పది విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక - ఉత్తమ ఫలితాలు వస్తాయంటున్న ఉపాధ్యాయులు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులు - 100 రోజుల యాక్షన్ ప్లాన్ సత్ఫలితాలను ఇస్తోందని చెబుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు - ఆహారనియమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 6:16 PM IST
|Updated : February 26, 2026 at 7:58 PM IST
10th Class Students Exams Preparation Tips : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండటంతో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు కృషి చేస్తున్నారు. ప్రణాళికాబద్దంగా చదువుతున్నారు. పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
గతంలోకంటే పదిలో ఉత్తమ ఫలితాలు రాబట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తోందని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఎంతో దోహదం చేస్తుందంటున్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదవడంతో పాటు ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.
వంద రోజులు ప్రణాళిక : కూటమి ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న వంద రోజులు ప్రణాళిక మెరుగైన ఫలితాలు సాధనకు ప్రయోజనకరంగా మారుతుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడతున్నారు. డిసెంబర్ 6 నుంచి నూరు శాతం పది ఫలితాల కోసం 100 రోజుల ప్రణాళిక పేరిట విద్యార్థులకు ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు.
- పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సంపూర్ణంగా సిద్ధమవ్వడానికి, పబ్లిక్ పరీక్షల కంటే 100 రోజుల ముందు (సాధారణంగా డిసెంబర్ నుంచి) ప్రభుత్వం అమలు చేసే ప్రత్యేక ప్రణాళికే ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్. దీని ముఖ్య ఉద్దేశం సిలబస్ పూర్తి చేయడం, రివిజన్, బలహీన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తీర్ణత శాతం పెంచడం.
పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి రోజు ఒక సబ్జెక్టులో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా శిక్షణ ఇస్తే మెరుగైన ఫలితాలు సాధ్యపడతాయని ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ప్రతి రోజూ పరీక్షలు నిర్వహిస్తూ : వంద రోజుల పాఠ్య ప్రణాళికలో భాగంగా రోజుకు ఒక సబ్జెక్టులో షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతిలోని పాఠ్యాంశాలను రివిజన్ చేసి, అదే సబ్జెక్టుకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో వారి ప్రగతిని గుర్తించి షైనింగ్ స్టార్లు, రైజింగ్ స్టార్లుగా విభజిస్తున్నారు. ఏ, బీ గ్రేడు సాధించిన వారిని షైనింగ్ స్టార్లుగా గుర్తిస్తున్నారు. సీ, డీ గ్రేడ్లు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి సంవత్సరాంతం పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.
"ప్రభుత్వం తీసుకువచ్చిన వంద రోజుల యాక్షన్ ప్లాన్ మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతి సబ్జెక్టులో 7 డైలీ స్లిప్ టెస్టులు అయ్యాయి. యాక్షన్ ప్లాన్ వల్ల చదివిందే చదువుతూ, రివిజన్ చేయటం వల్ల అది మన మైండ్లో గుర్తుండిపోతుంది. దీనివల్ల ప్రీ ఫైనల్లో కూడా మంచి మార్కులు వచ్చాయి. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతిలోని పాఠ్యాంశాలను రివిజన్ చేసి, అదే సబ్జెక్టుకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనివల్ల మేం చేస్తున్న తప్పులను తెలుసుకుని తరువాత పరీక్షలో ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతున్నాం." - విద్యార్థులు
ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక అమలులోకి తేవడం పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా మారుతోందని, నూరు శాతం ఫలితాలు సాధిస్తే వచ్చే ఏడాది ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు నమోదు పెరిగే అవకాశముంటుందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఉచితంగా అందించే స్ఫూర్తి స్టడీ మెటీరియల్, ఉపాధ్యాయ సంఘాలు అందించే మెటీరియల్‌ను విద్యార్థులు అభ్యసిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
"వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా విద్యార్థుల ప్రగతి బట్టి షైనింగ్ స్టార్లు, రైజింగ్ స్టార్లుగా విభజిస్తున్నాం. ఏ, బీ గ్రేడు సాధించిన వారిని 100 శాతం మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతున్నాం. అలాగే సీ, డీ గ్రేడ్లు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. విద్యార్థులు ఈ సమయంలో రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. అలాగే బయటి జంక్ ఫుడ్లను తినరాదు. పదునుగా ఉన్న వస్తువులను వాడరాదు. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఎటువంటి పనులు అప్పగించరాదు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి." - ఉపాధ్యాయులు
10వ తరగతి పరీక్షలలో విప్లవాత్మక మార్పు - విధుల్లో ప్రైవేట్ టీచర్లు
నిద్ర, ఆహారంపై విద్యార్థులు అశ్రద్ధ - అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్న వైద్యులు

