ETV Bharat / sports

శశిథరూర్‌కు అండగా సోనియా గాంధీ- ఆ స్కామ్ వెనుక కాంగ్రెస్ పెద్దలు : కొచ్చి టస్కర్స్ వివాదంపై లలిత్ మోదీ

సోనియా గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ సంచలన ఆరోపణలు- కొచ్చి టస్కర్స్ కేరళ వివాదంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తనపై తీవ్ర రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చిందని వ్యాఖ్యలు

Lalith Modi On Shashi Tharoor
Lalith Modi On Shashi Tharoor (Source : ANI, IANS)
author img

By ETV Bharat Sports Team

Published : June 4, 2026 at 11:53 AM IST

4 Min Read
Choose ETV Bharat

Lalith Modi On Shashi Tharoor : కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, శశిథరూర్ సహా ఇతర సీనియర్ నేతలపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 2010లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీ వివాదంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తనపై తీవ్ర రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించారు. కొచ్చి జట్టు యాజమాన్య నిర్మాణం, సునంద పుష్కర్ పాత్రపై తాను ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఇలా జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు వెనుకనుండి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీయేనని పేర్కొన్నారు.

ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు తనను చుట్టుముట్టి టార్గెట్ చేశారని, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీల నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని స్పష్టం చేశారు. అలాగే రాజీవ్ శుక్లా కూడా తన వద్దకు వచ్చి ఇలా చేయి, అలా చేయి అంటూ ఒత్తిడి తెచ్చారని వివరించారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొచ్చి టస్కర్స్ వివాదం, తనకు వచ్చిన బెదిరింపులు సహా పలు అంశాలపై లలిత్ మోదీ వివరణ ఇచ్చారు.

ఆ విషయాన్ని ముందు ఊహించా : లలిత్ మోదీ
"2010లో ఐపీఎల్ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్‌కు సంబంధించి చెలరేగిన వివాదం సమయంలో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కోసం ఒక రాజకీయ రక్షణ కవచం ఏర్పాటైంది. కొచ్చి కన్సార్సియంలోని 75 శాతం మంది వాటాదారులు 100 శాతం ఖర్చును భరిస్తుంటే, ఎలాంటి పెట్టుబడి పెట్టని సునంద పుష్కర్‌కు 25 శాతం ఉచిత ఈక్విటీ, 15 శాతం రాబడిని ఎలా కట్టబెడతారని ప్రశ్నించాను. సునంద పుష్కర్‌ జట్టును దక్కించుకున్న రోజే ఆమెకు లభించిన 10 రూపాయల షేర్ విలువ ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. అదే సమయంలో మిగిలిన వాటాదారుల షేర్ విలువ ఒక్క పైసాకు పడిపోయింది. ఈ మోసపూరిత ఒప్పందం కారణంగా కొచ్చి టస్కర్స్‌ ఫ్రాంచైజీ రెండేళ్లలోనే కుప్పకూలుతుందని నాకు ముందే తెలుసు. చివరకు నేను ఊహించినట్లే జరిగింది" అని లలిత్ మోదీ అన్నారు.

'శశిథరూర్ ఫోన్ చేసి బెదిరించారు'

ఈ వివాదం బెంగళూరులో అర్ధరాత్రి జరిగిన సమావేశంలో తారాస్థాయికి చేరుకుంది. ఈ ఒప్పందం తెరవెనుక ఉన్న షాడో వాటాదారుల అసలు గుర్తింపును బహిర్గతం చేసే వరకు నేను అధికారిక ఫ్రాంచైజీ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాను. ఆ సమయంలోనే అసలు సునందా పుష్కర్ ఎవరో చెప్పమన్నాను. ఆమె కేవలం ఒక ఆటోమొబైల్ డీలర్ కూతురని, ఒక ప్రముఖ మార్కెటింగ్ నిపుణురాలని కన్సార్సియం సభ్యులు చెప్పిన మాటలను నేను నమ్మలేదు. ఆ తర్వాత అప్పటి విదేశాంగశాఖ సహాయ మంత్రి శశిథరూర్ నాకు ఫోన్ చేశారు. సునంద పుష్కర్ గురించి ఎక్కువగా అడగొద్దని అన్నారు. సునంద పుష్కర్ తనకు మంచి స్నేహితురాలని చెప్పారు. ఒకవేళ తన మాట వినుకుంటే రేపు ఉదయమే నాపై ఐటీ దాడులు చేయిస్తానని బెదిరించారు. నేను ఆయన బెదిరింపులకు లొంగలేదు. ధీటుగా బదులిచ్చాను. అయితే బీసీసీఐ అప్పటి అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఫోన్ చేసి కొచ్చి ఒప్పందంపై వెంటనే సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడి ఒత్తిడి మేరకే నేను బలవంతంగా సంతకం చేస్తున్నట్లు ఆ అధికారిక పత్రంపై రాసి మరీ సంతకం చేశా --లలిత్ మోదీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్

ఒక్క నేరంలో కూడా నేను దోషిగా తేలలేదు: లలిత్ మోదీ
తనపై మోపిన 'పరారీలో ఉన్న వ్యక్తి' అనే ముద్రను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా ఖండించారు. ఒక్క నేరంలో కూడా తాను దోషిగా తేలలేదని స్పష్టం చేశారు. తాను భారత అధికారుల కళ్లుగప్పి విజయవంతంగా దాక్కుంటున్నాననే వాదనను తిప్పికొట్టారు. తాను పరారీలో ఉన్నాననే వాదనలను కొట్టిపారేశారు. ప్రపంచమంతా పర్యటిస్తూ భారత్ వంటి ప్రపంచ అగ్రరాజ్యం కళ్లుగప్పి తప్పించుకోవడం అసాధ్యమని అన్నారు. భారత చట్టాల నుంచి తప్పించుకునేందుకు తాను రాజస్థాన్ మాజీ సీం వసుంధర రాజే, దివంగ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సహాయం తీసుకున్నాననే ఆరోపణలనూ ఖండించారు.

భారత్‌లో బీసీసీఐ తీసుకుంటున్న క్రమశిక్షణా చర్యలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్ర విచారణలు వంటి సంక్లిష్టమైన న్యాయ పోరాటాల గురించి లలిత్ మోదీ ప్రస్తావించారు. భారత్‌లో స్పష్టమైన చట్టపరమైన పరిష్కారం కొరవడిందని అభిప్రాయపడ్డారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ తనపై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు నిలబడలేదని వెల్లడించారు. "నేను అస్సలు పారిపోవడం లేదు. ప్రపంచమంతా తిరుగుతున్నాను. ఒకవేళ నేను పారిపోతుంటే భారత ప్రభుత్వం ఏదో ఒక చోట నన్ను పట్టుకునేది. ఒకప్పుడు నేను తిరిగి ఇండియాకు రావాలనుకున్నాను. తిరిగి వచ్చి ఏం చేయాలి? నేను ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నా" అని లలిత్ మోదీ పేర్కొన్నారు.

'ఆ బెదిరింపులతో రిటైర్ అయ్యాను'
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని క్రైమ్ సిండికేట్ నుంచి ఎదురైన ప్రాణహాని బెదిరింపులే తాను క్రికెట్ పరిపాలన నుంచి శాశ్వతంగా రిటైర్ కావడానికి గల అతిపెద్ద కారణాలలో ఒకటని లలిత్ మోదీ వెల్లడించారు. ఐపీఎల్ ప్రారంభ సంవత్సరాలలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు వ్యతిరేకంగా తాను తీసుకున్న దృఢమైన వైఖరి, డీ- కంపెనీ నియంత్రణలో ఉన్న అండర్‌గ్రౌండ్ బెట్టింగ్ సామ్రాజ్యంతో ఎలా నేరుగా ఘర్షణ పడిందో కూడా వివరించారు. దావూద్ క్రైమ్ సిండికేట్ సత్తా బజార్‌ను నడిపిందని చెప్పారు.

"దావూద్ ఇబ్రహీం ఒక పేరు మోసిన బుకీ. ఆ రోజుల్లో రహస్య బెట్టింగ్ 2 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఈ రోజు ఒక్కో ఆటకు రహస్య బెట్టింగ్ 4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది చాలా పెద్ద మొత్తం. సత్తా బజార్‌లో ప్రతి బంతికి ఒక విచిత్రమైన అవకాశం ఉంటుంది. నేను ఐపీఎల్‌ను నడిపిన మొదటి మూడేళ్లను మీరు గమనిస్తే, అక్కడ ఫిక్సింగ్ లేదు. నేను చాలా మందిని నిలదీశాను. చాలా మందిని స్టేడియం నుంచి బయటకు పంపించాను. చాలా మందిని మైదానంలోకి రాకుండా నిషేధించాను. ఇది దావూద్ మాఫియాకు నచ్చలేదు. నాకు భారీగా లంచాన్ని ఆఫర్ చేశారు. దాన్ని తిరస్కరించాను" అని లలిత్ వ్యాఖ్యానించారు.

'ప్రపంచంలోనే సూపర్​స్టార్ అవుతాడు- కానీ అలా ఉంటేనే!'- వైభవ్​​పై లలిత్ మోదీ ప్రశంసలు!

2026 IPL : ఈ సీజన్​లో వైభవ్ సూర్యవంశీ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?