ETV Bharat / sports

వినేశ్‌ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో​ ఊరట- హైకోర్టు తీర్పే ఫైనల్​

30, 31 తేదీల్లో నిర్వహించనున్న ఎంపిక ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేశ్‌ ఫొగాట్‌కు అనుమతి- భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) స్పెషల్‌ లీవ్‌ పిటిషన్​ను నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం

Vinesh Phogat
Vinesh Phogat (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2026 at 2:56 PM IST

4 Min Read
Choose ETV Bharat

Supreme Court Allows Vinesh Phogat : ఏషియన్‌ గేమ్స్‌ ట్రయల్స్‌లో పోటీపడే అంశంలో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల జరగనున్న ఆసియా గేమ్స్ ఎంపిక పోటీలలో (సెలక్షన్ ట్రయల్స్) పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు అనుమతి ఇచ్చింది.

ఇంతకు ముందు వినేశ్ ఫొగాట్​ ఆసియా గేమ్స్ 2026 సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తన పరిధిని మీరిందని, ఎంపిక ప్రమాణాల ప్రకారం వినేశ్‌ అనర్హురాలని పేర్కొంది. అయితే డబ్ల్యూఎఫ్ఐ పిటిషన్‌ను విచారించిన సుప్రీం దిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ స్థానంలో వేరొకరు ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ వినేశ్‌ ఈ దేశాన్ని గర్వపడేలా చేశారని వెల్లడించింది. ఇప్పటికే ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు హైకోర్టు అనుమతి ఇచ్చిందన్న అత్యున్నత న్యాయస్థానం ఈ దశలో వినేశ్‌ను వెనక్కి వెళ్లమని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి ఈ విషయంలో తాము ఏం చేయలేమని ఆమె పోటీల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐతే డబ్ల్యూఎఫ్ఐ పిటిషన్‌పై వినేశ్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

పరిష్కారం కోర్టుల్లో కాదు వ్యవస్థల్లో
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి అంశాలకు పరిష్కారం కోర్టుల్లో కాకుండా వ్యవస్థల్లోనే ఉండాలని అభిప్రాయపడింది. క్రీడాకారులు, అధికారులు, సంస్థల మధ్య సమన్వయం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. "ఇలాంటి విషయాల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో కోర్టులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమతుల్యత పాటిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జస్టిస్‌ నరసింహ మాట్లాడుతూ, "హైకోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిన తర్వాత వినేశ్‌లో ఆశలు, అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆమెను ఇంటికి వెళ్లిపోమని చెప్పడం సరైంది కాదు" అని వ్యాఖ్యానించారు. మరోవైపు డబ్ల్యూఎఫ్ఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఏషియన్‌ గేమ్స్‌ అధికారులకు మే 14 నాటికే భారత క్రీడాకారుల పేర్లు పంపాల్సి ఉందని అన్నారు. అయితే ఆ గడువు ఇప్పటికే ముగిసిపోయిందని తెలిపారు. ఇది అంతర్జాతీయ సంస్థ పరిధిలో ఉండే అంశమని, భారత కోర్టుల పరిధిలోకి రాదని వాదించారు.

2024 డిసెంబరులో విరామం
అయితే వినేశ్‌కు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు, ఆమె డోపింగ్‌ పరీక్షలకు గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 2024 డిసెంబరులో వినేశ్‌ కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించిందని ధర్మాసనం గుర్తుచేసింది. అనంతరం 2025 జూలైలో ఆమె తల్లి అయ్యారని, 2026 జనవరి 1 నుంచి తాను తిరిగి అర్హత పొందుతానని డబ్ల్యూఎఫ్ఐకి సమాచారం ఇచ్చిందని తెలిపింది. జనవరిలో నిర్వహించిన డోపింగ్‌ పరీక్షకు వినేశ్‌ హాజరు కాలేదని, తాను హరియాణా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాల్సి వచ్చిందనే ఆమె వివరణను అంతర్జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఐటీఏ) అంగీకరించలేదని ధర్మాసనం పేర్కొంది. వినేశ్‌ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించిన విషయం అంగీకరిస్తూనే, ప్రపంచ స్థాయి నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాల్సిందేనని జస్టిస్‌ నరసింహ స్పష్టం చేశారు.

డోపింగ్‌ పరీక్ష మిస్​
"డోపింగ్‌ పరీక్షను మిస్‌ కావడం చిన్న విషయం కాదు. భారత క్రీడలు అంతర్జాతీయ క్రీడా వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఏదైనా అనర్హత వస్తే అది భారత ప్రతిష్ఠపై ప్రభావం చూపుతుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. "మీరు డోపింగ్‌ పరీక్ష కోసం అవసరమైన వివరాలు ఇవ్వలేదు. తొలి పరీక్షను కూడా మిస్‌ అయ్యారు" అని కోర్టు పేర్కొంది. వినేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మాధవి దివాన్‌ వాదనలు వినిపిస్తూ, ఈ వ్యవహారం ఆమె మాతృత్వంతో ముడిపడి ఉందని, ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు.

ఇదిలా ఉండగా మే 22న దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వినేశ్‌ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది. మాతృత్వ విరామం తర్వాత తిరిగి వస్తున్న వినేశ్‌ వంటి ప్రముఖ క్రీడాకారిణిని పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు డబ్ల్యూఎఫ్ఐ ఎంపిక విధానంలో లేదని, అది వివక్షపూరితంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మహిళా క్రీడాకారిణుల మాతృత్వాన్ని వృత్తిపరమైన అడ్డంకిగా గానీ, లేదా వారికి ప్రతికూలంగా మారే పరిస్థితిగాగానీ చూడకూడదని కోర్టు నొక్కి చెప్పింది.

'ట్రయల్స్‌ను వీడియో రికార్డు చేయాలి'
అలాగే మే 30, 31 తేదీల్లో జరిగే ట్రయల్స్‌ను వీడియో రికార్డు చేయాలని డబ్ల్యూఎఫ్ఐకి ఆదేశించింది. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్), భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నుంచి స్వతంత్ర పరిశీలకులు కూడా హాజరుకావాలని హైకోర్టు పేర్కొంది. గతంలో ప్రముఖ క్రీడాకారుల ఎంపికలో కొంత వెసులుబాటు ఉండేదని, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం అందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. మే 9న డబ్ల్యూఎఫ్ఐ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులో పేర్కొన్న కారణాలు ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తున్నాయని, క్రీడా ప్రయోజనాలు, న్యాయం దృష్ట్యా వినేశ్‌కు అవకాశం ఇవ్వాల్సిందేనని హైకోర్టు పేర్కొంది.

'ఆమెకు అవకాశం ఇవ్వండి!'- వినేశ్ సస్పెన్షన్​పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వినేశ్ ఫొగాట్‌పై WFI వేటు- అప్పటి వరకు పోటీల్లో పాల్గొనడానికి నో ఛాన్స్​