దక్షిణం వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన నిషా - ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు
పిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నిషా - ఏడు ఖండాలకు సంబంధించిన శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యం - 'సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్‌ను పూర్తి చేసే దిశగా బాలిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 4, 2026 at 2:07 PM IST
16 Years old Girl Climbed Everest : ఈ రోజుల్లో అమ్మాయిలు దేనిలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. 16 ఏళ్ల నిషా శశికమార్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి సరికొత్త రికార్డు సృష్టించారు. ఎన్నో ప్రమాదాలు ఉండే దక్షిణ మార్గం ద్వారా ఎవరెస్ట్ ఎక్కిన అతి చిన్న వయసు అమ్మాయిగా నిషా నిలిచారు. కొండంత ఆత్మవిశ్వాసంతో సాధించిన ఈ విజయం ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది.
భయాన్నే థ్రిల్‌గా మార్చుకున్న నిషా : నిషా కుటుంబం చిత్తూరు జిల్లాకు చెందినది. అయితే వాళ్ల పూర్వీకులు చెన్నైలో స్థిరపడ్డారు. తన తండ్రి శశికమార్ గంధం 'ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ELCINA)'కు అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఆయనే నిషాకు మొట్టమొదటి మార్గదర్శకుడు. రెండు సంవత్సరాల క్రితం వాళ్ల నాన్నతో కలిసి నేపాల్ ఉత్తరాఖండ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఆ అనుభవమే తనలో పర్వత శిఖరాలను అధిరోహించే ధైర్యాన్ని నింపింది. మొదట్లో తను చాలా భయపడిందట. అయితే ఆ భయమే థ్రిల్‌గా మారిందని నిషా వివరించారు. 'సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్‌ను' ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. తన ఆశయాన్ని వాళ్ల నాన్నతో పంచుకున్నప్పుడు తన చిన్న వయస్సు కారణంగా చూపి ఆయన నిషాను వారించడానికి ప్రయత్నించారు. కానీ తను పట్టు వదల్లేదు.
ఫలితంగా 2024లో శిఖరాన్ని అధిరోహించాలనే ఉద్దేశ్యంతో వాళ్లు ఆఫ్రికాకు ప్రయాణించారు. అయితే మంచు తుఫాను కారణంగా వెనక్కి తిరిగి రావలసి వచ్చింది. గత ఏప్రిల్‌లో రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్‌ను విజయవంతంగా అధిరోహించారు. ఆ తర్వాత జూన్‌లో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఈ విజయాలు తన సామర్థ్యాలపై నిషా నాన్న నమ్మకాన్ని మరింత పెంచాయి. అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు. ఆస్ట్రేలియాలోని కోసియస్కో పర్వతాన్ని, ఇండోనేషియాలోని కార్స్టెన్స్ పిరమిడ్‌ను, అర్జెంటీనాలోని అకోన్‌కాగ్వా పర్వతాన్ని అధిరోహించారు. ఇప్పుడు ఆసియాలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు.
ఆయన్ని చూడగానే కన్నీటితో కుప్పకూలిపోయాను : ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు నిషా నాన్న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి, 7,000 మీటర్ల ఎత్తులో ఉన్న క్యాంప్-3 వద్ద ఆగారు. దాంతో తన అవకాశం చేజారిపోయింది. కానీ "నువ్వు విజయం సాధించగలవు. నువ్వు ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తులలో ఒకరిగా ఎదగడం నేను చూడాలనుకుంటున్నాను" అని ఆయన నిషాను ప్రోత్సహించారు. ఆ మాటలు విన్న నిషా తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు. రెండు సంవత్సరాల క్రితమే నిషా తాతగారు కన్నుమూశారు. ఆయన కూడా తనకు మార్గదర్శిగా ఉండేవారట. ఇప్పటివరకు తను ఐదు ఖండాలను పూర్తి చేశారు. ఈ సంవత్సరం నవంబర్ నాటికి ఏడు ఖండాలలోని శిఖరాలను పూర్తి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. తను దీనిని సాధిస్తే, "సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్"ను పూర్తి చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలుస్తారు. ప్రస్తుతం ఉత్తర అమెరికాలోని మౌంట్ దెనాలి పర్వతానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే 18 ఏళ్ల లోపు వారు ఎవరు ఈ పర్వతాన్ని అధిరోహించలేదు. అందుకోసమే నిషా ఆ రికార్డును కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. 15 ఏళ్ల వయసులో తాను ఇండోనేషియాలోని కార్స్టెన్స్ పిరమిడ్‌ను అధిరోహించి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో' స్థానం సంపాదించారు.
క్రీడలు - పుస్తకాలు : సాహసోపేతమైన కార్యాలు చేపట్టడానికి మానసిక బలం మాత్రమే కాకుండా సరైన ప్రణాళిక కూడా అవసరం. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండగల సామర్థ్యం, సరైన శిక్షణ చాలా అవసరం. ఈ లక్షణాలతో పాటు అచంచలమైన సంకల్పం ఉంటే ఎవరైనా పర్వతాలను అధిరోహించగలరు. అయితే ఆ సమయంలో తరచుగా మానసిక క్షోభకు లోనవడం శారీరక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించేటప్పుడు క్యాంప్ 3 -4 దశలు, ఆ తర్వాత శిఖరాన్ని చేరుకునే చివరి ప్రయత్నం - అత్యంత కఠినంగా అనిపించాయని నిషా తెలిపారు. తీవ్రమైన చలి భయంకరమైన గాలులు, తగ్గిపోతున్న ఆక్సిజన్ స్థాయిల వల్ల సరిగ్గా శ్వాస తీసుకోవడం కష్టమైంది. క్యాంప్ 4ను నిజంగా "మృత్యు ప్రాంతం"గా వర్ణించవచ్చని నిషా తెెలిపారు. ఒక షెర్పా సహాయంతో తాను ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి ముందుకు సాగారని చెప్పారు. తనకు బాస్కెట్‌బాల్ కరాటేలో కూడా ప్రావీణ్యం ఉంది. నిషా "పాలసీ రిఫార్మ్స్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్" అనే పుస్తకాన్ని రచించారు. తాను స్పోర్ట్స్ సైకాలజీతో పాటు బిజినెస్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు.
ఫిర్యాదుదారుల కోసం ఏఐతో సులభమైన పద్దతి - 'ఏఐ ప్రజావాణి'తో సమస్యలకి చెక్
సమాజానికి సేవ చేయాలన్న తపన - తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి

