ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలు - 42 దేశాల నుంచి తరలివచ్చిన తెలుగుప్రజలు
సాంస్కృతిక, కళా ప్రదర్శనలతో ఉట్టిపడిన తెలుగుదనం - తెలుగు ఖ్యాతి చాటేలా అతిథులు, వక్తల ప్రసంగాలు - తెలుగు మహాసభల్లో ఇవాళ ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 10:45 AM IST
3rd World Telugu Conference Gradly in Guntur District : పద్యాలు, గద్యాలు, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక, కళా ప్రదర్శనలు ఇలా ఎటు చూసినా తెలుగుదనమే.! ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష తెలుగు ప్రజలతో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణం అలరారింది. అమృతతుల్యమైన భాషణలతో అతిథులు, ఆకట్టుకునే ప్రసంగాలతో వక్తలు తెలుగు భాష మాధుర్యాన్ని ఆహుతులకు పరిచయం చేశారు. మాతృభాషలోని కమ్మదనాన్ని అడుగడుగునా ఆస్వాదిస్తూ భాషాభిమానులు మురిసిపోయారు.
42 దేశాల నుంచి తెలుగుప్రజలు : తెలుగు ఖ్యాతిని చాటేలా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహా సభలు వైభవోపేతంగా సాగుతున్నాయి. సంప్రదాయ వస్త్రధారణల్లో భాషాభిమానులు సందడి చేయగా సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో చిన్నారులు ఔరా అనిపించారు. 42 దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలిరావడంతో ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. భారీగా పోటెత్తిన సందర్శకులు తెలుగు మహాసభలకు, మాతృభాషకు జై కొట్టారు. 'ఈనాడు' వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు హస్తకళల ప్రదర్శనల ప్రాంగణంలోని కళారూపాలు కళాకారుల సృజనకు అద్దంపట్టాయి.
ఎటు చూసినా తెలుగుదనం : సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఎటు చూసినా తెలుగుదనం సంతరించుకుంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు కర్రసాము లాంటి పురాతన క్రీడలతో తెలుగోడి సత్తా చాటారు.
కవి సమ్మేళనాలు, పద్య సదస్సులు తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపించాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక చత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు తెలుగు పాటలతో శ్రోతలను అలరించారు. మాతృభాష ఉన్నతికి ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహించాలని ఆకాంక్షించారు.
''అమ్మా అని ఎంత ఇష్టంగా పలుకుతామే మన తెలుగు భాష కూడా అంతే. మన తెలుగు తర్వాత సంస్కృతి, సాంప్రదాయం, మన కట్టుబొట్టు, మన పిల్లలకు ఏం నేర్పించాలి అనేవి మన భాష నుంచే తెలియజేసేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేశారు. భరతనాట్యానికి సంబంధించి ప్రతీదీ చేస్తాం. నాటకాలు, పెద్ద పెద్ద కథలు, 10 నిమిషాలు పాటలు సైతం చేస్తాం. మేం సుమారుగా 30, 40 ప్రదర్శనలు ఇచ్చాం. తెలుగు మహాసభల్లో భరతనాట్యం చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. తెలుగుభాష అమృతం లాంటిది.'' - భాషాభిమానులు
ప్రభుత్వాలు కృషి చేయాలి : భాషతోనే సంస్కృతి, జాతి మనుగడ సాధ్యమని అని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లిపిలేని భాషలను సైతం గౌరవించాలన్నారు. తెలుగు పరిరక్షణకు ప్రజలతోపాటు ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
'‘కనీసం మన పిల్లలకి వారంలో ఒక్కరోజునై సరే తెలుగు మాట్లాడే వంటి క్లాసులు లేదా తెలుగులో కథలను వినిపించడానికి గానీ తెలుగులో పద్యాలు చదివించే కార్యక్రమం గానీ ప్రైమరీ స్కూల్ నుంచే అలవాటు చేయాలి.'' - ఇంద్రసేనారెడ్డి, త్రిపుర గవర్నర్
ముఖ్య అతిథిగా సీఎం : గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు నేడు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. తెలుగు వేడుకల్లో చివరి రోజైన ఇవాళ వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు మహా సభలకు హాజరుకానున్నారు.
వైభవంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు - ప్రత్యేక ఆకర్షణగా రామోజీరావు కళాప్రాంగణం
కనుల పండువగా రెండో రోజు తెలుగు మహాసభలు - ముఖ్యఅతిథిగా హాజరైన మారిషస్ అధ్యక్షుడు

