ETV Bharat / sports

ముంబయిపై గెలిచినా కోపం ఎందుకు? హెల్మెట్ విసిరేసిన విరాట్- బీసీసీఐ యాక్షన్ తీసుకుంటుందా?

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోపంతో ఊగిపోయిన విరాట్- ఔటైన​ తర్వాత మైదానంలోనే హెల్మెట్, గ్లోవ్స్ విసిరేసిన వీడియోలు వైరల్- ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ క్రమశిక్షణా చర్యల ముప్పు

RCB Vs MI Virat Helmet Throw Video
Virat Kohli (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2026 at 3:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

RCB Vs MI Virat Helmet Throw Video : ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఘనవిజయం సాధించింది. అయితే ఈ గెలుపు కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌లో 50 పరుగులతో మెప్పించిన కోహ్లీ, ఔటైన తర్వాత తన కోపాన్ని ఆపుకోలేకపోయారు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో అతను చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇది కేవలం కోపమేనా లేక ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘనా అనే చర్చ మొదలైంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అసలు విరాట్ ఏం చేశారు? నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

మైదానంలో కోహ్లీ ఆగ్రహం- వీడియోలు వైరల్
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అయితే తన ఆట తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న కోహ్లీ, బౌండరీ లైన్ దాటిన తర్వాత తన గ్లోవ్స్ హెల్మెట్‌ను కోపంతో నేలకేసి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణంగా అగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ, ఇలా క్రీడా సామగ్రిని విసిరేయడం ఐపీఎల్ నిబంధనల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది.

బీసీసీఐ యాక్షన్ తీసుకుంటుందా?
కోహ్లీ ప్రవర్తన ఇప్పుడు క్రమశిక్షణా చర్యలకు దారితీసేలా కనిపిస్తోంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆటగాళ్లు మైదానంలో సంయమనం పాటించాలి. కోహ్లీ గ్లోవ్స్ హెల్మెట్ విసిరేయడం ఆర్టికల్ 2.2 నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఒకవేళ మ్యాచ్ రిఫరీ దీనిని తీవ్రంగా పరిగణిస్తే విరాట్‌పై జరిమానా విధించే అవకాశం ఉంది. గతంలో కూడా పలువురు ఆటగాళ్లు ఇలాంటి పనులు చేసి జరిమానాలు ఎదుర్కొన్నారు. స్టార్ ప్లేయర్ అయినంత మాత్రాన నిబంధనల నుంచి మినహాయింపు ఉండదు కాబట్టి బీసీసీఐ దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది.

ఆర్టికల్ 2.2 ఏం చెబుతోంది?
ఐపీఎల్ నిబంధనావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం క్రికెట్ పరికరాలను, దుస్తులను లేదా మైదానంలోని వస్తువులను దుర్వినియోగం చేయడం నేరం. వికెట్లను తన్నడం, అడ్వర్టైజింగ్ బోర్డులను కొట్టడం, డ్రెస్సింగ్ రూమ్ తలుపులను బాదడం వంటి చర్యలు ఇందులోకే వస్తాయి. కోహ్లీ హెల్మెట్ విసిరేయడం కూడా 'అబ్యూస్ ఆఫ్ క్రికెట్ ఎక్విప్‌మెంట్' కిందికే వస్తుంది. ఇది లెవల్ 1 నేరంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పనులు చేసినందుకు ఆటగాళ్లకు హెచ్చరికలతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

జరిమానా ఎంత ఉండవచ్చు?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం లెవల్ 1 నేరం రుజువైతే సదరు ఆటగాడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం నుంచి 25 శాతం వరకు జరిమానా పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక డెమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయిస్తారు. కోహ్లీ వీడియో ఆధారంగా రిఫరీ చర్యలు తీసుకుంటే మ్యాచ్ ఫీజులో కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో మ్యాచ్ రిఫరీదే అంతిమ నిర్ణయం. కోహ్లీ ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ఆవేశంలో జరిగిందా అనే కోణంలో విచారణ జరగనుంది.

ముంబయిపై కోహ్లీ అరుదైన రికార్డ్
వివాదాల సంగతి పక్కన పెడితే, ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును చేరుకున్నారు. ముంబయి ఇండియన్స్‌పై ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌కు ముందు అతనికి 20 పరుగులు అవసరం కాగా, కేవలం 11 బంతుల్లోనే ఆ మార్కును చేరుకున్నారు. ప్రస్తుతం ముంబయిపై కోహ్లీ ఖాతాలో 1030 పరుగులు ఉన్నాయి. కేఎల్ రాహుల్ (977), శిఖర్ ధావన్ (901) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తన ఫేవరెట్ టీమ్‌పై కోహ్లీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అర్ధశతకాలతో రాణించడంతో ఆర్సీబీ 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబయి ఆటగాళ్లు పోరాడినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. ఆర్సీబీకి ఇది మూడవ విజయం కావడం విశేషం.

హై స్కోరింగ్ మ్యాచ్​లో ఆర్సీబీ విజయం- పోరాడి ఓడిన ముంబయి

గ్రౌండ్ సిబ్బందికి రూ.25 లక్షల నగదు బహుమతి- ఎందుకంటే?