వెలిగొండ ప్రాజెక్టు సాకారమయ్యే శుభవేళ - నిర్వాసితుల్లో పునరావాస వెలితి!
వెలిగొండ పునరావాసాల్లో కనిపించని ఆనందం - పుట్టిన ఊరు వదిలి వెళ్లిపోతున్నామని గ్రామస్థుల ఆవేదన - ఇంకా కొంతమందికి పరిహారం రావాలని చెబుతున్న గ్రామస్థులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 23, 2026 at 1:00 PM IST
11 Villages Facing Problems Due to Veligonda Project : దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతూ వెలిగొండ ప్రాజెక్టు సాకారానికి చివరి అంకం చేరుకుంది. శ్రీశైలం వరద జలాలను ఈ నెలాఖరులో నల్లమలసాగర్‌లోకి మళ్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా, ప్రాజెక్టు కోసం తమ ఇళ్లు, ఊళ్లు, జీవనాధారాలను త్యాగం చేసిన ఏడు వేలకుపైగా నిర్వాసిత కుటుంబాలు కొత్త జీవితానికి సిద్ధమవుతున్నాయి. దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగు నీరు, 15 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు ఇచ్చేందుకు సర్వస్వం త్యాగం చేసిన ఈ నిర్వాసితుల సంగతిని గత ప్రభుత్వాలు సరిగా పట్టించుకోలేదు. పునరావాస ప్యాకేజీ పంపిణీ వేగం పెరిగినా, ఇంటి పట్టాలు, కాలనీల మౌలిక వసతులు, అద్దె ఇళ్ల సమస్య, పశువుల సంరక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
రూ.768 కోట్ల ప్యాకేజీ పంపిణీ: వెలిగొండ ప్రాజెక్టు ముంపు పరిధిలో మొత్తం 7,321 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రూ.250 కోట్ల ప్యాకేజీతో కలిపి 6,206 కుటుంబాలకు (84.77 శాతం) మొత్తం రూ.768 కోట్ల పునరావాస ప్యాకేజీ అందింది. మిగిలిన 1,115 కుటుంబాలకు రూ.150 కోట్లు ఈ నెలాఖరులోపు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పునరావాసంలో కీలకమైనవి ఇవే:
- మొత్తం నిర్వాసిత కుటుంబాల్లో స్థలం తామే కొనుక్కుని ఇల్లు కట్టుకుంటామంటూ (వన్‌టైమ్ సెటిల్‌మెంట్)కు 3,359 కుటుంబాలు అంగీకరించాయి. వీరికి ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చులు, ఏడాదిపాటు కుటుంబ అవసరాల కోసం జీవనాధార భృతి కలిపి రూ.12.91 లక్షల ప్యాకేజీ అందిస్తున్నారు. జూన్ 29న కొంతమందికి, ఆగస్టు 19న కొందరికి ఈ ప్యాకేజీ ఇచ్చారు. ఈ మధ్యే ప్యాకేజీ ఇచ్చినందున ఇంకా ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు. అప్పటివరకు అద్దె ఇళ్లలో ఉండేందుకు కొంత గడువు ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు.
- ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకునే 3,962 కుటుంబాల కోసం 7 పునరావాస కాలనీలు అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, పశువైద్యశాలలు, ఆలయాలు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. గోగులదిన్నె, తోకపల్లి, ఇందుట్ల, ఇడుపూరు-2 పునరావాస కాలనీల్లో పనులు పూర్తయ్యాయి. మరో 3 కాలనీల్లో ఇటీవలే పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఈ వసతులు అన్నీ సిద్ధం చేసేందుకు మరో 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఈ పనులన్నీ వేగవంతం చేయాలి.
- నిర్వాసితుల్లో 3,962 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పట్టాలివ్వాలి. పునరావాస కాలనీల్లో ఆ స్ధలం ఎక్కడ ఉందో చూపిస్తే ప్యాకేజీ అందుకున్నవారు ఇళ్లు కట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ప్యాకేజీతో పాటు పట్టాలిచ్చి, స్థలాలు, చూపిస్తే తాము ఊళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసిత కుటుంబాలు చెబుతున్నాయి. ఇల్లు పూర్తయ్యేవరకు ఆ స్థలాల్లో టెంట్ వేసుకుని అయినా జీవనం గడుపుతామంటున్నాయి.
- నిర్వాసిత కుటుంబాల్లో అత్యధిక మందికి పాడి పశువులు ఉన్నాయి. అద్దె ఇళ్లకు వాటిని తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం పశుసంవర్ధక శాఖను రంగంలోకి దించి, నిర్వాసితులకు అండగా నిలిచేలా చూడాలి.
- వెలిగొండ నిర్వాసితుల్లో కొందరికి ఇళ్లు అద్దెకివ్వడానికి యజమానులు ముందుకు రావడం లేదు. సామాజికంగా ఇంకా మార్పు రాకపోవడం ఇందుకు కారణం. ఒకేసారి 7,000 కుటుంబాలు చుట్టుపక్కల అద్దె ఇళ్ల కోసం వెతుకుతుండటంతో అద్దెలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఇళ్లు ఇవ్వడానికి యజమానులు ముందుకు రావడం లేదని నిర్వాసితులు చెబుతున్నారు. అత్యవసరంగా తాత్కాలిక వసతి కేంద్రాల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
- కొత్త కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి మరో 6 నెలలు పట్టే అవకాశం ఉంది. ఈలోగా వేలాది మంది విద్యార్థులు పాఠశాలలకు దూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. పూర్తిస్థాయి పునరావాసం జరిగే వరకు స్కూళ్లకు సమీపంలోనే వసతి గృహాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
- 2008 గెజిట్ నోటిఫై చేసిన తర్వాత పునరావాస జాబితాలో పేర్లు నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హుల ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. ప్రత్యేక బృందాలు గ్రామాల్లో సర్వే నిర్వహించి ఆధారాలను పరిశీలిస్తున్నాయి.
ప్రత్యేక బృందాల పరిశీలన: ప్రస్తుతం పునరావాస గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిర్వాసితుల ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ఆ బృందాలు వాటిని నమోదు చేసి, బాధితులు ఇచ్చే ఆధారాలు పరిశీలిస్తున్నారు. ఈ సర్వేలో వచ్చే ఫిర్యాదులూ పరిష్కరిస్తే నిర్వాసిత గ్రామాలు తరలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.
"ఊళ్లో ఎప్పటి నుంచో అందరం కలిసే ఉన్నాం. కలిసే వెళ్తాం. ప్యాకేజీ సొమ్ములు అందరికీ ఇవ్వాలి. మా పేరున ఇంటి స్థలం ఇచ్చి, అది ఎక్కడుందో చూపిస్తే టెంట్లు వేసుకునైనా అక్కడ ఉంటాం." - గ్రామస్థులు
నిర్వాసితులందరికీ త్వరలో పట్టాలు: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ, పునరావాస కాలనీల్లో త్వరలోనే ఇంటి పట్టాలు పంపిణీ చేసి, స్థలాలను చూపిస్తామని తెలిపారు. పునరావాస ప్యాకేజీ నిధులు దాదాపు నిర్వాసిత కుటుంబాలకు అందడంతో వారంతా సంతోషంగా ఉన్నారన్నారు. నిర్వాసిత కుటుంబాలు అద్దెకు ఎక్కడికి వెళుతున్నాయో సమాచారం తీసుకుంటున్నామన్నారు.
అద్దె ఇళ్లు, రేషన్, పెన్షన్, విద్యార్థుల ప్రవేశాలు, పశుసంపదకు సంబంధించిన సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కరిస్తుందని చెప్పారు. తమకు 18 ఏళ్లు నిండినా, సర్వే సమయంలో ఊళ్లలో లేకపోవడంతో తమ పేర్లు పునరావాస జాబితాలో చేర్చలేదని కొన్ని ఫిర్యాదులు, విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. అలాంటివారు ఎంతమంది ఉన్నారో సమీక్షించామని చెప్పారు. ఆ పేర్లతో పెద్ద హోర్డింగ్ తయారు చేసి ప్రదర్శిస్తామన్నారు. అందులో పేరున్నవారి వద్ద రేషన్ కార్డు, ఇతర ఆధారాలు లేకపోయినా ఇబ్బంది లేకుండా ఎలా ప్యాకేజీ అందించాలో ఆలోచిస్తున్నామని జిల్లా కలెక్టర్ సునీత వివరించారు.
కరవు సీమకు "వెలుగు కొండ" - నెరవేరుతున్న దశాబ్దాల కల
ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తాం: మంత్రి నిమ్మల

