ETV Bharat / state

నేటి నుంచి విజయవాడ బుక్​ ఫెస్టివల్ - పుస్తక మహోత్సవానికి వేదిక సిద్ధం!

ఇందిరాగాంధీ స్టేడియంలో 36వ ప్రదర్శన - 309 స్టాళ్లు జనవరి 12 వరకు నిర్వహణ - ఈ నెల 12 వరకు కొనసాగనున్న ప్రదర్శన

36th Book Festival at Vijayawada From Today
36th Book Festival at Vijayawada From Today (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 2, 2026 at 11:47 AM IST

3 Min Read
Choose ETV Bharat

36th Book Festival at Vijayawada: విజయవాడ పుస్తక మహోత్సవానికి వేదిక సిద్ధమైంది. నేటి నుంచి 36వ పుస్తక పండగ విజయవాడలో సందడి చేయనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జనవరి 02 నుంచి 12 వరకు ఈ వేడుక జరగబోతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి స్టాళ్ల సంఖ్య బాగా పెరిగింది. దేశంలో ప్రముఖ ప్రచురణ సంస్థలు అన్నీ తరలి వచ్చాయి. ఈసారి తెలుగుతో పాటు ఆంగ్ల పుస్తకాల ప్రచురణ సంస్థలు భారీగా వచ్చాయని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ (VBFS) అధ్యక్షుడు టి.మనోహర్‌నాయుడు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 వరకు కూడా ప్రదర్శన కొనసాగుతుంది.

భారీ స్థాయిలో ఏర్పాట్లు: హైదరాబాద్‌లో పుస్తక మహోత్సవానికి ఈసారి విపరీత రద్దీ నెలకొంది. కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి. అందుకే విజయవాడ పుస్తక మహోత్సవానికి సైతం స్పందన భారీగా ఉండబోతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పిల్లలు, యువత ఎక్కువగా రానున్నారు. పాఠశాలల్లో పుస్తక పఠనం పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలే దీనికి కారణమనే చెప్పవచ్చు.

ఈసారి స్టాళ్లు సైతం పెరిగాయ్​: దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలవి 262 స్టాళ్లు కాగా, 47 స్టాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలవి. గత ఏడాది 240 స్టాళ్లే ఏర్పాటు అయ్యాయి. గతసారి పుస్తక మైదానానికి వేదిక వెతుకులాటతోనే ఆఖరు నిమిషం వరకూ ఉత్కంఠ నెలకొంది. చివరిలో ఇందిరాగాంధీ మైదానం కుదిరింది. ఈసారి ముందే వేదికపై స్పష్టత వచ్చింది. దీంతో స్టాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

36th Book Festival at Vijayawada
స్టాల్స్‌లో పుస్తకాలు సర్దుకుంటూ (Eenadu)

పుస్తక మహోత్సవం విశేషాలు: కృష్ణా, గుంటూరుల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తరలి వచ్చేలా సహకరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను వీబీఎఫ్‌ఎస్‌ తరఫున విజ్ఞప్తి చేశారు. దీంతో ఈసారి విద్యార్థుల రద్దీ విపరీతంగా ఉండనుంది.

పాదయాత్రకు రానున్న సీఎం చంద్రబాబు: కోల్‌కతా పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఏటా ‘పుస్తక ప్రియుల పాదయాత్ర’ బెజవాడలోను కూడా నిర్వహిస్తున్నారు. జనవరి 6న సాయంత్రం 4 గంటలకు మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల నుంచి పుస్తక మహోత్సవ ప్రాంగణం వరకు కూడా ఈ పాదయాత్రను నిర్వహించనున్నారు. ఈసారి సీఎం చంద్రబాబు రానున్నారు.

మొదటి పుస్తక మహోత్సవం: 1989 అక్టోబరులో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మొట్టమొదటి పుస్తక మహోత్సవం విజయవాడలో నిర్వహించారు. తర్వాత ప్రతి సంవత్సరం పుస్తక మహోత్సవం నిర్వహించాలని ప్రచురణకర్తలు నిర్ణయించారు. విజయవాడలో ప్రచురణకర్తలు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు అంతా కలిసి విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (VBFS)గా ఏర్పడ్డారు. తొలి ఏడాది 1989లో 84 స్టాళ్లతో నిర్వహించారు. 1991లో ఈ సంఖ్యం 90కు పెరిగింది. 2015లో అత్యధికంగా 389 స్టాళ్లు ఏర్పాటుతో రికార్డు సృష్టించారు. క్రమంగా స్టాళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈసారి స్టాళ్లు 309కి పెరిగాయి.

విజయవాడలో నిన్న (గురువారం) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీబీఎఫ్‌ఎస్‌ సమన్వయకర్త ఎమెస్కో విజయకుమార్, అధ్యక్షుడు టి.మనోహర్‌నాయుడు మాట్లాడుతూ పుస్తక మహోత్సవాన్ని నేడు సాయంత్రం 5.30 గంటలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు హాజరవుతారని వెల్లడించారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రచురణ సంస్థలు తరలి వస్తున్నాయన్నారు. మొత్తం 309 స్టాళ్లు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో వీబీఎఫ్‌ఎస్‌ కార్యదర్శి కె.లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు జె.ప్రసాద్, సంయుక్త కార్యదర్శి సాయిరామ్, కోశాధికారి కె.రవి పాల్గొన్నారు.

36th Book Festival at Vijayawada
పుస్తక ప్రదర్శన బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న కె.లక్ష్మయ్య, ఎమెస్కో విజయకుమార్, కె.మనోహర్‌నాయుడు, కె.రవి (Eenadu)
  • ప్రముఖుల రాక: ఈనెల 3వ తేదీన ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, 4న మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రానున్నారు. మహోత్సవంలో భాగంగా ఏటా నిర్వహించే పుస్తక ప్రియుల పాదయాత్రకు 6న సీఎం చంద్రబాబు హాజరవుతారు. 9వ తేదీన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారు.
  • సబ్సిడీ: ప్రతి స్టాల్‌లోనూ ఏ పుస్తకం కొనుగోలు చేసినా దానిపై 10 శాతం రాయితీ ఇస్తారు.
  • ప్రముఖుల పేర్లు: పుస్తక మహోత్సవ ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన సాహిత్య వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్, ప్రతిభా వేదికకు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్‌ నార్లీకర్‌ పేర్లను ఈ సంవత్సరం పెట్టారు.

విశాఖలో పుస్తకాల కేజీ సేల్‌ - ఎంఆర్‌పీతో సంబంధం లేకుండా విక్రయం

పుస్తక జాతరకు అంతా సిద్ధం - దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థల స్టాళ్లు ఏర్పాటు