ETV Bharat / state

దేశభాషలెన్నున్నా తొలి ప్రాధాన్యం తెలుగుకే - అత్యంత వైభవంగా ప్రారంభమైన తెలుగు మహాసభలు

కిమ్స్‌ వైద్యకళాశాల ప్రాంగణంలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు - పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, నటుడు, రచయిత తనికెళ్ల భరణి

3rd World Telugu Conference in Amalapuram
3rd World Telugu Conference in Amalapuram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 1, 2026 at 9:56 AM IST

|

Updated : March 1, 2026 at 10:49 AM IST

3 Min Read
Choose ETV Bharat

3rd World Telugu Conference in Amalapuram: తల్లిపాల వంటి తెలుగుభాషను కాదని డబ్బాపాల లాంటి ఇతర భాషల మోజులో పడటం సరికాదని భాషావేత్తలు, పండితులు అన్నారు. పాఠశాలలతో పాటు తల్లిదండ్రుల వైఖరి మాతృభాషకు ముప్పుగా మారుతోందని తెలుగు మహాసభల వేదికగా ఆందోళన వెలిబుచ్చారు. అమ్మభాషకు అగ్ర ప్రాధాన్యమిస్తూ ఆంగ్లం కూడా నేర్చుకోవచ్చని సభాపతి అయ్యన్నపాత్రుడు ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ త్వరలోనే చట్టం తీసుకొస్తామని చెప్పారు.

వైభవంగా తెలుగు మహాసభలు: అమలాపురం కిమ్స్‌ వైద్యకళాశాల ప్రాంగణంలో మూడో ప్రపంచస్థాయి తెలుగు మహాసభలు వైభవంగా సాగుతున్నాయి. కిమ్స్‌ వైద్యకళాశాల వ్యవస్థాపక ఛైర్మన్‌ చైతన్యరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2 రోజులపాటు జరిగే ఈ మహాసభల ప్రాంగణానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు పెట్టారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ప్రఖ్యాత ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు జ్యోతి ప్రజ్వలనతో మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభల్లో పాల్గొన్న విద్యార్థుల తెలుగు ప్రసంగాలు, పద్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

సభలో పాల్గొన్న ప్రముఖులు: అంతేకాకుండా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఆర్​ఎస్​ఎస్​ నేత రామ్‌మాధవ్‌, ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి, భాషావేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సహా పలువులు ప్రముఖులు తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. మాతృభాష ఔన్నత్యాన్ని వివరించారు. ఆంగ్ల భాష మోజులో పడి తెలుగును విస్మరించడం సరికాదని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు.

పిల్లలు తెలుగులో మాట్లాడాలి:స్పీకర్ అయ్యన్న ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. దీనిపై త్వరలోనే శాసనసభ ముందుకు బిల్లు రానున్నట్లు చెప్పారు. నేను ఈ మధ్య కాలంలో చాలా దేశాలు వెళ్లానని తెలిపారు. అక్కడ ఉన్న మన తెలుగు వాళ్లు తెలుగు భాష ఔన్నత్యం, అభివృద్ధి గురించి మాట్లాడుతారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో మనం మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మ కడుపులో నుంచి జన్మించిన శిశువు ఈ భూమి మీదకు వచ్చిన వెంటనే పలికే మొదటి పేరు అమ్మ అనే పిలుస్తాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులంతా తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పించాలని కోరుతున్నానని అయ్యన్న వెల్లడించారు. తెలుగు భాష పరిరక్షణకు ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ తెలుగు తప్పనిసరి చేసేలా త్వరలో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నామని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

"తెలుగు భాష పరిరక్షణకు ఒకటో తరగతి నుంచిఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే శాసనసభ ముందు బిల్లును ప్రవేశపెట్టనున్నాం"-అయ్యన్నపాత్రుడు, స్పీకర్

"పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చదివించాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో మొదలవ్వాలని అలా జరిగినప్పుడే అమ్మభాషకు మళ్లీ పునర్వైభవం వస్తుందని చాగంటి కోటేశ్వరరావు ఆకాంక్షించారు. పిల్లల ముందు తల్లిదండ్రులు పద్యాలను చదివి వారికి దాని గొప్పతనాన్ని తెలియజేయాలి"-చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ ప్రవచనకర్త

"తల్లిపాల లాంటి మాతృభాషకే తొలి ప్రాధాన్యమివ్వాలి. నేను గత 50 సంవత్సరాలుగా ఎక్కడైనా సంతకం చేసేటప్పుడు తెలుగులోనే సంతకాన్ని చేస్తున్నాను. తెలుగుభాషను ఎవరూ విస్మరించకూడదు. భాషను కాపాడుకుంటే మన దేశ సంపదను, ఔన్నత్యాన్ని కాపాడుకున్నట్లుగానే భావించాలి"-తనికెళ్ల భరణి, ప్రముఖ రచయిత,నటుడు

"ఆంగ్ల భాష మోజులో పడి తెలుగును విస్మరించడం సరికాదు. మాతృభాష ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పాలి. మన భాషను పాటించాలి, పరభాషను గౌరవించాలి. విద్యార్థులు ఇంట్లో మ తల్లిదండ్రులతో చక్కగా తెలుగులోనే మాట్లాడటం అలవాటు చేసుకోవాలి"-కంభంపాటి హరిబాబు,ఒడిశా గవర్నర్

ఇంటర్‌ వరకు తెలుగు తప్పనిసరి చేసేలా సభలో బిల్లు తెస్తున్నాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తెలుగు భాషను మరిస్తే అమ్మను మరిచినట్టే: వెంకయ్యనాయుడు

Last Updated : March 1, 2026 at 10:49 AM IST