ETV Bharat / state

పాఠం వింటూ కుప్పకూలిన విద్యార్థిని - గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి

తరగతి గదిలో పాఠం వింటూ అకస్మాత్తుగా బెంచీపై నుంచి పడిపోయిన విద్యార్థిని - ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడి

10th Class Girl Dies of Heart Attack in Konaseema District
10th Class Girl Dies of Heart Attack in Konaseema District (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 14, 2025 at 3:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

10th Class Girl Dies of Heart Attack in Konaseema District: చదువుల తల్లి, అమ్మానాన్నల గారాల పట్టీ, నిత్యం ఆనందోత్సాహాలతో మెలిగే కుటుంబం, ఒక్కగానొక్క కుమార్తె ఆమెకు తోడుగా ఓ తమ్ముడు, తండ్రి వ్యాపారి, తల్లి గృహిణి పచ్చని ఆ సంసారాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్టు అయిందేమో చురుకుదనాల సిరిని వారి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. చదువులో చక్కగా రాణిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఆ బాలికను గుండెనొప్పి రూపంలో మృత్యువు కబళించింది. రోజూలానే పాఠశాలకు వెళ్లిన కన్నకూతురు పాఠం వింటూ ప్రాణాలు కోల్పోయిందనే సమాచారంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు.

తరగతి గదిలో పాఠం వింటున్న ఓ విద్యార్థిని స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషాద సంఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో చోటు చేసుకుంది.

10th Class Girl Dies of Heart Attack in Konaseema District
తరగతి గదిలోని సీసీ కెమెరాలో రికార్డయిన విద్యార్థిని పడిపోయిన చిత్రం (Eenadu)

పోలీసుల కథనం ప్రకారం: రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి (15) రామచంద్రపురం పట్టణం రత్నంపేటలోని వివేకానంద ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం తరగతి గదిలో పాఠం వింటున్న ఆమె అకస్మాత్తుగా స్పృహ తప్పి బెంచీపై నుంచి పడిపోయింది. పాఠశాల యాజమాన్య ప్రతినిధులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తీవ్రమైన గుండెపోటుతో ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో విద్యాశాఖ అధికారులు సైతం విచారంలో మునిగారు. బాలిక తల్లిదండ్రులు వెంకటరెడ్డి, సుజాతలను ఏరియా ఆస్పత్రిలో ఓదార్చారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉన్నారు. రామచంద్రపురం డీవైఈవో పి.రామలక్ష్మణమూర్తి, ఎంఈవో తాడి వీరరాఘవరెడ్డి, ఏపీఎంవో పి.రాంబాబుతో పాటు పలువురు విద్యాధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

బాలిక ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీయగా నెల రోజుల కిత్రం ఇలాగే కళ్లు తిరిగి పడిపోయిందని పాఠశాల నుంచి సమాచారం రావడంతో వైద్యులకు చూపించామన్నారు. మళ్లీ స్కూల్ నుంచి ఫోన్‌ రావడంతో నీరసంతో కళ్లు తిరిగి పడిపోయిందని భావించామన్నారు. ఇలా శాశ్వతంగా మాకు దూరమైపోతుందని అనుకోలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

నెల క్రితం ఇదే పరిస్థితి: బాలిక నెల క్రితం ఇలాగే తరగతి గదిలోనే స్పృహ కోల్పోయి పడిపోయింది. స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారొచ్చి బాలికను ఆసుపత్రికి తరలించారు. అప్పట్లో ప్రథమ చికిత్స అనంతరం కోలుకుందని, అప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉందని తండ్రి వెంకటరెడ్డి చెప్పారు. ఆమె స్పృహ కోల్పోయినట్లు పాఠశాల నుంచి ఫోన్‌ రావడం ఇది రెండోసారని అన్నారు. ఇలా అవుతుందని ఊహించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. వెంకటరెడ్డి, సుజాత దంపతులకు కుమార్తె సిరితో పాటు కొడుకు శ్రీనివాస్‌ ఉన్నారు. వీరిద్దరూ అదే పాఠశాలలో పది, ఎనిమిది చదువుతున్నారు.

గ్రామంలో విషాదఛాయలు: బాలిక స్వగ్రామం పసలపూడి బండిరేవుగట్టు కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం ఉదయం యథావిధిగా పాఠశాలకు వెళ్లిన సిరి తరగతి గదిలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందడంతో గ్రామస్థులు దుఃఖ సముద్రంలో మునిగారు.

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా? - వీటి జోలికి పోవద్దట!

బస్సు నడుపుతుండగా గుండెపోటు - చనిపోతూ 50 మంది విద్యార్థులను కాపాడిన డ్రైవర్!