ETV Bharat / state

'వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం' - 23కు చేరిన మృతుల సంఖ్య

వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో 23కు చేరిన మృతులు - కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వేమగిరి లోవరాజు మృతి - పేలుడు ఘటనలో అక్కడికక్కడే 20 మంది సజీవ దహనం

23 People Killed in Vetlapalem Explosion Incident
23 People Killed in Vetlapalem Explosion Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 10:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

23 People Killed in Vetlapalem Explosion Incident: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడలోని జీజీహెచ్​ (GGH) లో చికిత్స పొందుతూ వేమగిరి లోవరాజు అనే వ్యక్తి మృతి చెందారు. గత నెల 28న వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం సంభవించింది. పేలుడు ఘటనలో అక్కడికక్కడే 20 మంది సజీవ దహనం అయ్యారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మరొకరు మృతి: మంటల్లో కాలిపోయి తీవ్రంగా గాయపడ్డ బాధితులను అతి కష్టం మీద స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నిన్న దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు ఇద్దరు చనిపోగా మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నారు. 90శాతం పైగా గాయాలైన లోవరాజు (38) ఈరోజు ఆస్పత్రిలో మృతి చెందారు. మరి కొందరికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

ఇంకా చికిత్స పొందుతున్న బాధితులు: కాకినాడ జీజీహెచ్​లో తీవ్రంగా కాలిన గాయాలతో మరో ఆరుగురు క్షతగాత్రులు మోర్త శ్రీను, సప్ప సత్యవేణి, కాతేటి శ్రీను, చిటికెల లక్ష్మి, వేమగిరి దావీదు పల్లాపాటి శ్రీను చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో పచ్చిగళ్ల నూకరత్నానికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. 25 శాతం కాలిన గాయాలతో సామర్లకోట సీహెచ్​సీలో చికిత్స పొందిన పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన చప్పల శామ్యూల్​ కాస్త కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు సంబంధిత అధికారులు వివరించారు.

బాధ్యలపై సస్పెన్షన్​ వేటు: ఇదిలా ఉండగా మరోవైపు బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టి పెద్దాపురం ఆర్డీఓ కె. శ్రీ రమణి, రాజమహేంద్రవరం అసిస్టెంట్ కార్మిక కమిషనర్, కాకినాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్​గా వ్యవహరిస్తున్న బీఎస్. ఎం. వల్లి పై సస్పెన్షన్ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న నివేదికల మేరకు తక్షణం వారిని ఉద్యోగం నుంచి తొలగించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భద్రతా చర్యలను పాటించడంలో పెద్దాపురం ఆర్డీవో కె. శ్రీరమణి విఫలమైనట్లు గుర్తించి సస్పెన్షన్ వేటు వేసింది.

వ్యాపారి అత్యాశే వారి ప్రాణాలు తీసింది: బాణసంచా పోటీల్లో నెగ్గితే పేరొస్తుంది, తయారీకి ఆర్డర్లు ఎక్కువ వస్తాయి. డబ్బులు బాగా సంపాదించొచ్చనే అన్న ఆ వ్యాపారి అత్యాశే వేట్లపాలెం పేలుడు ఘటనలో 23 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. భోజనానికి వెళ్లిన వారు త్వరగా రావాలని, లేదంటే పని ఉండదని నిర్వాహకుడు కూలీలను బెదిరించడంతో నాలుగు మెతుకులు తిని ఆగమేఘాలపై మళ్లీ పని మొదలుపెట్టిన కొద్దిసేపటికే భారీ పేలుడు జరిగింది. మందు గుండు కూర్పులో తేడా రావడం ఘటనా స్థలిలో ముడి సరుకు ఎక్కువగా నిల్వ చేయడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలింది.

ఈ రోజు మంచిదే పనికి రా అని తీసుకెళ్లారు - ఫోన్​లో మాట్లాడుతుండగానే పేలుడు

బాణసంచా పేలుడు ఘటన - బాధ్యులైన ఇద్దరు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు