కొత్తగేట్ల అమరికతో తుంగభద్ర జలాశయానికి సరికొత్త రూపు
33 కొత్తగేట్లను నేడు ప్రారంభించనున్న చంద్రబాబు, రేవంత్, డీకే - రూ.51 కోట్లతో మొత్తం 33 కొత్త గేట్లు ఏర్పాటు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 25, 2026 at 9:46 AM IST
33 New Gates Opened At Tungabhadra Dam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు వర ప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్తగేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. రూ. 51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లును ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కలిసి సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు.
73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహర్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో 7లక్షల 20వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
పాత గేట్లను తొలగింపు: తెలంగాణలో 87 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్‌వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్యనాయుడు నేతృత్వం వహించి స్టాప్‌లాక్ గేటు అమర్చారు. స్పిల్ వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్తగేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ-కర్నాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి.
మునిరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ: తుంగభద్ర జలాశయం 33 స్పిల్‌వే గేట్లను ఇవాళ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌తో కలిసి కొత్త గేట్లను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం జొన్నగిరి నుంచి బయలుదేరి కర్ణాటక మునిరాబాద్‌లోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన హోస్‌పేటలోని తుంగభద్ర జలాశయం వద్దకు వెళ్తారు. గేట్ల ప్రారంభోత్సవం తర్వాత మునిరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు.
కర్ణాటక వేదికగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశం జరిగే అవకాశం ఉంది. నదీ జలాలకు సంబంధించిన పలు అంశాలు అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది.
తుంగభద్ర డ్యాంకు 7 దశాబ్దాలకుపైగా చరిత్ర - త్వరలోనే అందుబాటులోకి కొత్త గేట్లు
తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త గేట్లు - నెల రోజుల్లో పనులు పూర్తి: మంత్రి పయ్యావుల

