ETV Bharat / sports

టెస్టుల్లో కమ్​బ్యాక్ ఇచ్చేందుకు గిల్ 'మాస్టర్ ప్లాన్' - కెప్టెన్​ డిమాండ్​కు BCCI గ్రీన్ సిగ్నల్!

ఏడాదిలో సొంతగడ్డపై రెండు వైట్‌వాష్‌లు - అప్రమత్తమైన టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ - ఇకపై ప్రతి సిరీస్‌కు ముందు అలా చేయాల్సిందేనని డిమాండ్ - గంభీర్ మద్దతు!

BCCI 15DAY CAMP PROPOSAL
Gill Demands 15day Camps (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : January 5, 2026 at 5:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

Gill Planning For Test Cricket : సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవం తర్వాత భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అప్రమత్తమయ్యాడు. టెస్టు క్రికెట్‌లో భారత జట్టు మళ్లీ విజయాల బాట పట్టి, మళ్లీ వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో రేసులోకి వచ్చేందుకు ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ఇకపై ప్రతీ టెస్టు సిరీస్‌కు ముందు కనీసం 15 రోజుల పాటు ప్రాక్టీస్ క్యాంప్​లు నిర్వహించాలని సూచించాడు. జట్టు సన్నద్ధత లోపమే ఓటములకు కారణమని గుర్తించిన గిల్, ఈ మేరకు బీసీసీఐకి సూచించాడు. గిల్ ప్రతిపాదనకు బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది. టెస్టు క్రికెట్ ప్లానింగ్‌లో కెప్టెన్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఏడాదిలో రెండు ఎదురు దెబ్బలు
ఇటీవల కాలంలో భారత జట్టు టెస్టుల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. నవంబర్ 2025లో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ చిత్తుగా ఓడింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీలు 2- 0తో క్లీన్ స్వీప్ చేశారు. అంతకుముందు 2024 చివర్లో న్యూజిలాండ్ చేతిలోనూ భారత్ 3- 0తో వైట్‌వాష్ అయ్యింది. ఇలా ఏడాది వ్యవధిలోనే సొంతగడ్డపై రెండు సార్లు వైట్‌వాష్ అవ్వడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఓటములే గిల్‌ను ఆలోచనలో పడేశాయి.

గిల్ డిమాండ్ ఏంటి?
గిల్ తన విజన్‌ను స్పష్టంగా సెలెక్టర్లకు, బోర్డుకు వివరించాడు. "టెస్టు సిరీస్ ఆడాలంటే దానికి తగ్గ ప్రాక్టీస్ చాలా అవసరం. ఐదు రోజుల పాటు సాగే టెస్టు ఫార్మాట్ కోసం ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. అందుకే రెడ్ బాల్ క్రికెట్ కోసం ప్రతీ సిరీస్‌కు ముందు 15 రోజుల క్యాంప్ కచ్చితంగా ఉండాలి. ఈ సమయంలో ఆటగాళ్లు తమ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది" అని గిల్ తన ఆలోచనను బోర్డుకు సూచించాడు.

సమయం లేకపోవడమే సమస్య
కొంతకాలంగా ఎదురవుతున్న ఓటములకు ప్రధాన కారణం సిరీస్​ల షెడ్యూలే అని గిల్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. అక్కడ వైట్ బాల్ క్రికెట్ (వన్డేలు, టి20లు) ఆడి నేరుగా భారత్ వచ్చింది. ఆసీస్ పర్యటన ముగిసిన తర్వాత, కేవలం నాలుగు రోజుల్లోనే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బరిలోకి దిగింది. ఇంత తక్కువ సమయంలో ఒక ఫార్మాట్ నుంచి మరో ఫార్మాట్‌కు మారడం ఆటగాళ్లకు కష్టంగా మారింది. అందుకే ఇకపై షెడ్యూల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని గిల్ కోరుతున్నాడు.

కెప్టెన్‌కు పగ్గాలు
సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత జట్టు పరివర్తన దశలో ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు రిటైర్ అయ్యాక గిల్ పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. అందుకే బీసీసీఐ కూడా అతనికి మద్దతుగా నిలుస్తోంది. కెప్టెన్ అడిగినట్లుగా 15 రోజుల క్యాంప్‌లు ఏర్పాటు చేయడానికి బోర్డు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. "గిల్ ఇప్పుడు చాలా పరిణతితో ఆలోచిస్తున్నాడు. తన విజన్‌ను స్పష్టంగా చెబుతున్నాడు. ఇది భారత క్రికెట్‌కు మంచిది" అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

గంభీర్ మద్దతు
గతేడాది దక్షిణాఫ్రికా సిరీస్ అనంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. సన్నద్ధత లేకపోవడమే ఓటమికి కారణమని, షెడ్యూలింగ్ కూడా ఫలితాలపై ప్రభావం చూపుతుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా గిల్​ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తాడు. దీనికి గంభీర్ మద్దతుగా ఉన్నట్లు తెలిసింది. ​

గిల్ ట్రాక్ రికార్డ్
కెప్టెన్‌గా గిల్ ప్రదర్శన ఓ మాదిరిగానే ఉంది. కెప్టెన్​గా అరంగేట్ర సిరీస్​ ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ అద్భుతంగా రాణించాడు. సిరీస్‌ను టీమ్ఇండియా 2- 2తో డ్రాగా ముగించింది. ఈ సిరీస్​లో బ్యాట్​తోనూ రాణించిన గిల్ 754 పరుగులు చేసి టాప్ స్కోరర్​గా నిలిచాడు. ఆ తర్వాత సొంతగడ్డపై అక్టోబర్​లో వెస్టిండీస్‌పై 2- 0తో ఘన విజయం సాధించాడు. కానీ సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి మాత్రం అతన్ని తీవ్రంగా కలవరపెట్టింది.

ఆరు నెలల గ్యాప్
ప్రస్తుతానికి భారత జట్టుకు టెస్టు మ్యాచ్‌లు లేవు. ఈ ఏడాది జూలై వరకు భారత్ టెస్టులు ఆడదు. జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అప్పటిలోపు లోపాలను సరిదిద్దుకుని, కొత్త విధానాలతో మళ్లీ విజయాల బాట పట్టాలని గిల్ సేన భావిస్తోంది.

'ఇవాళ ఇంట్లో కూర్చున్నానంటే అదే కారణం'- సిరీస్ ఓటమి తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ రీజన్ రివీల్

సౌతాఫ్రికాతో సిరీస్​ ఓటమి- WTC పట్టికలో పాకిస్థాన్ కంటే కిందకు పడిపోయిన టీమ్ఇండియా