2027 ప్రపంచకప్ టికెట్ల కోసం కోటిన్నర మంది అప్లై- వచ్చే ఏడాది మ్యాచ్‌లకు ఇప్పటి నుంచే దరఖాస్తులు!
ICC గణాంకాల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 1,50,83,752 టికెట్ దరఖాస్తులు అందాయి. 142 దేశాలకు చెందిన అభిమానులు 44,23,417 బ్యాలెట్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపింది.

Published : October 13, 2026 at 4:56 PM IST
ICC World Cup 2027 Tickets : వచ్చే ఏడాది జరిగే ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టికెట్ల కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది. 2027లో జరిగే మ్యాచ్ టికెట్ల కోసం ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు. 12 రోజుల క్రితం టికెట్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది క్రికెట్ ప్యాన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ICC గణాంకాల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 1,50,83,752 టికెట్ దరఖాస్తులు అందాయి. 142 దేశాలకు చెందిన అభిమానులు 44,23,417 బ్యాలెట్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపింది. బ్యాలెట్ ప్రారంభమైనప్పటి నుంచి డిమాండ్ వేగంగా పెరిగిందని మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తెలిపింది. గత వారం 10 లక్షలుగా ఉన్న దరఖాస్తుల సంఖ్య రెండు వారాలు కూడా కాకముందే కోటిన్నరపైగా పెరిగిందని వెల్లడించింది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరగడానికి సరిగ్గా ఏడాది ముందు అంటే 2026 నవంబర్ 21న రాత్రి 23:59 గంటల (CAT) వరకు టికెట్ బ్యాలెట్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది.
"టికెట్ల కోసం ఉన్న ఈ భారీ డిమాండ్ క్రికెట్ ప్రపంచ కప్ స్థాయిని, ఆకర్షణను, అలాగే ఆతిథ్య ప్రాంతంగా దక్షిణాఫ్రికాకు ఉన్న ప్రత్యేకతను తెలియజేస్తోంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ICC, దాని భాగస్వాములు చేపట్టిన ప్రచార కార్యక్రమాల వల్ల కలిగిన ఉత్సాహానికి ఇది నిదర్శనం. టోర్నమెంట్‌కు ఇంకా ఏడాది సమయం ఉండగా ICC అనేక రకాల ప్రచార కార్యక్రమాలు, వివిధ వేదికల ద్వారా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇవి ICC క్రికెట్ ప్రపంచ కప్ 2027 పట్ల అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి." అని ICC చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజోగ్ గుప్తా పేర్కొన్నారు.
బ్యాలెట్ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది?
- టికెట్ బ్యాలెట్‌లో ఉచితంగా పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఒక వ్యక్తి ఒక మ్యాచ్‌కు ఒకసారి మాత్రమే బ్యాలెట్ దరఖాస్తును సమర్పించవచ్చు. అయితే, టోర్నమెంట్‌లో జరిగే వేర్వేరు మ్యాచ్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
- బ్యాలెట్ 'మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత' పద్ధతిలో ఉండదు. బ్యాలెట్ విండో సమయంలో ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన టికెట్ వచ్చే అవకాశాలు ఏమీ పెరగవు.
- ఒక మ్యాచ్ టికెట్ల కోసం కేటాయించిన సంఖ్య కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే, కంప్యూటరైజ్డ్ రాండమ్ (యాదృచ్ఛిక) బ్యాలెట్ పద్ధతి ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు.
- ఇందులో ఎంపికైన దరఖాస్తుదారులను, టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియను ఎలా ప్రారంభించాలనే సమాచారంతో ఇమెయిల్ ద్వారా సంప్రదిస్తారు.
- బ్యాలెట్‌లో మీకు టికెట్ లభించినా లేదా లభించకపోయినా, ఆ ఫలితాల వివరాలను మీరు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఈమెయిల్ వివరాలు తెలియజేస్తారు.
కొత్త ఫార్మాట్ ప్రపంచకప్‌నకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం
2027 అక్టోబరు 7న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అక్టోబరు 24 వరకు రౌండ్ రాబిన్ పద్ధతిలో మొత్తం 30 గ్రూప్ స్టేజీ మ్యాచులు జరగనున్నాయి. అనంతరం అక్టోబరు 25 నుంచి నవంబరు 14 వరకు వరకు సూపర్-7 మ్యాచులు జరుగుతాయి. ఈ దశలో మొత్తం 21 మ్యాచులు ఉంటాయి. నవంబరు 17న సెమీఫైనల్-1, 18న సెమీఫైనల్-2, 21న జొహన్నెస్‌బర్గ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కొత్త ఫార్మాట్‌తో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇది చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక భారీ ఎడిషన్‌గా నిలవనుంది.
'క్రికెటర్ ఆఫ్ ది సెప్టెంబర్ మంత్'గా శుభ్‌మన్, షఫాలీ- రికార్డు స్థాయిలో గిల్!
ఉప్పల్ మ్యాచ్‌కు భారీ బందోబస్తు - 408 కెమెరాలు, 8 షీ టీమ్స్‌తో నిఘా

