టీమ్ఇండియా చెత్త రికార్డుల పరంపర- అయ్యర్ కెప్టెన్సీలో ఫ్లాప్ షో
ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన ఓటమితో టీమ్ఇండియా చెత్త రికార్డులు- వరుసగా ఐదు టీ20 మ్యాచ్‌ల్లో గెలుపు రుచి చూడని జట్టు- తొలిసారి వంద పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన భారత్

Published : July 8, 2026 at 10:25 AM IST
India Worst Records : ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయిన టీమ్ఇండియా ఆటతీరు అందరినీ షాక్‌కు గురిచేసింది. కేవలం 76 పరుగులకే ఆలౌటయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమ్ఇండియా ఏ దశలోనూ కనీస పోరాట పటిమ కనబర్చలేకపోయింది. ఈ దారుణమైన ప్రదర్శన కారణంగా భారత జట్టు ఖాతాలో మునుపెన్నడూ లేని విధంగా పలు చెత్త రికార్డులు వచ్చి చేరాయి. ఆ రికార్డుల జాబితా ఏంటో ఒకసారి చూద్దాం.
రెండో అత్యల్ప స్కోరు
టీ20 క్రికెట్ చరిత్రలో టీమ్ఇండియా నమోదు చేసిన అత్యల్ప స్కోర్ల జాబితాలో ఈ మ్యాచ్ రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి క్రీజులో నిలవలేక భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో కేవలం 76 పరుగులకే జట్టు కుప్పకూలింది. 2008లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులకే ఆలౌట్ అవ్వడం భారత్‌కు అత్యంత చెత్త రికార్డుగా ఉండేది. ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై 76 పరుగులకు చాపచుట్టేయడం ద్వారా ఆ పాత రికార్డు తృటిలో తప్పిపోయినా రెండో అత్యల్ప స్కోరు నమోదు కావడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం మింగుడుపడటం లేదు.
వంద పరుగుల తేడాతో ఓటమి
టీ20 ఫార్మాట్‌లో టీమ్ఇండియా ఒక మ్యాచ్‌లో వంద పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోవడం క్రికెట్ హిస్టరీలో ఇదే మొట్టమొదటిసారి. ఏ జట్టుతో అయినా సరే నువ్వా నేనా అనే స్థాయిలో పోటీలో నిలబడే టీమ్ఇండియా ఈసారి కనీసం సగం బలాన్ని కూడా చూపించలేకపోయింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగని ఇన్నింగ్స్ కారణంగా ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చూడాల్సి వచ్చింది.
వరుసగా ఐదు మ్యాచ్‌లు
వరుస పరాజయాలు భారత జట్టును తీవ్రంగా కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా వరుసగా ఐదు మ్యాచ్‌లలో కనీసం ఒక్క గెలుపు రుచి చూడకుండా మిగిలిపోవడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. టీమ్ఇండియాకు గత 5 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్ సిరీస్‌లో 2 ఓటములు, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దు, తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించలేకపోవడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆటగాళ్లలో సమన్వయం లోపించడం, బ్యాటింగ్ అలాగే బౌలింగ్ విభాగాల్లో మూకుమ్మడిగా విఫలం కావడం వల్లే ఈ చెత్త రికార్డు నమోదైంది.
🚨 HISTORY WRITTEN AT TRENT BRIDGE. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2026
- India have now gone win-less for 5 consecutive T20is for the first time ever. 🤯 pic.twitter.com/BNgoigJV1L
పవర్‌ప్లే పీడకల
పవర్‌ప్లేలోనే టాలెంటెడ్ ప్లేయర్స్ అందరూ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే వికెట్ల పతనం మొదలైంది. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేలోపే ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే మొట్టమొదటిసారి. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. ఇంగ్లీష్ పేసర్ల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా తడబడిన బ్యాటర్లు వరుసగా అవుట్ అయ్యారు. ఆరంభంలోనే సగం వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ అక్కడే పూర్తిగా చేజారిపోయింది.
ఆ రికార్డుకు బ్రేక్ పడుతుందా?
ఇంగ్లాండ్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు ఉన్న తిరుగులేని రికార్డు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ పర్యటనకు ముందు ఇంగ్లాండ్‌తో కనీసం రెండు మ్యాచ్‌లు ఉన్న ఆరు టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడిన టీమ్ఇండియా ఏకంగా ఐదు సిరీస్‌లలో విజయం సాధించింది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. అంటే గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్ చేతిలో భారత్ టీ20 సిరీస్ కోల్పోలేదు. కానీ ప్రస్తుత సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ వరుస విజయాలతో ఆధిక్యంలోకి వెళ్లడంతో, భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదం అంచున నిలిచింది. మునుపటి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌లలో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ONE OF THE DARKEST DAYS IN INDIAN CRICKET HISTORY. ✍️
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2026
- For the first time ever remained win-less for 5 consecutive T20is.
- Lost a T20i by more than 100 runs for the first time ever.
- Got bowled out for just 76, their 2nd ever lowest total in T20is.
- Lost 5 wickets in… pic.twitter.com/87l3Zh6qqr
శ్రేయాస్ అయ్యర్ చెత్త రికార్డ్
ఈ ఘోర పరాజయాలతో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ రికార్డ్ మరింత దారుణంగా తయారైంది. కెప్టెన్‌గా గత పన్నెండు టీ20 మ్యాచ్‌లలో అయ్యర్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచాడు. ఏకంగా పది మ్యాచ్‌లలో జట్టును ఓటమి పాలు కాగా ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఈ ఇంగ్లాండ్ పర్యటనకంటే ముందు ఐర్లాండ్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఐపీఎల్ లో పంజాబ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ అక్కడ కూడా సీజన్ చివరలో వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు.

