IPLలో నయా స్టార్- ముకుల్ చౌదరి లైఫ్‌ను టర్న్ చేసింది ఆ టోర్నీనే!
హాట్‌టాపిక్‌గా ముకుల్ చౌదరి పేరు- వేలంలో ఎంతకు కొన్నారు?- ఎవరెవరు పోటీ పడ్డారు?- ఈ 21ఏళ్ల కుర్రాడి ఆసక్తికర జర్నీ ఇదే!

Published : April 10, 2026 at 10:39 AM IST
Mukul Choudhary IPL 2026 : క్రికెట్ ప్రపంచానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో యువ సంచలనాన్ని పరిచయం చేసింది. ఈడెన్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌తో లఖ్‌నవూకు విజయం కట్టబెట్టిన ముకుల్ చౌదరి ఇప్పుడు ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఇంటర్నెట్లో అతడి పేరే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో అసలు ఈ ముకుల్ ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు? అనే వివరాల కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అయితే అతడి గురించి అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని మీ కోసం!
రాజస్థాన్ కుర్రోడు!
21ఏళ్ల ముకుల్ స్వస్థలం రాజస్థాన్‌లోని ఝుంఝును. అతడి తండ్రి దలిప్ కుమార్ చౌదరి క్రికెట్‌కు పెద్ద ఫ్యాన్. అందుకే తనకు పెళ్లి కాకముందే తన కుమారుడు పెద్ద క్రికెటర్ అవ్వాలని దలిప్ కలలు కన్నారట! ఇక ముకుల్ జన్మించిన తర్వాత తనను క్రికెట్ వైపు ప్రోత్సహించారు. తమ ప్రాంతంలో సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా ముకుల్ క్రికెట్ కొనసాగించడంపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో ముకుల్ కుటుంబం ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంది. అతడి తండ్రి దలిప్ తొలుత టీచర్‌గా ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లో ఉంటూ, కొడుకును సికర్‌లోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించారు.
రెండేళ్లలో మారిన కెరీర్!
ముకుల్ ఫస్ట్ క్లాస్ కెరీర్ 2023లో రాజస్థాన్ స్టేట్ క్రికెట్‌తో మొదలైంది. 2023 రంజీలో రాజస్థాన్ తరఫున అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో రెండు పరుగులే చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో రెండు టీ20ల్లో ఆడితే అందులోనూ పెద్దగా రాణించలేదు. దీంతో దాదాపు రెండేళ్లపాటు జట్టుకు దూరమయ్యాడు. ఇక 2025లో స్టేట్ లెవెల్ అండర్- 23 ట్రోఫీలో అవకాశం అందుకున్నాడు. ఈ టోర్నీలో రెండు సెంచరీలు సహా ఏకంగా 617 పరుగులు చేయడంతో, సయ్యద్ ముస్తాక్ అలీలో రాజస్థాన్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక్కడే అతడి లైఫ్ మంచి టర్న్ తీసుకుంది. స్టేట్ లెవెల్లో ఆడిన జోరును కొనసాగిస్తూ ముకుల్ సయ్యద్ ముస్తాక్ అలీలోనూ అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన అతడు 199 స్ట్రైక్ రేట్‌తో 173 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు.
🎶 Jeetne aaye the, jeetke jaa rahe hai 🎶 pic.twitter.com/YNIaqONvxr
— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2026
మినీ వేలంలో పోటీ
2025 మినీ వేలంలో ముకుల్ తన పేరును నమోదు చేసుకున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ వేలంలో అతడు రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. అప్పుడే డొమెస్టిక్‌లో రాణించడంతో ఫ్రాంచైజీలు అతడిపై కన్నేశాయి. ఈ వేలంలో అతడి కోసం ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. కానీ, చివరికి ముకుల్‌ను రూ.2.60 కోట్లకు లఖ్ననవూ సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అంటే తన బేస్ ప్రైజ్ కంటే దాదాపు తొమ్మిది రేట్లు ఎక్కువే దక్కించుకున్నాడు. అలా ఐపీఎల్ జర్నీ షురూ అయ్యింది.
వికెట్ కీపర్ కాదు!
అయితే ముకుల్ ప్రస్తుతం వికెట్ కీపర్ బ్యాటర్. కానీ తన కెరీర్‌ను మాత్రం ఆల్‌రౌండర్‌గా మొదలు పెట్టాడు. అకడమీలో చేరినప్పుడు అకడు బ్యాటర్ కమ్ మీడియం పేస్ బౌలర్. అలా ఆల్‌రౌండర్‌గానే కెరీర్లో రాణించాలని అనుకున్నాడు. అయితే ఓ మ్యాచ్ సమయంలో జట్టులో వికెట్ కీపర్ కావాల్సి వచ్చింది. దీంతో అప్పుడు ముకుల్ కీపింగ్ చేశాడు. ఈ రోల్ కోసం మాజీ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీని ఆదర్శంగా తీసుకున్న అకడు కీపర్‌గానే కెరీర్ కొనసాగించాడు.
We keep this love in a photograph 🥹❤️💙 pic.twitter.com/618x9XQBnI
— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2026
మూడో మ్యాచ్‌లోనే!
ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచే ముకుల్ తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముకుల్ బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 11 బంతుల్లో 14 పరుగులే చేశాడు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఛేజింగ్‌లో 5 బంతులు ఆడి 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో అతడికి తన టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసుకునే అవకాశం వచ్చింది.
16ఓవర్లకు లఖ్‌నవూ స్కోర్ 128-7. అప్పడికి ముకుల్ ఆరు బంతులు ఆడి చేసింది 2 పరుగులే. మరోవైపు బౌలర్ ఆవేశ్ ఖాన్ ఉన్నాడు. దీంతో కేకేఆర్ విజయం దాదాపు ఖరారైనట్లే అని అంతా భావించారు. కానీ ఆతర్వాతే ముకుల్ చెలరేగిపోయాడు. వైభవ్ వేసిన 17వ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదాడు. ఆ తర్వాత కార్తిక్ ఓవర్లో రెండు సిక్స్‌లు, గ్రీన్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాది లఖ్‌నవూ విజయంపై ఆశలు పెంచాడు.
What was that? 🤯
— Star Sports (@StarSportsIndia) April 9, 2026
Mukul Choudhary brings the heat at Eden Gardens to seal it for #LSG 🔥#LucknowSuperGiants #KolkataKnightRiders #TATAIPL #MukulChoudhary pic.twitter.com/aBnTyoARLq
చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి ఆవేశ్ సింగిల్ తీశాడు. రెండో, ఐదో బంతులను సిక్స్‌లుగా మలిచిన ముకుల్ స్కోర్లు సమం చేశాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక ఆఖరి బంతికి లెగ్ బై సింగిల్ తీసి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు.

