ETV Bharat / sports

'మామూలోడు కాదు- ద్రవిడ్​కు చెప్పి మరీ చేశాడుగా!'- వైభవ్ గేమ్​ప్లాన్ రివీల్ చేసిన శాంసన్

మరో రెండు వారాల్లో 2026 ఐపీఎల్ ప్రారంభం- అందరి కళ్లు వైభవ్​పైనే- అతడి గురించి ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేసిన శాంసన్

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : March 16, 2026 at 12:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vaibhav Suryavanshi Game Plan : 2026 ఐపీఎల్ ప్రారంభానికి రోజులు దగ్గరపడుతున్నాయి. ఇదే నెల 28న కొత్త సీజన్ గ్రాండ్​గా షురూ కానుంది. ఈ క్రమంలో మరోసారి అందరి చూపు యువ సంచ​లనం వైభవ్ సూర్యవంశీపైనే నెలకొంది. గతేడాది ఐపీఎల్​లో అరంగేట్రం చేసి విధ్వంసం సృష్టించిన ఈ చిచ్చరపిడుగుపై ఈసారి భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైభవ్ గురించి శాంసన్ ఓ ఆసక్తికర విషయం బయట పెట్టాడు.

మార్చి 15న బీసీసీఐ దిల్లీ వేదికగా నమన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్​లో ఇటీవల వరల్డ్​కప్ సాధించిన మహిళల, పురుషుల జట్లను సన్మానించారు. వైభవ్ సూర్యవంశీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చాడు. అతడు తన సీనియర్లు హార్దిక్ పాండ్య, అభిషేక్ శర్మ, సంజు శాంసన్​తో కలిసి క్వశ్చన్ సెషన్​లో పాల్గొన్నాడు. అందులో వైభవ్​కు హోస్ట్ ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. ఐపీఎల్​లో తాను ఎదుర్కొన్న తొలి బంతి ఎక్కడికి వెళ్లింది అని అడగ్గా, 'లఖ్​నవూ సూపర్ జెయింట్స్​పై డెబ్యూ మ్యాచ్ ఆడాను. ఆ మ్యాచ్​లో నేను ఎదుర్కొన్న తొలి బంతినే కవర్స్ మీదుగా సిక్స్​ కొట్టాను' అని వైభవ్ రిప్లై ఇచ్చాడు.

'అయితే మీ కోచ్ ఇక్కడే ఉన్నాడు (రాహుల్ ద్రవిడ్​ను ఉద్దేశిస్తూ). ఆయన టెస్టుల్లో ఓపిగ్గా ఆడుతూ రెండు రోజులు కూడా బ్యాటింగ్ చేయగలడు. అలాంటిది నువ్వు తొలి బంతినే సిక్స్​ కొడతానని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి?' అని అడిగాడు. దీనికి వైభవ్ సమాధానం చెబుతుండగా, అక్కడే ఉన్న శాంసన్ మధ్యలో కల్పించుకొని వివరంగా చెప్పాడు.

"లఖ్​నవూతో మ్యాచ్​ ముందు రోజు ద్రవిడ్ సర్ నన్ను, వైభవ్​ను రూమ్​కు పిలిచాడు. 'వైభవ్ చాలా చిన్నపిల్లవాడు. ఎలా ఆడాలి? ఎలా ముందుకెళ్లాలో మనం అతడికి చెప్పాలి' అని సర్ అన్నాడు. వెంటనే 'వైభవ్ నీ గేమ్​ ప్లాన్ ఏంటి?' అని రాహుల్ సర్ అతడిని అడిగాడు. దీనికి అతడు 'ప్లాన్ అంటూ ఏమీ లేదు సర్, అవకాశం వస్తే తొలి బంతినే గాల్లోకి లేపేయడమే' అని చెప్పాడు. అతడు వీడియో గేమ్ ఆడుతున్నాడా? ఏంటి అని నేను అప్పుడే అనుకున్నా" అని శాంసన్ నవ్వుతూ వైభవ్ అరంగేట్రం కంటే ముందు జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నారు. ఆ సంభాషణలో చెప్పినట్లే వైభవ్ ఆ మ్యాచ్​లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్​గా మలిచాడు.

కాగా, గతేడాది లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​తో వైభవ్ ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్​లో ఓపెనర్​గా బ్యాటింగ్​కు దిగిన వైభవ్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్​గా మలిచి ఔరా అనిపించాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఆ ఓవర్​ నాలుగో బంతిని వైభవ్ కవర్స్ దిశగా స్టాండ్స్​కు పంపించాడు. అలా ఐపీఎల్​ కెరీర్​ను సిక్స్​తో ఆరంభించిన అతికొద్దిమంది క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. ఆ తర్వాత గుజరాత్​తో మ్యాచ్​లో 35 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త రికార్డ్ కొట్టాడు.

"అదే నా కల"
ఇక ఇదే ఈవెంట్​లో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టును ఐపీఎల్​లో ఛాంపియన్‌గా నిలపడమే తన ఏకైక లక్ష్యమని వైభవ్ పేర్కొన్నాడు. "నేను వ్యక్తిగతంగా రాణించగలిగితే, దాని ప్రయోజనం మొత్తం జట్టుకు దక్కుతుంది. IPL వంటి భారీ టోర్నమెంట్‌లో ట్రోఫీని గెలవడం ప్రతి ఆటగాడి కల. ఆ దృఢ సంకల్పంతోనే నేను కూడా బరిలోకి దిగుతాను" అని అన్నాడు. అలాగే ఐపీఎల్​లో తాను ఏ రికార్డును బ్రేక్ చేయాలని అనుకుంటున్నావని అడగ్గా, లెజెండరీ క్రికెటర్ క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డును తాను బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

2013 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన క్రిస్ గేల్, చిన్నస్వామి స్టేడియంలో పూణె వారియర్స్ ఇండియా జట్టుపై కేవలం 66 బంతుల్లోనే అజేయంగా 175 పరుగులు సాధించాడు. T20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

14ఏళ్లకే వైభవ్ సంచలనాలు- సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడా? మార్చి తర్వాత టీమ్ఇండియా​లోకి?

U19 నుంచి IPLకు ప్రమోషన్- ఆర్సీబీలో యంగ్ క్రికెటర్లకు గోల్డెన్ ఛాన్స్!