ETV Bharat / sports

'వాంఖడేను సైలెంట్ చేస్తాం'- కమిన్స్ స్టైల్​లో టీమ్​ఇండియాకు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ వార్నింగ్

టీమిండియాకు సామ్ కరన్ హెచ్చరిక- ముంబయి క్రౌడ్‌ను సైలెంట్ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు- ​పాట్ కమిన్స్ 'సైలెన్స్' వార్నింగ్‌ను గుర్తు చేసిన కరన్

India vs England Semi Final
India vs England Semi Final (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 11:27 AM IST

4 Min Read
Choose ETV Bharat

India vs England Semi Final : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం జరగబోయే భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుకు ముందే వాతావరణం వేడెక్కింది. మైదానంలోకి అడుగుపెట్టక ముందే ఇంగ్లాండ్ ఆటగాళ్లు మైండ్ గేమ్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత అభిమానుల్లో సెగ పుట్టిస్తున్నాయి. వాంఖడే స్టేడియం అంటేనే క్రికెట్​కు పెట్టింది పేరు, అక్కడ ప్రేక్షకుల అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. అటువంటి స్టేడియాన్ని నిశ్శబ్దంగా మారుస్తామని సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముంబయిలో జరగబోయే ఈ కీలక పోరులో గెలిచి ఫైనల్​కు దూసుకెళ్లాలనే కసితో ఉన్న టీమిండియాను ఆ మాటలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాలి. ఈ నేపథ్యంలో అతను చేసిన 'సైలెన్స్' హెచ్చరిక వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

వాంఖడేను నిశ్శబ్దంగా మారుస్తాం- సామ్ కరన్ సంచలన వ్యాఖ్యలు
సెమీ ఫైనల్​కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్​లో సామ్ కరన్ మాట్లాడుతూ గురువారం వాంఖడే స్టేడియం చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు నవ్వుతూ చెప్పారు. "ఒకవేళ స్టేడియంలోని ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉన్నారంటే, మైదానంలో ఇంగ్లాండ్ జట్టు చాలా బాగా రానిస్తుందని అర్థం" అని వివరించారు. ముంబయి క్రౌడ్ ఇచ్చే మద్దతు తమకు తెలుసని, కానీ వారిని సైలెంట్​గా చేయడం ద్వారా భారత్​పై ఒత్తిడి పెంచవచ్చని కరన్ అభిప్రాయపడ్డారు. అభిమానుల అరుపులను నియంత్రించగలిగితే తాము మ్యాచ్​లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లేనని ధీమా వ్యక్తం చేశారు.

పాట్ కమిన్స్ సెంటిమెంట్ భారత్​కు పాత గాయం గుర్తు చేసిన కరన్
సామ్ కరన్ చేసిన ఈ వ్యాఖ్యలు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో అహ్మదాబాద్​లోని లక్షా ముప్పై రెండు వేల మంది ప్రేక్షకులను నిశ్శబ్దంగా మార్చడం కంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి ఉండదని కమిన్స్ చెప్పారు. అన్నట్లుగానే ఆ మ్యాచ్​లో ఆస్ట్రేలియా భారత్​ను ఓడించి లక్షలాది మంది భారతీయుల హృదయాలను బద్దలు కొట్టింది. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో సామ్ కరన్ కూడా స్టేడియంను సైలెంట్ చేస్తామంటూ వ్యాఖ్యానించడం భారత అభిమానులకు ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.

భారత గడ్డపై అనుభవం- హోరును తట్టుకునే సత్తా
భారత్​లో ఆడేటప్పుడు ఉండే హై వోల్టేజ్ శబ్దాన్ని తాము బ్లాక్ చేయగలమని సామ్ కరన్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ వంటి టోర్నీల వల్ల ఇక్కడి వాతావరణానికి, ప్రేక్షకులకు బాగా అలవాటు పడ్డారని చెప్పారు. "చాలా మంది యువ క్రికెటర్లు భారత్​తో సెమీస్ ఆడాలని కలలు కంటారు, మాకు ఆ అవకాశం రావడం గొప్ప విషయం" అని కరన్ అన్నారు. స్టేడియం లోపల ఎంత సౌండ్ ఉన్నా దానిని ఒక అద్భుతమైన అనుభవంగా తీసుకుంటామని, కానీ అంతిమంగా మా లక్ష్యం మాత్రం స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చి ఫైనల్​కు వెళ్లడమేనని కరన్ స్పష్టం చేశారు.

వరుసగా మూడో సెమీస్
భారత్, ఇంగ్లాండ్ జట్లు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్​లో తలపడటం ఇది వరుసగా మూడోసారి. 2022లో అడిలైడ్​లో జరిగిన సెమీస్​లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్​ను చిత్తు చేయగా, 2024లో జార్జ్ టౌన్ వేదికగా జరిగిన పోరులో భారత్ 68 పరుగులతో ప్రతీకారం తీర్చుకుంది. ఈ నేపథ్యంలో సామ్ కరన్ మాట్లాడుతూ 2022లో తాము ఆడిన ఆ 'పర్ఫెక్ట్ గేమ్'ను మళ్లీ రిపీట్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ రోజు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని, జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అద్భుతమైన బ్యాటింగ్​తో భారత్​ను ఓడించినట్లు గుర్తు చేసుకున్నారు.

పర్ఫెక్ట్ గేమ్ అక్కర్లేదు కేవలం గెలుపు చాలు
ఈ మ్యాచ్​లో తమ జట్టు నుంచి ఒక పర్ఫెక్ట్ గేమ్ వస్తుందా లేదా అనే విషయం తనకు అనవసరమని సామ్ కరన్ వ్యాఖ్యానించారు. "నాకు పర్ఫెక్ట్ గేమ్​తో పనిలేదు, ఏదో ఒక రకంగా మ్యాచ్ గెలిచి మరోసారి ప్రపంచకప్ ఫైనల్​కు చేరుకోవడమే నా ప్రధాన లక్ష్యం" అని కుండబద్దలు కొట్టారు. గత ఐదు వారాలుగా తాము పడుతున్న కష్టమంతా ఈ సెమీస్ గెలిచి ఫైనల్ చేరడానికేనని వివరించారు. గెలుపు కోసం ఎంతటి కష్టనష్టాలకైనా సిద్ధమని, వాంఖడే స్టేడియంలో భారత్​ను వారి సొంత ప్రేక్షకుల ముందే ఓడించి తీరుతామని సామ్ కరన్ ధీమా వ్యక్తం చేశారు.

వాంఖడే స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియం కంటే చిన్నదైనప్పటికీ, అక్కడి ప్రేక్షకులు చేసే సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముంబయి ప్రేక్షకుల మద్దతు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియాకు కొండంత బలాన్ని ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సామ్ కరన్ వంటి ఆటగాళ్ల మైండ్ గేమ్స్​కు పడిపోకుండా, తమ సహజమైన ఆటతో ఇంగ్లాండ్​కు బుద్ధి చెప్పాలని టీమిండియా భావిస్తోంది. వెస్టిండీస్​పై సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ఇచ్చిన ఊపుతో భారత్ ఈ మ్యాచ్​లో కూడా పైచేయి సాధించాలని పట్టుదలతో ఉంది. సామ్ కరన్ విసిరిన ఈ 'సైలెన్స్' సవాల్ ను టీమిండియా స్వీకరించి, వాంఖడేలో ఇంగ్లాండ్ బౌలర్ల పని పడుతుందో లేదో చూడాలి.