"టీ-20 వరల్డ్ కప్" జట్టులో తెలుగమ్మాయి - అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన యువతేజం!
వచ్చే నెలలో టోర్నీ - శ్రీచరణి ఎంపికపై హర్షాతిరేకాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2026 at 4:19 PM IST
Crickenter Sri Charani : యువ క్రికెటర్ శ్రీచరణి టీ-20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైంది. ఈ ఏడాది జూన్ 12 నుంచి ఇంగ్లండ్‌లో మహిళల టీ-20 ప్రపంచకప్ జరగనుంది. కడప జిల్లా వీఎన్‌పల్లె మండలం ఎర్రమల్లపల్లె గ్రామానికి చెందిన శ్రీచరణి గతేడాది ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో భారత మహిళా జట్టు తరఫున అన్ని మ్యాచ్‌ల్లో ప్రతిభ కనబరచింది. కీలక సమయాల్లో ప్రత్యర్థుల వికెట్లు కూల్చడంతో పాటు పరుగులివ్వకుండా కట్టడి చేసి కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్‌కు జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడంపై జిల్లా క్రికెట్ అసోసియేషన్‌తో పాటు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
T20 వరల్డ్‌కప్‌నకు భారత్ జట్టు ప్రకటన- టీమ్‌లోకి 31ఏళ్ల సీనియర్ బ్యాటర్!
భారత జట్టులో స్థానం దక్కించుకోవడం చాలా మంది కలగా భావిస్తుంటారు. అలాంటిది ఏకంగా ప్రపంచకప్ బరిలో దిగే అవకాశం వస్తే ఎలా ఉంటుందో కదూ! అందులోనూ అరంగేట్రం చేసిన కొన్ని నెలలకే ఈ అవకాశాన్ని దక్కించుకుంది తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఈ స్పిన్నర్ భారత మహిళా జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.
కడపకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి మొదట బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖో క్రీడాకారిణి. క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ కాస్తా ఆమెను ఇటు వైపు ఆకర్షించింది. ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ ఆరంభించిన శ్రీచరణి అందులో సఫలం కాకపోవడంతో స్పిన్నర్‌గా తనను తాను తీర్చిదిద్దుకుంది.
దేశవాళీ పోటీల్లో బంతిని గిరగిరా తిప్పుతూ స్థిరంగా రాణించింది. ఈ నేపథ్యంలో గతేడాది మహిళా ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ శ్రీచరణికి రూ.55 లక్షలు పెట్టి దక్కించుకుంది. ఈ ఏడాది మార్చిలో సీనియర్ మహిళల టోర్నీలో భారత్-బి జట్టు తరఫున ఆడినప్పటికీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం త్వరగా దక్కడం తన ప్రతిభకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావడం, ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తుండడంతో భారత్ సీనియర్ జట్టు నుంచి ఆహ్వానం అందుకుని శ్రీలంకపై అరంగేట్రం చేసింది.
అనుకోకుండా వచ్చి
ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదని సీనియర్లు చెప్తుంటారు. ఎంతో మంది సీనియర్లు, కొత్త ప్లేయర్లు రేసులో ఉండడంతో కొత్తగా వచ్చిన శ్రీచరణికి అవకాశం దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. సెలక్టర్లు అనుభవం కన్నా నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతో కల నెరవేరింది. తొలిసారిగా ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీలంక పిచ్‌లపై పట్టు సాధించింది. అత్యధిక వికెట్లు పడగొట్టకున్నా సెలెక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ కీలకంగా మారింది. వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఆ జట్టు బ్యాటర్లను కట్టడి చేయడంలో శ్రీచరణి కీలక పాత్ర పోషించింది.
వైవిధ్యంతోనే
బ్యాటర్ల కదలికలను పసిగట్టడం, ప్రతి బంతినీ వైవిధ్యంగా విసరడం శ్రీచరణి ప్రత్యేకత. వ్యూహాత్మకంగా బంతి వేగాన్ని తగ్గించడంతో పాటు ఒక బంతిని స్పిన్ చేసి మరొక బంతిని నేరుగా వేయడం ద్వారా ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేది. ఇప్పటిదాకా 17 వన్డేల్లో 22 వికెట్లు పడగొట్టిన శ్రీచరణి ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో దీప్తిశర్మ తర్వాత రెండో స్థానం దక్కించుకుంది. వరల్డ్ కప్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన చరణి ఇదే జోరు కొనసాగిస్తే భారత్‌కు మరిన్ని విజయాలు అందించడం ఖాయం అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బౌలింగ్ సెన్సేషన్ శ్రీచరణి - ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు - ఈ తెలుగమ్మాయి విశేషాలివే
మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం - చెక్ అందజేసిన మంత్రి లోకేశ్

