞానం ఉంటే వస్తాయి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి పెట్టాలి" అని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
రామోజీరావు విగ్రహాం ఏర్పాటు : గుంటూరు కేంద్రంగా జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, దివంగత రామోజీరావు ప్రాంగణం ప్రత్యేకంగా నిలుస్తోంది. తెలుగు భాష పరిరక్షణ కోసం ఈనాడు పత్రిక ద్వారా ఆయన చేసిన సేవలకు గుర్తుగా రామోజీరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాసభలకు విచ్చేసిన తెలుగువారిని రామోజీరావు విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోందని చెబుతున్న విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రాజ్‌కుమార్ వడియార్ తెలిపారు.
బడి పిల్లలకు గుడ్‌న్యూస్ - 'స్మార్ట్ కిచెన్'ల ద్వారా వేడివేడి భోజనం
నిర్దేశిత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలి - కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

