ETV Bharat / sports

అసలే ఓటమి బాధ - ఇంతలో బస్సులో మంటలు - గుజరాత్ టీమ్​కు వరుస షాక్​లు!

షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు - కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న ప్లేయర్లు మరో బస్సులో తాము బస చేసిన హోటల్‌కు

Gujarat Titans
Gujarat Titans (AP)
author img

By ETV Bharat Sports Team

Published : June 1, 2026 at 8:09 AM IST

3 Min Read
Choose ETV Bharat

Fire In Gujarat Titans Bus : గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే ఆటగాళ్లు అలర్ట్ అయ్యారు. బస్సు దిగిన తర్వాత మంటలు చెలరేగాయి. బస్సులోని ఎయిర్ కండిషనర్ (AC) వైరింగ్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, జట్టు సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారని సమాచారం. ప్రమాదం తర్వాత కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న ప్లేయర్లు మరో బస్సులో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు.

టైటిల్‌ను చేజార్చుకున్న నిరాశలో ఉండగా
అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పటికే టైటిల్‌ను చేజార్చుకున్న నిరాశలో ఉన్న గుజరాత్​ టైటాన్స్​​ జట్టుకి బస్సు ప్రమాద ఘటన రూపంలో మరో దెబ్బ పడింది. ఫైనల్‌ మ్యాచ్​కు ముందు గుజరాత్ టైటాన్స్ టీమ్​ కఠినమైన ప్రయాణ షెడ్యూల్‌ను ఎదుర్కొంది. మే 29న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్ కోసం జట్టు మే 27న ధర్మశాల నుంచి ముల్లాన్‌పూర్‌కు చేరుకుంది. అయితే, ముల్లాన్‌పూర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న కారణంగా, మే 30న అహ్మదాబాద్‌కు వెళ్లాల్సిన వారి ప్రయాణం విపరీతంగా ఆలస్యమైంది. దీంతో జట్టు శనివారం సాయంత్రానికి తమ సొంత మైదానానికి చేరుకుంది. ఈ ప్రయాణాలు ఫైనల్‌ మ్యాచ్​లో జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపాయా అనే ప్రశ్నలు తలెత్తాయి.

అలసట వల్లే గుజరాత్ ఓడిపోయిందా?
ఫైనల్ మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస మ్యాచ్‌లు, ప్రయాణాల వల్ల అలసిపోవడం వల్లే ఓడిపోయిందా అనే ప్రశ్నకు గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి స్పందించారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, " మేము ఎక్కువ మ్యాచ్‌లు ఆడామని, అలసిపోయామని చెప్పి ఆర్సీబీ విజయాన్ని తక్కువ చేయాలనుకోవట్లేదు. మా జట్టు ఇలాంటి సాకులు చెప్పదు. ఈ పిచ్‌పై 155 పరుగుల స్కోరు చాలా తక్కువ అనేది నిజం, అయినప్పటికీ మా బౌలర్లు చివరి వరకు పోరాడారు. మేము ఎక్కడ తప్పు చేశామో సమీక్షించుకుంటాం, కానీ ప్రత్యర్థి జట్టు మా కంటే మెరుగ్గా ఆడిందనే విషయాన్ని ఒప్పుకోవాలి " అని విక్రమ్ సోలంకి పేర్కొన్నారు.

5 వికెట్ల తేడాతో ఓడిపోయిన గుజరాత్​
ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత రసిఖ్‌ సలామ్‌ దార్‌ (3/27), భువనేశ్వర్‌ (2/29), హేజిల్‌వుడ్‌ (2/37) బుల్లెట్లలాంటి బంతులు వేయడంతో గుజరాత్‌ 20 ఓవర్లలో 155/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్‌ సుందర్‌ (37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్‌) 50 పరుగులు చేయగలిగాడు. అనంతరం కింగ్‌ కోహ్లీ (42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్‌) టీమ్​ను ముందుండి నడిపించడంతో చిన్న లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఐపీఎల్ 2026: క్వాలిఫైయర్ 1కు వర్షం ముప్పు ఉందా? ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేదెవరు?

'హార్దిక్​ లేకుండానే గుజరాత్​ స్ట్రాంగ్​గా ఉంది'- పాండ్యపై ఆసీస్​ మాజీ ప్లేయర్​ కీలక వ్యాఖ్యలు