ETV Bharat / state

17 ఏళ్ల కుర్రాడు - సైబర్ నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆవిష్కరణలు

పోలీసుల దర్యాప్తును సులభతరం చేసే సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన - నేత్ర పేరుతో సరికొత్త ఆవిష్కరణ - 7వ తరగతిలోనే సైబర్‌ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్న నీరజ్‌

Neeraj Ram Developed Innovative Cyber Security Software Netra
నేత్ర పేరుతో సరికొత్త ఆవిష్కరణ చేసిన 17ఏళ్ల కుర్రాడు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 3, 2026 at 1:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

Neeraj Ram Developed Innovative Cyber Security Software 'Netra': నేటి యువత స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ, సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తుంటే 17 ఏళ్ల ఆ కుర్రాడు మాత్రం సైబర్ నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆవిష్కరణలు చేస్తున్నాడు. ప్రతిభకు వయసుతో పనిలేదని, సరైన మార్గనిర్దేశం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, పోలీసుల కేసు దర్యాప్తునకు చేయూత ఇచ్చేలా 'నేత్ర' అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ చేశాడు. నేరగాళ్లను పసిగట్టేందుకు అవసరమయ్యే పలు టూల్స్‌ని అభివృద్ధి చేశాడు. విజయవాడకు చెందిన నీరజ్ రామ్​.

నీరజ్ రామ్​ స్వస్థలం విజయవాడ. పోలీసు శాఖలో పనిచేసిన తాత రామస్వామి స్ఫూర్తితో వారికి తనవంతు సహాయం చేయాలని చిన్ననాడే నిర్ణయించుకున్నాడు. తండ్రి మురళీకృష్ణ ప్రోత్సాహంతో ఏడో తరగతిలోనే సైబర్‌ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు. హ్యాకింగ్‌ కాకుండా ఒక సిస్టమ్‌ ఎలా పని చేస్తుంది.? డిజిటల్‌ ఆధారాలను ఎలా ట్రేస్‌ చేయాలనే లాజిక్‌పై దృష్టి పెట్టాడు. అలా తొమ్మిదో తరగతిలో అతడు రూపొందించిన టెస్లా కాయిల్‌ అనే ప్రాజెక్టు గురించి స్థానిక పత్రికల్లో ప్రచురితమైంది.

17ఏళ్ల కుర్రాడు - సైబర్ నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆవిష్కరణలు (ETV Bharat)

ఇంటర్నెట్​ అవసరం లేకుండానే: క్యాంపస్‌లో నేర్చుకున్న విద్యను ప్రాక్టికల్‌గా అమలు చేసేందుకు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమీషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్స్‌ విభాగాన్ని సంప్రదించాడు నీరజ్ రామ్​. అక్కడ కేసుల దర్యాప్తులో అధికారులు ఎదుర్కొంటున్న గ్రౌండ్‌ రియాలిటీని గమనించాడు. స్ప్రెడ్‌షీట్లు, వాట్సప్‌ చాట్‌లలో సమాచారం చెల్లాచెదురుగా ఉండటం వల్ల సమయం వృథా అవుతోందని గుర్తించాడు. ఈ సమస్యలకు పరిష్కారంగా నేత్ర పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ రూపొందించాడు. దీనిద్వారా కాల్ రికార్డుల విశ్లేషణ, సాక్ష్యాల భద్రత అన్నీ ఒకే వేదికపైకి వస్తాయి. ఇంటర్నెట్‌తో పని లేకుండా సిస్టమ్‌లోనే పని చేయడం దీని ప్రత్యేకత.

నీరజ్ రామ్​ తయారు చేసిన నేత్ర సాఫ్ట్‌వేర్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లున్నాయి. సోషల్ మీడియా ఖాతాల విశ్లేషణకు ఇది మెషిన్ లెర్నింగ్ వాడుతుంది. క్రిప్టో వాలెట్ అడ్రస్‌లను క్షణాల్లో ట్రాక్ చేస్తుంది. టెలికాం కంపెనీల ఫైల్స్‌ను చదివి, అనుమానితుల కదలికలను మ్యాప్‌లో చూపుతుందని చెబుతున్నాడీ కుర్రాడు. ముఖ్యంగా భారతీయ సాక్ష్య అధినియం-2023 (BNS 2023) ప్రకారం ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు కావాల్సిన సర్టిఫికెట్లను ఇది ఆటోమేటిక్‌గా రూపొందిస్తుంది. కోర్టుల్లో నిస్సందేహంగా ఆధారంగా చూపడానికి ఈ సాఫ్ట్‌వేర్ ఎంతగానో ఉపయోగపడుతోంది.

సాఫ్ట్‌వేర్ రూపకల్పనే కాకుండా నేరగాళ్ల వ్యూహాలను పసిగట్టడంలోనూ అనేక టూల్స్ అభివృద్ధి చేశాను. ఆర్థిక మోసాలు జరిగిన వెంటనే ఉండే గోల్డెన్ అవర్‌ను ఉపయోగించుకుంటే 70-80% దర్యాప్తులను కేవలం 2-3 గంటల్లో పూర్తి చేయొచ్చు​. SMS ద్వారా వచ్చే ఫేక్ లింక్స్‌ మోసాలపై ట్రాక్ చేయడంపై NFSU జర్నల్‌లో రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశా. ఒక పూర్తి స్కామ్‌ను కేవలం 15 నిమిషాల్లో ఎలా ట్రేస్ చేయవచ్చో ఇందులో చూపించాను.' -నీరజ్‌ రామ్​, విద్యార్థి

ఐఐటీ-హైదరాబాద్‌లో నోకియా ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్‌లో ఏపీకే సెంటినెల్ అనే టూల్‌ను డెవలప్ చేశాడు నీరజ్ రామ్​. మొబైల్‌లోకి వచ్చే ఆండ్రాయిడ్ యాప్స్‌లో హానికరమైన కోడ్ ఉందో లేదో ఇట్టే పసిగట్టేలా దీన్ని డిజైన్‌ చేశాడు. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వారు నిర్వహించిన హ్యాకథాన్స్‌లోనూ సత్తా చాటాడు. అత్యంత సున్నితమైన డేటాను కాపాడేందుకు 12 అంచెల భద్రతతో కూడిన ఎన్‌క్రిప్షన్ టూల్‌ను అభివృద్ధి చేసి ప్రతిభ చాటుకున్నాడు.

యువతకు ప్రేరణ: సాంకేతికతను మంచిగా ఉపయోగిస్తే అద్భుతాలు చేయవచ్చని నిరూపించాడు నీరజ్ రామ్​. కుమారుడిలోని ప్రతిభను చిన్ననాడే గుర్తించి ప్రోత్సహించడంతోనే ఈ విజయం సాధించగలిగాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు నీరజ్ తండ్రి మురళీకృష్ణ. ప్రస్తుతం నీరజ్ ట్రిపుల్ ఐటీ కొట్టాయంతో కలిసి అప్లైడ్ క్రిప్టోగ్రఫీపై పరిశోధనలు చేస్తున్నాడు. భవిష్యత్తులో వచ్చే క్వాంటం కంప్యూటర్లు కూడా బ్రేక్ చేయలేని 'పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ' సెక్యూరిటీ సిస్టమ్స్‌పై దృష్టి సారించాడు. తరగతి గదికే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే సాంకేతికతను సృష్టిస్తున్న ఈ సైబర్ కుర్రాడి ప్రయాణం నేటి యువతకు ప్రేరణగా నిలుస్తోంది.

ఐటీఐ రైతు సృష్టించిన హైడ్రోలిఫ్ట్‌కు రాష్ట్రపతి ప్రశంసలు - బెస్ట్ గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్ అవార్డు

చికెన్​ లోడెడ్‌ ఫ్రెంచ్‌ ఫ్రైౖస్‌ - జీవితాన్నే మార్చేసిన 'రెసిపీ'